Tuesday, May 27, 2008

భధ్రత లేని రైల్వే ప్రయాణాలు

రైలు ప్రయాణమంటే గుండెల్లో గుభేల్
నానాటికీ ఎక్కువౌతున్న రైలు ప్రమాదాలు
ఏటా వేల సంఖ్యల్లో ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు
అయినా ప్రభుత్వాలకు చీమైనా కుట్టనట్లు వుండని స్థితి
భద్రతా నిభంధనలను గాలికొదిలేస్తున్న అధికారులు
పెరగని ట్రాకులు , పెరిగే రైళ్ళు
తూ టూ మంత్రం గా మరమ్మత్తులు
ప్రమాదాల పిదప హంగూ,ఆర్భాటం చేసే అధికారులు
నామమాత్రమైన పారితోషికాలు
హడావిడిగా ఎంక్వయిరీ కమీషన్లు
ఆ పై నిపుణుల వివేదికలు బుట్టదాఖలు
ప్రతీ సారి కొండంత హామీలను గుప్పించే మంత్రి వర్యులు
అనంతరం షరా మామూలే
రైల్వే ప్రయాణాలు ఎప్పటి లాగనే సామాన్యుల పాలిటి మృత్యు దేవతలు

Monday, May 26, 2008

చింతన మంటలు

చితి మంటల కంటే హృదయం లో రేగే
చింతన మంటలు మరీ దుర్భరమైనవి
నిర్జీవమైన పార్ధీవ దేహాన్ని కాల్చునది చితి
సశరీరులుగా వుండగానే దహించునది చింతన
అనుక్షణం నరక అనుభవం చవి చూపునది చింతన
శారీరక గాయములు ఔషధ సేవ వలన ఉపశమనం
మానసిక గాయం ఏ ఔషధములకు లొంగనిది
మానవులను ప్రతీ క్షణం దహించి వేయునది
అసూయ, అహంకారం,లోభం,మోహం రౌద్రం,క్రోధం ఇత్యాది
అసురీ లక్షణములు మానవులలో చింతనను పెంచును
చిత్ర విచిత్రమైన వ్యాధులకు శరీరం అలవాలమౌతుంది
చింతన నుండి బయట పడడం మన తక్షణ కర్తవ్యం
ధ్యానం, యోగం,ప్రాణాయామం, భగవన్నామస్మరణ
సత్సంగం, సద్గంధ పఠన, పుణ్య క్షేత్ర దర్శనం
మహా పురుషుల పాద స్పర్శనం ఇత్యాది సత్కర్మల వలన
హృదయమును పవిత్ర పరచుకొని సన్మార్గం లో
నడత సాగించిన ఎట్టి చింతనలు దరి చేరవు

Sunday, May 25, 2008

వర్తమానం లో జీవనం

జరిగిన సంఘటనలను గూర్చి చింతిస్తూ
జరుగబోయే వాటి గురించి ఆందోళన చెందుతూ
వర్తమానాన్ని వృధా చేసుకొను వారు అవివేకులు
వర్తమానం బహు అమూల్యం
భూత కాలం చెల్లని నోటు వంటిది
భవిష్యత్తుకు వర్తమానం లో విలువ లేదు
గతం లో చేసిన పొరపాట్లను విశ్లేషించుకొని
తద్వారా విలువైన పాఠాలను నేర్చుకొని
భవిష్యత్తులో సాధించబోయే కార్యములకు
ప్రణాళికలు వేసుకొని, నిర్ధుష్టమైన
లక్ష్యాల నేర్పాటు చేసుకొని
వర్తమానం లో శ్రమించడమే విజయ సూత్రం
నిన్న లేదు , రేపు రాదు మనకు మిగిలినది నేడు మాత్రమే
అన్న సూక్తి బహు అమూల్యమైనది
సంతోషం, సౌందర్యం, ఆనందం అనుభవించుటకు
వర్తమానం లో జాగృదావస్థలో జీవించడం అత్యావశ్యకం
ఎడ తెగని వల్లమాలిన ఆలోచనలు
మానవులకు వర్తమానం లో జాగృదావస్థలో
జీవనానికి అవరోధాలు
ధ్యానం, యోగం ల ద్వారా మనసును
నియంత్రించుకోవడం వర్తమానం లో
జీవించుటకు కృషి సల్పడం మన తక్షణ కర్తవ్యం

