Saturday, December 19, 2009

భగవద్దర్శనం

పూర్వం మందగిరి అరణ్య ప్రాంతం లో ఒక గురు కులం వుండేది. అక్కడికి దేశం నలుమూలలా నుండి ఎందరో విధ్యార్ధులు విద్యాభ్యాసం కోసం వస్తుండేవారు. ఆ గురుకులానికి అధిపతి చిదానంద మహర్షుల వారు. చిదానంద మహర్షి సకల వేద పారంగతుడు. సకల శాస్త్రాలను, పనిషత్తులను,పురాణేతిహాసాలను ఔపాసన పట్టిన దిట్ట. తన తప:శ్సక్తితో తన గురుకులానికి వచ్చే ఎందరికో ఎన్నో వ్యాధులను నయం చేసేవారు. తన శిష్యులను తన కంటే ఉత్తములుగా తీర్చి దిద్దాలని సదా తాపత్రయపడుతుండేవారు.

ఆ గురుకులంలో రామశాస్త్రి అనే బ్రాహ్మణ బాలుడు విద్యాభ్యాసం చేస్తుండేవాడు. రామశాస్త్రి స్వతాహాగా చాలా తెలివైన వాడు. ఏక సంధాగ్రహి. గురువు చెప్పిన అతి క్లిష్టమైన పాఠాలను ఠక్కున అర్ధం చేసుకొని గుర్తుంచుకొనడమే కాదు, అడిగినప్పుడల్లా వెంటనే తిరిగి అప్పజెప్పేవాడు. తాను నేర్చుకున్న పాఠాలలో సందేహాలు కలిగితే ఏ మాత్రం సంశయం లేకుండా గురువు గారి దగ్గరకు వెళ్ళి సందేహ నివృత్తి చేసుకునేవాడు. రామశాస్త్రి యొక్క బహుముఖ ప్రజ్ఞ కు,తెలివితేటలకు సాటి విద్యార్ధులే కాక చిదానంద మహర్షి సైతం ఆశ్చర్యపోతుండేవారు.

ఒక సారి రామశాస్త్రి మహర్షుల వారు చెప్పిన భగవంతుని సర్వ వ్యాపక తత్వం అనే పాఠాన్ని తిరిగి వల్లె వేస్తుండగా భగవంతుడు ఎలా వుంటాడు అనే సందేహం కలిగింది. వెంటనే ధ్యానం చేసుకుంటున్న మహర్షుల పాదాలకు నమస్కరించి తన సందేహాన్ని తెలియజేసాడు. "గురుదేవా ! మీరు భగవంతుడు ఈ సకల చరా చర సృష్టిలో చివరకు జడమైన పధార్ధాలలో కూడా అంతటా వ్యాపించి వుంటాడని తెలియజేసారు. అసలు ఆ పరమాత్ముని స్వరూపమేమిటి ? ఏ రూపంలో ఈ విశ్వమంతటా వ్యాపించి వున్నాడు ? ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలని నాకు గాఢం గా వుంది"

శిష్యునికి వచ్చిన సందేహం విని మహర్షుల వారు ఎంతో సంతోషించి భగవంతుని సర్వ వ్యాపకత్వం గూర్చి మరింత విపులంగా తెలియజెసి , ఆఖరులో " ఆ భగవంతుని దర్శించాలన్న నీ కోరిక చాలా పవిత్రమైనది మరియు ఉన్నతమైనది.అయితే కేవలం కోరిక వుంటే సరిపోదు. ఆ సర్వేశ్వరుడిని దర్శించాలన్న ఆకాంక్ష తీవ్రం గా వుండాలి.అప్పుడే భవద్దర్శనం ప్రాప్తమౌతుంది" అని ఉద్భోదించారు.

"నాకు ఆ దేవుడిని దర్శించాలన్న కోరిక చాలా ఎక్కువగా వుంది గురుదేవా ! మీ తప:శ్శక్తితో ఎట్లాగైనా నాకు ఆ ప్రాప్తం కలుగజేయండి" అని ప్రార్ధించాడు రామశాస్త్రి.

