Sunday, January 6, 2008

సద్గురువు

త్రిమూర్తుల స్వరూపమైన సద్గురువు
సర్వాంతర్యామి అని గ్రహించి
అన్ని రకముల అహంకారములను త్యజించి
సద్గురువులను శరణు పొందిన
మన అజ్ఞానము శ్రీఘ్రమే నశించును
ఇక మరే విధములైన బోధల అవసరము లేదు
సూర్యుని ముందు అంధకారము వుండని రీతిన
సద్గురువు సమక్షంలో మనకు భవసాగరము వుండదు
అన్ని రకములైన బంధాల నుండి విడిపడి
పరాన్ముఖులైన వారే సద్గురువు యొక్క
అనుగ్రహ వర్షంలోతడిసి మద్దగును,
జీవితం అగును సార్ధకం
అనుపమానమైన పరమానందం లభ్యం
నేను నాది అన్న భావం నుండి బయట పడి
అహంభావం లేక కర్మలను ఒనరించడం మన తక్షణ కర్తవ్యం

వివేచన


పైకి తలెత్తి చూసిన కొలదీ
విశాలమైన ప్రపంచం అగుపించు రీతిన
మానవునికి తన అంతరంగిక
స్థాయి పెంచుకోవడం అత్యావశ్యకం
వివేచనతో జ్ఞానమును పెంచుకోవడం
విశాలమైన హృదయమును కుంచింప జేసే
స్వార్ధమును తగ్గించుకోవడం
పరుల కోసం, పరమార్ధం కోసం జీవించడం
ఎల్లప్పుడూ లోక కళ్యాణమును త్రికరణ శుద్ధిగా
కోరుకోవడంమహనీయుల లక్షణం
చంచలమైన మనస్సును అదుపులో
వుంచుకొను వాడు జగద్విజేత అగును
గంగుగోవు పాలు గరిటడైననూ చాలన్నట్లుగా
బ్రతికిన మూణ్ణాళ్ళూ మహనీయుల
జీవనం అవలంబించుకోవడం అవసరం

నిస్వార్ధ తత్వం

తన కోసమే జీవించువాడు స్వార్ధపరుడు
పరుల కోసం సర్వం త్యాగం చేసి
వారి శ్రేయస్సే తన జీవిత లక్ష్యంగా భావించి
తదనుగుణంగా కృషి సల్పువాడు నిస్వార్ధపరుడు
స్వార్ధపరుని జీవితం గడ్డి మొక్కతో సమానం
ఎందుకూ , ఎవరికీ ఉపయుక్తం కానిది
తన కంటూ ఒక ఉనికిని సాధించుకోనిది
నిస్వార్ధపరుల జీవితం నిండుగా ఫలములను
ధరించు వృక్షము వంటిది
ఎన్ని రాళ్ళ దెబ్బలు తగిలిననూ ఓరిమితో
సహనముతో భరించి, ప్రతిఫలాపేక్ష లేక
నిత్యం రుచికరమైన ఫలములను, ఆశ్రయమును ఇస్తూ
తన కంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొనును
నిస్వార్ధ తత్వమే ఊపిరిగా
పరుల శ్రేయస్సే ధ్యేయంగా
జీవించువారి జీవితం కడు ధన్యం
ఆ సర్వేశ్వరునికి అత్యంత ప్రీతి పాత్రకరం

జ్ఞానోదయం

హే దీన దయాళువు,కరుణా సింధు
భక్త జన సంరక్షకా , సర్వేశ్వరా
మాపై నీ కరుణామృత చూపులను ప్రసరించు
త్రిమూర్తులను సైతం భ్రాంతిలో పడవేయగల
శక్తివంతమైన మాయలో పరిభ్రమిస్తున్నాము
ప్రేమ, కరుణ, అనురాగం, అప్యాయత వంటి
సద్గుణములను త్యజించి
మాయా, మోహిత అరిష్వడ్వర్గములకు లోబడిపోయి
భ్రాంతి పూరిత జీవనం గడుపుతున్నాము
అందుకే మా జీవితమంతా కష్టాలు, కన్నీళ్ళే
అనుక్షణం చింతనలు,ఆందోళనలు
మరుక్షణంలో ఏం జరుగునో అన్న భయంతో
సత్యానికి దూరంగా జీవిస్తున్నాము
శాశ్వతమైన పరమ శాంతికి దూరమై
అశాంతి , అసంతృప్తులతో మా
హృదయాలను నింపుకున్నాము
ఈ జీవన విధానం అసత్యమని, జీవించతగనిదని
నీ కృప వలన మాకు జ్ఞాదోయమయ్యింది
మా పాలిట దయతో, కరుణతో, మమ్మల్ని ఆశీర్వదించి
అసత్యం నుండి సత్యం వైపుకు
చీకటి నుండి వెలుగు లోనికి మమ్మల్ని నడిపించు
పగ, ద్వేషం, అహంకార రహిత జీవనాన్ని ప్రసాదించు

Tuesday, January 1, 2008

నవ్య భారత ఆవిర్భావం

అందరికీ నాణ్యమైన విద్య
చేతి నిండా పని
రెండు పూటలా తినడానికి తిండి
తల దాచుకోవడానికి స్వంత గూడు
శారీరక ఆరోగ్యం కోసం వైద్య సౌకర్యాలు
కుల , మత, వర్గ, ధనిక,
పేద వర్గాలనే భేధాలు లేక
అందరికీ, అన్ని వేళలా లభించిన నాడే
మన మహాత్ముడు కలలు కన్న
సమ సమాజ స్థాపన సాధ్యం
అను క్షణం తమ ఉనికి కోసం
తపన పడే రాజకీయ నేతల అజెండా లో లేని
ఈ సమ సమాజ స్థాపన కొరకు
మనమే తక్షనం నడుం బిగించాలి
సోషలిజం అనేది వారు చెప్పే
ఊక దంపుడు ఉపన్యాసాలలోనో లేక
విద్యా వేత్తలు రచించే అందమైన పుస్తకాలలోనో లేక
ఎ సి గదులలో కూర్చోని పేద ప్రజల
అభ్యున్నతి కోసంపధకాలను రచించి ,శ్రమిస్తున్నామనే
భావం కలుగజేసే బ్యూరోకట్ల వలనో రాదు
దశాబ్దాలుగా అందరిచే అతి దారుణంగా
మోసగించబడుతున్న మనలోజ్ఞానోదయం కలిగి
నూతన సమాజ నిర్మాణం కోసం
మనమే ఎట్టి బేధ భావాలు లేక
చేతులు కలిపి శ్రమించిన నాడూ
నిజమైన నవ్య భారత ఆవిర్భావం సాధ్యం