Saturday, May 24, 2008

కానరాని మంచి సినిమా

రేలంగి రాజ బాబుల హాస్యం
ఘంటసాల, సుశీలమ్మ ల గాన మాధుర్యం
మల్లాది, అత్రేయ ల సాహిత్యం
స్వర రాజేశ్వర రావు, మామ మహదేవన్ ల సంగీతం
బాపు బొమ్మ ల్లాంటి నటీనటులు
ఆదుర్తి, విశ్వనాధుల సృజనాత్మకత
నేటి మన చిత్రాలలో పూర్తిగా మటుమాయం
అపహాస్యం అవుతున్న హాస్యం
అంగాంగ ప్రదర్శనలతో వ్యాయామం లాంటి నృత్యాలు
అర్ధం కాని మాటలు, అరుపు ల్లాంటి పాటలు
హోరెత్తించి శిరోభారం తెప్పిస్తున్న వాయిద్యాల ఘోష
అడుగడుగుకీ రక్త పాతం, పస లేని కధలు
ఇదీ నేటి చిత్రాల పరిస్థితి
నానాటికీ సంఖ్య ఎక్కువౌతున్నా వాసి తగ్గుతోంది
కుటుంబమంతా కలిసి చూదదగిన చిత్రాలు కనుమరుగు
మళ్లీ ఎన్నటికి వచ్చేను మంచి సినిమా ?

Friday, May 23, 2008

రోజుకో దినం మనకొద్దు

మదర్స్ డే, ఫాదర్స్ డే,సిస్టర్స్ డే
నాన్ ఆల్కహాలిక్ డే, డైబటీస్ డే,అంటూ రోజుకొక దినం
మన దేశం లోకి చొచ్చుకొస్తున్న వైనం ఎంత విచిత్రం
కని పెంచిన తల్లిదండ్రులను సర్వాకాల సర్వావస్థలయందు
గుర్తుంచుకొని కంటికి రెప్పలా కాపాడుకోవడం మన విధి
రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులను నిండు మనస్సుతో ఆశీర్వదించి
ఎల్లవేళలా వారికి అండ గా నిలబడడం మన రక్తం లో జీర్ణించుకున్న సాంప్రదాయం
మన సిరి సంపదలను, ఆయువు, ఆరోగ్యాలను నాశనం చేసి
అధమ: పాతాళానికి త్రొక్కి వేసే చెడు వ్యసనాలకు ఎల్లప్పుడు
దూరం గా వుండడం మన తక్షణ కర్తవ్యం
అహారాది నియమాలను, జాగ్రత్తలను అనుక్షణం పాటించి
సంపూర్ణ ఆరోగ్యం తో నిండునూరేళ్ళు ఆనందదాయక
జీవితం గడపడం మన లక్ష్యం కావాలి.
ఈ సిద్ధాంతాలన్నింటినీ ఆచరణపూర్వకం గా
మనకు అందించే మన హైందవ సాంప్రదాయం అద్భుతం
రోజుకో దినాన్ని పాటించమని చెప్పే పాశ్చాత్య సంస్కృతి మనకొద్దు

Thursday, May 22, 2008

కఠోర వచనములు

సర్వం బ్రూయాత్,ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్య మ ప్రియం
ఎల్లప్పుడు సత్యమును, మధురమైన మాటలను పలుకవలెనన్నది ఆరూక్తి
అప్రియ భాషణం అన్ని పాపాలలో కెల్లా నిష్కృతి లేనిది
పరుల నింద, కఠోర భాషణం , మనసును గాయపరచు విధం గా ఆరోపణలు చేయడం నిషిద్ధం
పరిహాసమునకైనా కఠోర భాషణం గావించడం అత్యం త పాపం
తూటాల వంటి వాగ్భాణాలు హృదయాన్ని చిధ్రం చేయును
మానవులలో సత్సంబంధాలను చిన్నా భిన్నం చేయును
ప్రియ భాషణం తేనె వలే మధురమైనది
శత్రువులను సైతం దరికి చేర్చి సంబంధ బాంధవములను పటిష్టం చేయును
ఎల్లవేళలా ప్రియ భాషణం గావించడం వాచిక తపస్సు
అన్ని తపస్సుల కంటే మేలైనది, మానవులను మహనీయులుగా మార్చునది
కఠోర వచనములను పలికి దశరధుని మరణానికి కారకురాలైన కైకేయి
రాయబారములో కృష్ణ భగవానుడిని తూలనాడి
తన వంశ నాశకుడైన దుర్యోధన సార్వభౌముల కధలు
సదా కావాలి మనకు స్పూర్తి దాయకం
కఠోర వచనములను సర్వదా తృజించడం శ్రేయస్కరం