శిష్యుని మాటలు విని చిన్నగా మందహాసం చెసి "తప్పకుండా నాయనా ! సమయం వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం చేయిస్తాను" అని అన్నారు మహర్షుల వారు.

ఆ సమాధానంతో అప్పటికి సంతృప్తి చెందినా ప్రతీ రోజూ భగవంతుడు ఎలా వుంటాడా అని ఆలోచించసాగాడు రామశాస్త్రి. భగవంతుడు ఏ రూపంలో వుంటే ఈ విశ్వమంతటా వ్యాపించి వుండగలడు? ఆ రూపాన్ని ఒక్కసారి దర్శిస్తే గాని తన సంశయం తీరదని ధృఢంగా నిశ్చయించుకున్నాడు.అదే విషయాన్ని మహర్షుల వారిని పదే పదే అడగసాగాడు.

ఒకరోజు చిదానంద మహర్షుల వారు రామశాస్త్రిని తనతో పాటు సముద్ర స్నానానికి రమ్మన్నారు.అలాగేనని గురువుతో పాటు వెళ్ళాడు రామశాస్త్రి. ఇద్దరూ నడుమ లోతు నీటిలోకి దిగి స్నానం చెయ్యసాగారు. ఇంతలో మహర్షుల వారు రామశాస్త్రి పిలక పట్టుకొని హఠాత్తుగా నీళ్ళలోనికి ముంచేసారు.ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపోయిన రామసాస్త్రి భయాందోళనలతో "గురుదేవా ! నన్ను రక్షించండి. నేను చచ్చిపోతున్నాను,నాకు ఊపిరి ఆడడం లేదు" అంటూ బిగ్గరగా ఆర్తనాదం చేయసాగాడు.అంతే కాక ఒడ్డున పడిన చేపపిల్లలా కాళ్ళు,చేతులు గట్టిగా కొట్టుకోసాగాడు.గురువు గారు పట్టిన పట్టును విడువకపోయేసరికి ఇక తనకు ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లేనని, తన అహంకారానికి గురువు గారి ఈ విధంగా శిక్షిస్తున్నారని నిర్ణయించుకున్నాడు రామ శాస్త్రి.

సరిగ్గా అప్పుడే శిష్యుని పిలక పట్టుకొని నీళ్ళ నుండి పైకి లాగారు మహర్షుల వారు. ఆ చర్యతో ఒకింత ఉపశమనం పొందాడు రామశాస్త్రి.

'నీళ్ళలో వుండేటప్పుడు నీకేమనిపించింది? దేని కోసం పరితపించావు? "ప్రశ్నించారు చిదానంద మహర్షి.
"గురుదేవా! నీళ్ళలో మునిగిపోయినప్పుడు ఊపిరి అందలేదు.మరణం తధ్యమని భావించాను.కాస్తంత ఊపిరి లభిస్తే చాలని భావించాను" వినయంగ చెప్పాడు రామశాస్త్రి.

"నువ్వు ఇంతకాలంగా అడుగుతున్న ప్రశ్నకు ఇదే సమాధానం"చెప్పారు చిదానంద మహర్షి. "నీటిలో మునిగిపోయినప్పుడు ఊపిరి కోసం,ప్రాణానికి రక్షణ కోసం ఎలా పరితపించావో అంతే ఆర్తితో భగవంతుని కోసం పరితపించినప్పుడు ఆ సర్వేశ్వేరుడు తప్పక తన దర్శన భాగ్యం కలుగజేస్తాడు.భగవద్దర్శనం కోసం కావల్సినంత కేవలం ప్రేమ, భక్తి మరియు తీవ్రమైన ఆకాంక్ష,ఐహికపరమైన కోరికలతో అనుక్షణం కొట్టుమిట్టాడే వారికి భగవద్దర్శనం అసాధ్యం. ఆ విధంగా కృషి చేసి నీ లక్ష్యాన్ని సాధించుకో."

