Saturday, January 3, 2009

కవితా సమాహారం 9

అత్యాచారాలు

నేల రాలిన మరొక ధృవ తార
స్వప్నిక అనంత లోకాలకు పయనం
మానవుడు చంద్రయానం చేయు
ప్రస్తుత వైజ్ఞానిక విప్లవ కాలం లో
కలియుగ దుశ్శాసనుల అమానుష
పైశాచిక రాక్షస క్రీడకు
మరొక అభాగ్యురాలు బలి
సభ్య సమాజం సిగ్గుతో
తలవంచుకోవాల్సిన స్థితి
ఆధునికత ముసుగులో
అహంకారం మదించిన పురుష పుంగవుల
అమానుష , రాక్షస కృత్యాలకు
ముగింపు ఎన్నడో ?
అభాగినులకు రక్షణ కరువు
పస లేని చట్టాలు
చోద్యం చూస్తున్న యంత్రాంగం
ఓ మానవత్వమా ! ఇకనైనా మేలుకో


భూత దయ

ఏకో దేవ : సర్వ భూతేషు గూఢ : అన్నది ఆర్యోక్తి
సకల వేద సారం భూత దయ
అందరిలో ప్రజ్వరిల్లేది ఒకే పరబ్రహ్మం
సర్వుల పట్ల మైత్రీ భావం
నశీంచును మదిలో భేధ భావం
మనసు అగును కరుణా సముద్రం
పరులను మన వలె చూడగలగడం
నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న
ఏసు ప్రభువు బోధలు కావాలి మనకు ఆదర్శం
అలవర్చుకున్నచో సహనం
సమరస భావం, సర్వ జీవ సమానత్వం
మానవుడు అగును మహనీయుడు

కర్మ సిద్ధాంతం

కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన
మన కష్ట నష్టాలకు మన దుష్కర్మలే కారణం
రేపటి అందమైన జీవితం కొరకు
నేడు సత్కర్మల నాచరించుట అత్యావశ్యకం
క్రియకు ప్రతి క్రియ ఎల్లప్పుడూ సమానమే
మంచి భవిష్యత్తు కొరకు ధర్మాన్నే కాంక్షిస్తూ
ధర్మాన్నే ఆచరించడం శ్రేయస్కరం
మనల్ని ఎల్లవేళలా వెంటబెట్టుకొని వుండి
సర్వా కాల సర్వావస్థలయందు
రక్షించునది ధర్మం మాత్రమే
సత్కర్మలనే విత్తనములను నేడు నాటిన
అష్టైశ్వర్యములు, నిత్య, శాశ్వత ఆనందములతో కూడిన
బంగారు పూదోట వంటి భవిష్యత్తు
పంట రేపు మనకందడం తధ్యం
ఈ సత్యాన్ని మదిలో పదిలపరచుకొని
అనుక్షణం ఆచరించడం అత్యున్నత సాధన

Thursday, January 1, 2009

కవితా సమాహారం – 8

సాయి ఆరాధన

ప్రాత: కాలమందే పవిత్ర హృదయులై
సాయి ఆరాధనను గావించుట సర్వ శ్రేష్టం
నాలుగు కాలములయందు సాయి హారతులను
భక్తితో, త్రికరణ శుద్ధితో పాడుట గొప్ప సాధన
అన్ని పాపములను, మానసిక వ్యధలను
దూరం చేయు సంజీవని ఔషధం
సర్వ మానవ సౌభ్రాతృత్వం,
సర్వ మత సమానత్వం
త్రికరణ శుద్ధిగా దీన జనోద్ధారణ
నిత్య సాయి నామస్మరణ మన సాధన కావాలి
సాయి పలుకులే వేద , ధర్మ శాస్త్రములు
సాయినామమే వేద మంత్రములు
సాయిని మనసా వాచా నమ్మి కొలిచెడి
భక్త జనావళికి భక్తి,ముక్తి కరతమలాకములు


శ్రీ సాయి లీలావైభవం 1

సాయి దివ్య నామం పరమ పుణ్య ధామం
అదియే మోక్ష తీరం ,వేద సారం
తన నాశ్రయించిన వారికి
అలవోక దృష్టి ప్రసాద
మాత్రం చేతనే అష్టైశ్వర్యాలను
ప్రసాదించే రాజాధిరాజు
అను నిత్యం భిక్షాటన ద్వారా
తన భక్తుల పాపములను స్వీకరించి
వారిని పాప విముక్తులను చేసి,
సన్మార్గ వర్తులను గావించి
తుదకు ముక్తిని ప్రసాదించే దయామయుడు
ఎందరో వ్యంధ్య స్త్రీలు శ్రీ సాయి
దర్శన, స్పర్శ మాత్రమునే సత్సంతానవంతులైన
తీరు బహు అపురూపం అద్వితీయం
తనను త్రికరణ శుద్ధిగా నమ్మి కొలిచెడి వారికి
ఏనాడూ అన్న వస్త్రాదులకు లోటు రానివని దయమూర్తి
దీనుల పాలిటి దయా సముద్రులు
ఆశ్రితులకు అన్నపూర్ణావిభువులు శ్రీ సాయి
శ్రీ సాయి పాదములే మనకు శరణ్యం
శ్రీ సాయి నామమే మనకు సుస్వర వేద మంత్రములు


శ్రీ సాయి లీలావైభవం 2

సాయి దివ్య నామం పరమ పుణ్య ధామమం
అదియే మోక్ష తీరం వేద సారం
సర్వ దేవతా మూర్తి, పరమాత్మ స్వరూపుడు
అద్యంత రహితుడు, దీనుల పాలిటి కామధేనువు
దీనార్తులు, ఆశ్రితుల పాలిటి కల్పవృక్షం
సాయి పవిత్ర చరణముల నాశ్రయించిన వారికి
ఎల్ల వేళలా రక్షణ కవచమందించి
కంటికి రెప్పలా కాపాడే దేవదేవుడు
భక్తుల హృదయములలో పేరుకొని పోయి వున్న
అజ్ఞానంధకారములను పటాపంచలు చేసి
జ్ఞాన జ్యోతులను వెలిగించి
సన్మార్గ వర్తులను గావించి
ముక్తి మార్గములో పయనింపజేయు సద్గురువు
శ్రీ సాయిని మనసా వాచా నమ్మి
త్రికరణ శుద్ధిగా కొలిచిన వారికి
కష్టము, నష్టములు, కన్నీళ్ళు
చింతనలు, సమస్యలు, వ్యధలు కడు దూరం
నిత్య, శాశ్వత పరమానందం ప్రాప్తం.