Sunday, December 28, 2008

కవితా సమాహారం - 7

త్రిమూర్తి స్వరూపం గురుదేవులు

సదా బ్రహ్మలు, స్వయం ప్రకాశకులు
నిరాకారులు పరబ్రహ్మ స్వరూపం
గురుదేవులకు సదా వందనం
త్రిమూర్తి స్వరూపులు, లోక కల్యాణ కారకులు
నిత్యం బ్రహ్మ భావం లో వెలుగొందుతూ
ఒక దీపం మరియొక దీపముని వెలిగించు రీతిన
తన శిష్యుల హృదయములలో పేరుకున్న
అజ్ఞానంధకారములను పారద్రోలి
జ్ఞాన దీపములను వెలిగించి
వారికి నిత్య పరమానంద ప్రాప్తి చేయు
బ్రహ్మ జ్ఞాన స్వరూపులు గురుదేవులు
గురువు లేని జీవితం చుక్కాని లేని నావ
గురుదేవుల అనిర్వచనీయమైన కృప
శిష్యులకు శ్రీఘ్రగతిన అతి దుర్లభమైన
ఆత్మ సాక్షాత్కారం కలుగజేయును
స్వస్వరూప దర్శనం ద్వారా ముక్తి మార్గమున
పయనింపజేసి పవిత్రమైన ఈ జీవితమునకు
సార్ధకత లభింపజేయును
గురువే దైవం దైవమే గురువు
గురుదేవుల పాద పద్మములు అత్యంత పవిత్రం

సర్వ మత సమానత్వం

తమను గూర్చి తీవ్ర తపనతో
చింతన చేయుటకు అంతర్ముఖులై
తెలుసుగొన యత్నించడమే సర్వ
మతముల సారాంశం
ఇతరుల మతం కంటే తమ మతమే
గొప్పదన్న అహంభావంతో
ఇతర మతములను , మతస్థులను
కించపరచడం, తిరస్కార భావం చూపించుట
అన్నింటి కంటే నిష్కృతి లేని మహా పాపం
స్వధర్మే నిధనం శ్రేయ :
అన్నది గీతాచార్యుని ఉవాచ
స్వధర్మ పాలనే అతి శ్రేయస్కరం
తమకు విధించిన ధర్మాలను
చిత్త శుద్ధితో ఒనరించడం
పవిత్ర సంస్కారాలతో, ఉత్తమ విలువలతో
సర్వ మత సమానత్వ భావనతో
జీవన యానం సాగించుటే మన కర్తవ్యం

Thursday, December 25, 2008

కవితా సమాహారం 6

మానవతా విలువలు

రూపాయిలు రాజ్యమేలుతున్న ఈ కాలం లో
మానవతా విలువలు, ప్రేమానుబంధాలు
ఆప్యాతానురాగాలు, హాం ఫట్
ఆన్ని అనుబంధాలు బేరాలే !
రక్త సంబంధీకులు ,భార్యా భర్తల మధ్య
వ్యాపార సంబంధాలు వర్ధిలుతున్నాయి
రేయింబవళ్ళు కష్టపడి కడుపున బుట్టిన వారిని
సర్వం త్యాగం జెసి పెంచి పెద్ద చేసి
ప్రయోజకులుగా తీర్చి దిద్దడం కేవలం బాధ్యత (అట)
అందరినీ వదులుకొని మెట్టినింట అడుగు పెట్టడం
స్త్రీలకు జన్మత: తప్పని సరి (అట)
హృదయమంతటా కృతిమత్వంతో
మరమనుషుల వలె జీవితం వెళ్ళబుచ్చుతూ
నోట్ల కట్టలను కూడబెట్టడం ఎంత దురదృష్టకరం ?

దివ్య సందేశం

కాస్తంత దయ, కొంచెం ప్రేమ
రెండు ఓదార్పు మాటలు చాలు
మానవుని మహనీయునిగా చేయుటకు
మానవుల సహజ ఆనందమయ
స్వభావమును మరుగున పరచుకొని
సంఘర్షణాత్మకమైన వైఖరిని
అలవర్చుకొని కల్లోల భరిత హృదయం తో
హింసాత్మక పద్దతిలో దానవులవలే
జీవించడం కడు బాధాకరం
అభివృద్ధి వెంపర్లాటలో ధనార్జనే ధ్యేయం గా
సంపదల వేటలో ఈ అందమైన ప్రపంచాన్ని
కల్లోల భరితం చేస్తున్న వైనం దయనీయం
సాటి మానవుల పట్ల కరుణ మృగ్యం
ప్రేమ, దయ, వాత్సల్యం అనే మాటల చిరునామా ఏది ?
ఇతరుల పట్ల దయ చూపే తత్వం
పగ ప్రతీకారములను త్యజించడం
సర్వ మానవ సౌభ్రాతాతృత్వం అలవర్చుకోవడం
దైవ ప్రార్ధనతో హృదయాలను పవిత్రపరచుకోవడం
మానవులుగా జన్మించినందుకు మన ముఖ్య కర్తవ్యాలు
ఇదే జీసస్ ప్రభువు యొక్క సందేశం
మనందరికీ సదా ఆచరణీయం