గురుదేవుల మాటలకు రామశాస్త్రి ఎంతో సంతోషించి కళ్ళ నీళ్ళ పర్యంతమై పాదాభివందనం చేసాడు.

ఆత్మ విశ్వాసమే శ్రీరామ రక్ష

పూర్వం మగధ దేశం లో నివసించే రామశర్మ అనే బ్రాహ్మణుడు వర్తకం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆతనికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. భార్యా చాలా అనుకూలవతి, సత్వ గుణ సంపన్నురాలు. ఫిల్లలను, భర్తనూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ వుండేది. కోరికలను అదుపులూ వుంచుకుంటూ సంతృప్తి తో జీవి స్తుండడం వలన ఆందొళనలు, అశాంతి వారికి ఆమడ దూరం లో వుండేవి.అత్యాశకు పోకుండా కొద్దిపాటి లాభలతో వర్తకం చేస్తుండడం వలన రామ శర్మ యొక్క వ్యాపారం సాఫీగా సాగిపోతూ వుండేది. పైగా కల్తీ లేని సరుకులను తక్కువ ధరకు అమ్ముతాడన్న మంచి పేరు కూడా వచ్చింది.

రోజులన్నీ ఒకేలా వుంటే దానిని జీవితం అని ఎందుకు అంటారు? రామ శర్మ భార్యకు అనారోగ్యం వచ్చింది. దూర దేశం లో వైద్యం చేయించడం మొదలుపెట్టాడు. ఇద్దరు పిల్లలకు పెళ్ళిళ్ళి కూడా చేసేసాడు. వయో భారం వలన ఇదివరకటిలా వ్యాపారం చెయ్యలేకపోతున్నాడు. ఆదాయం మందగించింది, ఖర్చులు ఎక్కువయ్యాయి. పిల్లలు వాపారం నిమిత్తం దూర దేశాలకు వలస వెళ్ళిపోయి తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేసారు.జీవితం లో ఎదురైన ఈ కష్టాల పరంపరను తట్టుకోలేక తల్లడిల్లిపోయాడు.

ఆ సమయంలో వారి గ్రామానికి ఒక సాధు పుంగవుడు వచ్చారు. ఆయన సర్వసంగ పరిత్యాగి. సకల వేద పారంగతుడు. ఊరూరూ తిరిగుతూ అధ్యాత్మిక గోష్టి గావిస్తూ ప్రజలను సన్మార్గంలో నడిపించ యత్నించేవారు.ఆయన వద్దకు వళ్ళి పాదాలపై పడి తన కష్టాలను విన్నవించుకున్నాడు రామశర్మ.

ఆతని మాటలను విన్న ఆ సాధు పుంగవుడు చిరునవ్వుతో” నాయనా ! కష్టాలు, సుఖాల పరంపర ప్రతీ వారి జీవితం లో తప్పనిసరి. వాటిని ధైర్యం తో, ఆత్మ విశ్వాసం తో ఎదుర్కోవలే గాని పిరికితనంతో వాటి నుండి పారిపోకూడదు. పిరికి వానికి ఇహ పరములు రెండూ చెడుతాయి. ధర్మానికి మారుపేరైన శ్రీ రామ చంద్రునికి, మహలక్ష్మీ అవతారమైన సీతమ్మ తల్లికీ కష్టాలు తప్పలేదు కాదా! రాజ్య భోగాలు దూరమై పన్నెండేళ్ళూ వనవాసం చేసి పడరాని కష్టాలు పడ్డారు. సాక్షాత్తు శ్రీ కృష్ణుడు తోడున్నా పాండవులు ఎంతటి కష్టాలు పడ్డారో మనందరికి తెలుసు కదా! వారి కష్టాలతో పోలిస్తే నీకు వచ్చినవి ఎంతటివో ఒక్కసారి ఆలోచించు. జీవితాంతం సుఖాలు మాత్రమే వుండాలి కష్టాల నీలి నీడ మనపై పడకూడదని భావించడం అవివేకం. చేదు తిన్న తర్వాతే తీపి యొక్క తీయనత్వం అనుభవమగు అన్న రీతిన కష్టాలను చవి చూసినప్పుడే సౌఖాల లోని మాధుర్యం మనకు అర్ధమౌతుంది. ఆన్ని ద్వందాలనూ సమంగా స్వీకరించే ఓర్పు,నేర్పు మనం అలవరచుకోవాలి.