Tuesday, May 20, 2008

బుద్ధుని జీవితం సదా స్మరణీయం

బుద్ధం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి
ఇతరుల కష్టాలను తనవిగా భావించి
వాటిని తీర్చుటకు అనుక్షణం తపించి
పరుల కొరకే తన జీవితాన్ని అంకితం చేసిన
బుద్ధుని జీవితం మనకు స్పూర్తిదాయకం
స్వచ్చమైన, పవిత్రమైన,ఉన్నతమైన వ్యక్తిత్వం గల్గిన
గౌతముడు జగద్గురువు,ఆర్త లోక పరాయణుడు
లోక కల్యాణం కోసం యావత్ సంసారమును
సంసారిక సుఖములను త్యాగం చేసి
సత్యాన్వేషణ కోసం తీవ్ర తపస్సు ఒనరించి
బోధి వృక్షం ఒడిలో ఆత్మ సాక్షాత్కారం సాధించిన బుద్ధుని జీవితం
పరమ పవిత్రం, ఆదర్శనీయం
సుఖమిచ్చు ఆనందం కంటే దుఖం కల్గించే బాధ ఎక్కువనియు
దుఖానికి మూలకారణమైన కోరికలను
జయించమన్న బుద్ధుని సిద్ధాంతం సదా ఆచరణీయం
అహింసా మూర్తి, కరుణాపూరిత హృదయంతో
సదా సత్యాన్వేషణ గావించే
బుద్ధుని పాదాలే మనకు శరణ్యం
దురాలోచనలను పారద్రోలి, ఏకాగ్రతతో ధ్యానమొనరించి
హృదయాన్ని పవిత్రం చేసుకొనడమే మన కర్తవ్యం
బుద్దుని సదా స్మరిస్తూ అడుగుజాడలలో నడుద్దాం
మన జీవితాలను పరోపకారానికే వినియోగిద్దాం

Sunday, May 18, 2008

సగటు మానవుడు

మ్రోగింది ఉప ఎన్నికల నగారా
ఎ సి రూముల నుండి బయట కొచ్చిన నేతలు
వివిధ రాజకీయ పక్షాలు ఆరంభించాయి బురద జల్లుకోవడం
ఒకరిపై మరొకరి మాటల తూటాలు
పేదవాడిపై నేతలలో హఠాత్తుగా ఉప్పొంగిన అభిమానం
చాలీ చాలని జీతాలతో కడుపు నింపని పనులతో
రోగ గ్రస్థమైన శరీరాలతో దుర్భరమైన
జీవితం గడుపుతున్న పేదవాడు అందరికీ
మరొక్కసారి గుర్తుకొచ్చాడు,అయ్యాడు ఓటరు దేముడు
ఘరానా నేతల నుండి అందుకుంటున్నాడు దండాలు
భగీరధ వాగ్దానాలు కురుస్తున్నాయి అతనిపై
సిద్ధాంతాలు పొసగకపోయినా చేతులు కలిపి
అనైతిక పొత్తులతో, రాత్రికి రాత్రే స్నేహం కలిపి
బద్ధ శత్రువులు కలిసి వచ్చిన వైనాన్ని
అతి చోద్యం గా చూస్తున్నాడు
అయినా మనసులో ఏ మూలో ఈ బ్రతుకులు మారవన్న
గట్టి నమ్మకం బలపడి పోయింది
తన ఓటుతో గద్దె నెక్కి తనపై స్వారీ చేసే
ఈ నేతలపై రవ్వంత విశ్వాసం కూడా లేదు
ఎన్నికలయ్యాక షరా మామూలే నేతలందరూ అంతర్ధానం
పల్లెలో సందడి మటుమాయం
తన జీవిత పోరాటం యధావిధిగా సాగుతుంది
ఈ భారతావనిలో సగటు మానవుని బ్రతుకు ఇంతే

