Sunday, April 5, 2009

కవితా సమాహారం - 13

శ్రీ సాయి లీలావైభవం

నిర్గుణులు, నిరాకారులు, పరబ్రహ్మ స్వరూపులు
స్వప్రకాశకులు, భక్తులను సదా బ్రోచెడి
శ్రీ శిరిడీ సాయినాధులకు వందనం
ఆడంబరమైన పూజలు,యజ్ఞాలు
అట్టహాసముగా చేయు జప, వ్రతములు వలదని
హృదయశుద్ధితో ఒనర్చు సాయి సాయి అను
నామజపమే చాలుననియు
తలచిన తక్షణమే బ్రోచెదనని
వాగ్దానమొనర్చిన దయాళువు
జీవిత నౌకకు సరంగుగా చేసుకొనిన
సర్వమూ తానై నడిపే సమర్ధ సద్గురువు
నమ్మిన వారిని నట్టేట ముంచనని వాగ్దానము సల్పి
సర్వస్య శరణాగతి ఒనరించిన
భక్త జనావళికి తోడూ నీడై నిలిచి
చివరి కంటా గమ్యం చేర్చే దీన బంధువు
భక్తుల పాలిటి కల్పవృక్షము
భక్త జన వంద్యుడు శ్రీ సాయినాధుడు


గురుస్తుతి

నామ, రూపములు లేని హృదయజ్యోతి
బ్రహ్మ తేజం, నిరాకార పరబ్రహ్మం
సమిష్టి విరాట్ పురుషుడు
యద్భావం తద్భవతి రీతిన
విభిన్న భక్తులకు విభిన్న రూపములలో
దర్శన మిచ్చి కోరిన వరములనిచ్చిన పరబ్రహ్మం
సకల జీవులయందు సదా కొలువై వుండెడి
నిరాకార జ్యోతి స్వరూపం శ్రీ సాయినాదుడు
శాశ్వత ఆత్మ అమృత స్వరూపం
గోచరించే విశ్వమంతా నిండి వున్న ఆత్మ శక్తి
ప్రకాశైక స్వరూపుడు, అయోనిజ సంభవుడు
పరమ పవిత్రుడు, త్రిగుణాతీతుడు
విశుద్ధ విజ్ఞాన స్వరూపుడు
శాశ్వతమగు పరమానందములో
సదా ప్రకాశించెడి శుద్ధ చైతన్య స్వరూపుడు
భక్తజన వంద్యుడు సమర్ధ సద్గురువు శ్రీ సాయి