కష్టాలనేవి గురువు వంటివి. మనకు జీవిత సత్యాలను బోధించదానికి, ఓర్పు, సహనం, విశ్వాసం వంటి సద్గుణాలను నేర్పడానికే వస్తాయి. వాటిని చిరునవ్వుతో ఎదుర్కొని అధిగమించాలే కాని బెంబేలెత్తి పారిపోకూడదు” అని ఉద్భోదించారు.

అమృతతుల్యమైన ఆ మాటలకు రామశర్మకు జ్ఞానోదయం అయ్యింది.జారిపోయిన ఆత్మ విశ్వాసాన్ని మళ్ళీ నింపుకున్నాడు. ధైర్యంతో ముందుకు సాగి మళ్ళీ జీవితం లో ఉన్నత స్థాయిని సాధించాడు.

చీకటి వెలుగులు, అమావాశ్య పౌర్ణమి , రాత్రి పగలు వలె ద్వందాలు. ప్రతీవారి జీవితం లో ఈ చక్రభ్రమణం తప్పని సరి.కష్టాలు వచ్చినప్పుడు పరిస్థితులను, ఇతరులను నిందించకుండా భగవంతునిపై భారం వేసి ఆత్మ విశ్వాసంతో ఆ పరిస్థితి నుండి బయట పదే మార్గం ఆలోచించాలి.

సుఖాలలో మునిగి తేలుతున్నప్పుడు భగవంతుని విస్మరించరాదు. సదా భగవన్నామస్మరణ చేయడం, సత్కర్మలు ఆచరించడం, కరుణ, జాలి, క్షమలతో పరులను ప్రేమించడం, ఇతరులకు వీలైనంతగా సహాయం చేయడం, అన్నార్తులను ఆదుకోవడం వంటి సత్కార్యాలను చేస్తే భగవంతుడు సంతోషించి మానవులను భవిష్యత్తులో కష్టాల కడలిలో మునిగిపోకుండా కాపాడుతాడు. కామ, క్రోధాది అరిష్డ్వర్గములను లోబర్చుకొని సత్వ గుణ సంపన్నులమై శాంతియుత జీవనం సాగించుట అత్యావశ్యకం. ఇతరులను తమతో పోల్చుకొని తాము దురధృష్టవంతులమన్న నైరాశ్యాన్ని సత్వరం విడనాడాలి. ఈ సృష్టిలో జరిగే ప్రతీ సంఘటన ఈశ్వరేచ్చ ప్రకారమే జరుగుతుంది. సంపదలు కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చు కానీ ఆత్మ విశ్వాసం, ధైర్యం కోల్పొతే మాత్రం తిరిగి సాధించుకోలేము.

Friday, December 18, 2009

ధర్మాచరణే శ్రేష్టం

ధర్మార్ధ, కామ,మోక్షములను పురుషార్ధములని మన వేదాలు నిర్వచించాయి. అంటే ఏన్నో వేల జన్మల అనంతరం లభించే ఈ అపురూపమైన మానవ జన్మ ఎత్తిన ప్రతీవారు తప్పక సాధించవలసిన విషయములివి అని అర్ధం. వీటిలో ఏ ఒక్కటి సాధించలెకపోయినా ఎత్తిన ఈ మానవ జన్మకు విలువ వుండదు.ఈ పురుషార్ధముల వరుస క్రమాన్ని పరిశీలిస్తే ధర్మం ప్రధమ స్థానం లో వుంది.దీనిని బట్టి ధర్మాచరణ మరియు ధర్మయుతమైన జీవనాన్ని కొనసాగించవల్సిన ఆవశ్యకతను మన వేదాలు నొక్కి వక్కాణించాయి.