ఆదర్శ పాలకులు

ప్రజలను పాలకులు బహు చక్కగా పాలించిన
దేశం సుభిక్షమౌతుందన్న భర్తృహరి
సుభాషితం మనకు ఆదర్శం
సనాతన పాలక ధర్మాలకు త్రిలోదకాలనిస్తూ
పదవి కోసం అనుక్షణం తపిస్తూ, తపన పడుతూ
పదవి నలంకరించిన అనంతరం
ప్రజా సంక్షేమాన్ని విస్మరించే
నేటి పాలకుల వైఖరి శోచనీయం
పదవి శాశ్వతం కాదు, ప్రజాహిత
కార్యక్రమముల ద్వారా అందరి
జీవితములలో వెలుగు నింపి తద్వారా
సాధించు సత్కీర్తియే శాశ్వతమన్న సత్యాన్ని విస్మరించిన
మన నేతాశ్రీలలో ఎన్నడు కలిగేను జ్ఞానోదయం ?
అధర్మం గా పెంచుకున్న ఆస్తులు అంతస్తులు
ఏనాటికైనా మంచు గడ్డ వలె తరిగిపోవడం తధ్యం
మంచి పాలకునిగా ఆర్జించుకున్న ఖ్యాతియే
ఆకాశం లో నక్షత్రాల వలే శాశ్వతం
అనుక్షణం పదవిని అంటిపెట్టుకొని వుండుటకు
అడ్డదారులు తొక్కే ప్రజా కంటకులకు
ఏనాటికైనా తప్పదు చీత్కారం
ఉన్నత పదవులను అధిష్టించే నేతలకు
కావాలి ఆదర్శమయ జీవన విధానం
ప్రజా సేవయే వారి పరమార్ధం కావాలి
ప్రజల కోసం అనుక్షణం తపించు వారు
సామ్రాట్ అశోకుని వలే చిరస్మరణీయులు
దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన
టంగుటూరి,పొట్టి శ్రీరాములు, మహాత్ముడు
వారికి కావాలి స్పూర్తి దాయకం
వారి అడుగు జాడలలో నడవడమే నేతల కర్తవ్యం

Saturday, May 17, 2008

నిస్వార్ధ జీవనం

ఎల్లలు లేకుందా పోతున్న మానవుల స్వార్ధం
ఈ సృష్టిలో వున్న ప్రతీ వస్తువునూ
తానే పూర్తిగా అనుభవించాలన్న స్వార్ధం
డబ్బు సంపాదన కోసం పశువు కంటే హీనం గా కష్టిస్తూ
సంపాదించిన డబ్బును అనుభవించక
ఆస్తులు, అంతస్తుల రూపం లో కూడబెట్టి
జీవితపు చరమాంకం లో దాయాదులకు అర్పణం
విధివంచితులై ఆకలితో అలమటించే
అన్నార్తులకు ఒక్క పైసా నైనా
దానం చేయలేని బలి చక్రవర్తి వారసులం
ధనార్జనలో మానవ సంభంధాలన్నీ దూరం
మమతానురాగాలకు, అప్యాయతానుభవాలకు లేదు స్థానం
వయసు ఆకర్షనలో పడి అనుభవించాలన్న
స్వార్ధం తో అనైతిక సంబంధాల నేర్పాటు
వంట మనిషి వలె, ఇంటి పనంతటిని చక్కబెడుతూ
కావల్సినప్పుడు సుఖం అందించేందుకే స్వార్ధం తో
పురుష పుంగవులు వివాహం చెసుకుంటున్న వైనం శోచనీయం
స్వార్ధ చింతన విషం కంటే ప్రమాదపూరితం
మానవులను అధ: పాతాళానికి క్రుంగదీయును
ఒక్క విషపు చుక్క కడివెడు పాలను విరుచునట్లు
ఒక్క స్వార్ధపు ఆలోచన ప్రశాంతం గా వుండే మనస్సును
కల్లోల భరితం ,అతలాకుతలం చేయును
నిస్వార్ధ జీవనమే అందమైన జీవితానికి సోపానం