ఐహిక విషయ వాంచలు, భోగ భాగ్యాలే కాక మైధునముల విషయములను కూడా ధర్మయుతంగానే మనం సాధించుకోవాలి , అనుభవించాలి. మనం వేసే ప్రతీ అడుగు, ప్రతి ఆలోచనా కూడా ధర్మానుకూలంగానే వుండాలి.ఇది సృష్టి నియమం. ఎంతటి మహా భక్తుడైనా వీటిని అధర్మయుతంగా సాధించాలని యత్నిస్తే అధోగతి పాలు కాక తప్పదు. ఇందుకు మన పురాణాలలో లెక్కకు మించిన తార్కాణాలు వున్నాయి.

రాక్షసరాజైన హిరణ్య కశిపుడు దేవతలను లొంగదిసుకోవడానికి బ్రహ్మ దేవుని గూర్చి అతి కఠోరమైన తపస్సు చేసాడు. మహర్షులకు సైతం సాధ్యం కాని రీతిన తపస్సు ఒనరించాడని మన పురాణాలు తెలియజెస్తున్నాయి. ఆయన తపస్సుకు సంతోషించి బ్రహ్మదేవుడు ఏదైనా వరం కోరుకోమని అడిగితే అజ్ఞానం, గర్వాహంకారములతో తల్లి కడుపులో నుండి పుట్టక,రాత్రి, పగలు కాక, మనిషి, జంతువు కాక నేలమీద, ఆకాశం లో కాక మరణించకుండునట్లు వరం పొందాడు. ఇది ఎంతటి అధర్మ యుతం ? సృష్టికి విరుద్ధం ? స్వార్ధానికి పరాకాష్ట. వరం పొందాక మరణమును జయించానన్న అహంకారంతో విర్రవీగి ఎన్నో వర్ణింప శక్యం కాని దుర్మార్గాలను చేసాడు.దేవతలను అనేక ఇ క్కట్ల పాలు చేసాడు. ఎందరో పర స్త్రీలను అమానుషంగా అధర్మయుతం గా అనుభవించాడు. ఫలితంగా అతని పాపం పండే నాటికి శ్రీ మహా విష్ణువు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపనార్ధం నారసింహావతారమును ఎత్తి హిరణ్య కశిపుని సంహరించాడు. హిరణ్య కశిపుని ఘోర తపస్సు అధర్మ యుత కోరికలకు , నడవడికకు బలైపోయింది.

పరమ శివ భక్తాగ్రేసరుడైన రావణ బ్రహ్మ తన తల్లి కొరిక తీర్చడం కొరకు కఠోర తపస్సు గావించి శివుని ఆత్మ లింగానే కానుకగా పొందాడు.మహా భక్తుడనన్న అహంకారంతో శివ పార్వతుల నివాసమైన కైలాస పర్వతమును పెకిలించి తన శిరస్సుపై మోసినవాడు. నిత్యం సప్త సముద్రాలను దాటి శివ ఆరాధన గావించి తిరిగి తన లంకాపురికి వచ్చేవరకు పచ్చి గంగైనా ముట్టని రావణ బ్రహ్మ తన అద్భుతమైన, అసామాన్యమైన దీక్ష ద్వారా దేవతల చేత మరణం పొందకుండునట్లు వరం పొందాడు, కేవలం అహంకారం చేతనే మానవ, జంతువులను విస్మరించాడు.

అపూర్వమైన వరములను పొందిన కారణంగా దేవతలపై దండెత్తి వారిని దారుణంగా హింసించాడు. ఎందరో పర స్త్రీలను చెరబట్టాడు, చివరకు శుర్పణఖ ప్రేరేపించిన కారణంగా మహా సాధ్వి, శ్రీ రామ చంద్రుని పట్టమహిషి అయిన సీతమ్మ తల్లినే కపట వంచనతో సాధువు రూపంలో వచ్చి అపహరించాడు. అధర్మయుతంగా ఇతరుల సంపదలను, స్త్రీలను అనుభవించిన కారణంగానే యుద్ధంలో తన వారినందరినీ పోగొట్టుకొని చివరకు శ్రీ రామచంద్రుని చేతిలో దిక్కు లేని చావు చచ్చాడు. ఎంతటి మహా భక్తుడు ? ధర్మ బద్ధం కాని నడవడిక వలన నాశనమైపోయాడు.

కలిపురుషుడి అంశలో జన్మించి అసమాన్య శూరులైన కౌరవులందరికీ అగ్రజుడైన ధుర్యోధనుడి జీవితం ఒకసారి పరిశీలించండి. అతనికి వున్న సిరి సంపదలు, బల పరాక్రమాలు అనిర్వచనీయం. అయితే అధర్మయుత నడవడికే అతని కొంప ముంచింది కౌరవ వంశాన్ని సమూలంగా నాశనం చెసింది. అసమాన్యమైన వైభవం కలిగిన ఆ రారాజు శకుని పన్నిన కుట్రలో పాల్గొని ధర్మానికి మారుపేరైన పాండవుల సిరి సంపదలన్నింటినీ అపహరించి వారిని అడవుల పాలు జేసాడు. మహా పతివ్రత అయిన ద్రౌపది యొక్క వస్త్రములను నిండు సభలో నలుగురి ఎదుట విప్పించి అతి ఘోరంగా అవమానించాడు.కాని చివరకు ధర్మమే జయించింది. అధర్మంగా సంపదలను, కామమును అనుభవించ యత్నించిన ఆ రారాజు తన వారినందరినీ కురుక్షేత్ర యుద్ధం లో కోల్పోయి దిక్కులేని చావు చచ్చాడు. దాన చక్రవర్తిగా చరిత్ర కెక్కిన కర్ణుడు కూడా అధర్మానికి బాసటగా నిలవడం వలనే అతి దారుణంగా చంపబడ్డాడు.

పై ఉదాహరణలను నిశితంగా పరిశీలిస్తే మనకు ఒక విషయం చాలా సుస్పష్టంగా అర్ధమౌతుంది.మిగితా మూడు అర్ధములైన అర్ధ, కామ మోక్షములు ధర్మయుతమైన నడవడిక ద్వారానే సాధించాలి, లేకపోతే వినాశనం తప్పదు.ధర్మం చాలా గొప్పది. ధర్మోతి రక్షితి రక్షిత: అన్నది ఆర్యోక్తి.ధర్మాన్ని ఆచరిస్తే అది మనలను తప్పక కాపాడుతుంది.ఇందులో కించిత్ సందేహం కూడా లేదు.కనుక మనమందరం కూడా ధర్మ మార్గంలోనే నడిచి ధర్మయుతమైన కోరికలను ధర్మ మార్గంలోనే తీర్చుకుందాం. ధర్మ మార్గంలోనే సంసార సుఖమును అనుభవిద్దాం మరియు ధర్మ మార్గంలోనే అర్ధం అంటే భోగ భాగ్యాలను సంపాదించుదాం , వాటిని ఆనందంతో అనుభవించుదాం.అధర్మ మార్గం చాలా వినాశకారి. మొదట్లో సౌఖ్యంగా వున్నా చివరకు వినాశనం తప్పదు. ధర్మ మార్గం తొలుత కష్టంగా వున్నా చివరకు సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. మానవులను ముక్తికి అర్హులను చేస్తుంది.ఎన్ని యజ్ఞయ యాగాదులు చేసినా, కఠోర తపస్సులు సల్పినా ధర్మబద్ధమైన జీవనం చేయకపోతే అవన్నీ నిష్ప్రయోజనం.ధర్మమునకే అంతిమ విజయం, యుగ యుగాలుగా నిరూపింపబడిన సత్యం.


సర్వే జనా సుఖినోభవంతు
లోకా స్సమస్తా సుఖినోభవంతు

Wednesday, December 16, 2009

అగ్ని పరీక్ష

పూర్వం మగధ రాజ్యం లో వేద ధర్ముడనే సాధు పుంగవుడు వుండే వాడు.అతడు సకల వేద, శాస్త్ర పారంగతుడు.పురాణేతి ఇతిహాసాలను ఔపాసన పట్టిన దిట్ట. ఊరికి నాలుగు క్రోసుల దూరం లో ఒక నది ఒడ్డున చిన్న ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవిస్తుండే వాడు. వేద ధర్ముడు మహా శివ భక్తుడు. వేకువ జామునే లేచి కాల కృత్యాలు తీర్చుకొని, స్వయంగా గోవు పాలు పితికి శివునికి అభిషాకం చెస్తేనే గాని పచ్చి గంగయినా ముట్టేవాడు కాదు. శివ భక్తియే కాక వేద ధర్ముడు గొప్ప మానవతా విలువలు మూర్థీభవించిన నిర్మల హృదయుడు. తన గుమ్మం లోనికి ఎవరొచ్చినా సరే, తనకు మిగిలిందా లెదా అని కూడా చూసుకోకుండా దన ధర్మలను చేస్తుండే వాడు.

ఒకసారి మహాశివుడు వేద ధర్ముని భక్తి, విశ్వాసాలను పరీక్షించ దలిచాడు. వేద ధర్ముని ఆశ్రమ ప్రాంతం లో తీవ్రమైన కరువు కాటకాదులను సృష్టించాడు. ఆ ప్రాంతం లోని ప్రజలు దేశం లోని ఇతర ప్రదేశాలకు వలస వెళ్ళిపోసాగారు. ఆశ్రమానికి వచ్చి కానుకలను సమర్పించే వారి సంఖ్య గననీయం గా తగ్గిపోయింది. సరైన పోషన లెక ఆవు కూడా కొద్ది రోజులకే మరణించింది. ఇన్ని ఇబ్బందులు ఏకకాలం లో ఎదురైనా సరే వేద ధర్ముడు తన శివారాధనను మానలేదు. పాలు లేకపోయినా, స్వచ్చమైన నదీ జలంతో నిత్యం మహాశివునికి అభిషేకం జరుపుతుండే వాడు. నారు పోసిన వాడు నీరు పొయ్యడా అనే చందాన తనను సృష్టించిన ఆ మహా శివుడే తన పోషణ భారం కూడా చూసుకుంటాడన్న ధృఢమైన విశ్వాసంతో వున్నాడు వేద ధర్ముడు.

ఇదిలా వుండగా ఒకసారి ఆశ్రమం లో బియ్యపు గింజలు పూర్తిగా నిండుకున్నాయి. తోటలో ఫలాల చెట్లు కూడా పూర్తిగా ఎందిపోయాయి. కటిక ఉపవాసం చేయవలిసి వచ్చింది.అయినా కేవలం మంచి నీరు త్రాగుతూ, శివ పంచాక్షరీ మంత్రం జపిస్తూ ప్రాణాలను నిలబెట్టుకుంటున్నాడు వేద ధర్ముడు.

నాలుగు రోజులు అలాగే గడిచాయి.తీవ్రమైన నీరసం ఆవహించినా శివ నామ జపం ఆపలేదు వేద ధర్ముడు.ఇంతలో ఒక భక్తుడు వచ్చి కొంచెం బియ్యం సమర్పించి వెళ్ళాడు. "శివార్పణ మస్తు" అని ఆ బియ్యాన్ని పులగంగా వండి శివునికి నైవేద్యం అర్పించాడు వేద ధర్ముడు. అతి పవిత్రమైన ఆ భుక్తాహారామ్మి స్వీకరించే తరుణం లో " తండ్రీ ధర్మం చెయ్యండి" అనే అతి దీనమైన పిలుపు ఆశ్రమ ప్రాంగణం లో వినిపించింది. వెంతనే బయటకు వెళ్ళీ చూస్తే ఒక ముదుసలి చేతిలో కర్రతో వణుకుతూ నిలబడి వున్నాడు. ముఖమంతా మడతలు పడి వుంది. శరీరం వ్యార్ధకంతో నిండి వుంది." స్వామీ ! వారం రోజుల నుండి తిండి లేదు.ఆకలితో చచ్చిపోతున్నాను. తినడానికేమైనా ఇచ్చి కాస్త పుణ్యం కట్టుకో.ఏ క్షణాన్నైన్నా నా ప్రాణం పోయేట్టు వుంది" అని అతి దీనం గా విలపించాడు ఆ ముసలి వ్యక్తి.

వేద ధర్ముని హృదయం ఆ మాటలకు పూర్తిగా ద్రవించింది. తన ఆకలి కంటే ఆ ముసలివాని ఆకలి మరింత తీవ్రమైనది. తాను అదృష్టం చేసుకోబట్టే ఆ ముసలి వాని ఆకలి తీర్చే భాగ్యం తనకు కలిగింది అనుకుంటూ ఆ ముసలిని "అతిధిదేవో భవ" అంటూ సాదరంగా ఆహ్వానించి, కాళ్ళు చేతులు కడిగి ఒక ఆసనంపై కూర్చోబెట్టి తాను వండిన అన్నం మొత్తమును ఆ ముసలి వానికి వడ్డించేసాడు. భోజనానంతరం త్రాగడానికి స్వచ్చమైన నీరు ఇచ్చి "మీరు అలసట తిరే వరకు ఇక్కదే విశ్రమించండి" అని అతనిని తన ఆశ్రమం లోపల పరుండబెట్టాడు.అంతే కాక తానే స్వయంగా అతనికి సపర్యలు చేసాడు. సాయంత్రానికి సేద తీరి తిరిగి శక్తి సంపాదించుకున్న ఆ ముదుసలి తనకు జరిగిన అథిధి సత్కారానికి ఎంతో ఆనందించి వేద ధర్ముని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.తినడానికి ఏ మాత్రం భోజనం మిగలనందుకు వేద ధర్ముడు కించిత్ కూడా బాధ పడలేదు. పైగా వాకిట్లో నిలచిన అతిధికి తాను చేతనైనంతగా సత్కారం చేయగలిగినందుకు ఎంతో సంతోషించాడు. ప్రాణాలను నిలుపుకునేందుకు శివ పంచాక్షరీ మంత్ర జపమునే సాధనంగా ఎంచుకున్నాడు.

ఆ ముదుసలి రూపం లో వచ్చి తన భక్తుడిని పరీక్షించిన మహా శివుడు తన అగ్ని పరీక్షలో నెగ్గినందుకు వేద ధర్ముడిని ఆశీర్వదించాడు.జీవితపు అంతిమ ఘడియలలో అతనికి శాశ్వత శివ సాయుజ్యం ప్రసాదించాడు. భగవంతుడు పెట్టే వివిధ రకములైన పరీక్షలకు తట్టుకొని , ఆత్మ విశ్వాసం తో సహనం పట్టుదలలతో ఆ భగవంతుని పాదాలను చివరి వరకు విడువని వారే అధ్యాత్మిక జీవితలలో విజయం సాధిస్తారు అనడానికి వేద ధర్ముని జీవితమే ఒక నిదర్శనం.