కన్న వారి నిరాదరణ

రేయింబవళ్ళు శ్రమించి సర్వం త్యాగం చేసి
కడుపున బుట్టిన వారికి సర్వ సౌఖ్యాలు కూర్చి
విద్యావంతుల్ని గావించి ప్రయోజకులుగా తీర్చి దిద్ది
ఈ సమాజం లో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కూర్చి
ఆలుపెరగక తమ కర్తవ్య పాలన గావించిన తల్లిదండ్రులపై
కాసింతైనా దయ, ప్రేమ నేటి యువ (నవ) తరానికి
లేకపోవడం ఎంత దయనీయం ?
రెక్కలు వచ్చిన విహంగం సొంత గూడు వదిలి
ఎగిరిపోయిన చందాన స్వతంత్రులు కాగానే
ఎల్లలు లేని అవకాశాల ఆకాశం లో
తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ
తన వారినందరినీ గాలికొదిలేసి ఎగిరిపోయే మేధావుల్లారా !
మీకు జ్ఞానోదయం కలిగేదెన్నడు ?
తల్లిదండ్రుల ఋణం ఎన్నటికీ తీర్చుకోలేనిది
వారిని అనాదరించుట దైవ దూషణతో సమానం
ధన సంపాదన మత్తులో కన్నవారిని నిర్లక్ష్యం చేయుట
అన్ని పాపాలలో కెల్లా నిష్కృతి లేని అతి హేయమైన పాపం

Sunday, December 14, 2008

కవితలు 5

కరుణామయుడు

కరుణ ,దయ, ప్రేమలకు ప్రతిరూపం మన జీసస్
యావత్ ప్రపంచమంతా నిరాశా,నిస్పృహ, దుఖం, కష్టాల కడలిలో
కొట్టుమిట్టాడుతుండగా బెత్లెహాము నగరం లో
వేకువజామున మెరిసిందొక ధృవతార
జీసస్ నామధేయంతో దిన దిన ప్రవర్ధమానమై
శిష్ట జన సంరక్షణకు స్వయం గా
నడుం కట్టింది ఆ పరమాత్మ స్వరూపం
పాలకులే పాతకులై పాశవికత జూపి
శిలువ నెక్కించగా చిరునవ్వుతో సకల ప్రాణ కోటి కొరకు
తన రక్తం చిందించి అశువులు బాసిన కరుణామయుడు
పాపాత్ములను సైతం పరిశుద్ధులను గావించి
తద్వారా జీవన్ముక్తిని ప్రసాదించిన దేవదేవుడు
వెన్న కంటే మృదువైన మనసుతో
తనను శరణు జొచ్చిన వారిని చివరికంటూ కాపాడిన దయామయుడు
హేళన జేసిన వారిపై లాలన, దూషించిన వారిపై కరుణ
సమాంతరం గా కురిపించిన కరుణామయుడు
ప్రేమ,దయ, కరుణ, సత్యం లకు నిర్వచనం జీసస్ ప్రభువు

దేశ భాషలందు తెలుగు లెస్స !

దేశ భాషలందు తెలుగు లెస్స
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా యావత్
ప్రపంచమంతటా వేన్నోళ్ళ కీర్తింపబడుతున్న గొప్ప భాష
తేనె కంటే తీయనైన కమ్మని భాష
ప్రాచీన హోదా లభ్యం కోట్లాది ఆంధ్రులకు గర్వకారణం
మాతృ భాషాభిమానులలో ఉప్పొంగిన ఆనందం
మమ్మీ డాడీ సంస్కృతికి ఇక పలకాని మనం వీడ్కోలు
భావి తరాలకు కమ్మని తెలుగు
పలుకుల సొగసులను అందించడం మన కర్తవ్యం
పర భాషా వ్యామోహంతో మాతృ భాషకు
దూరం కావడం శోచనీయం
మాతృ భాషను నిర్లక్ష్యం చేయడం
కన్న తల్లిని అగౌరవపరచడం తో సమానం
ప్రాచీన భాష హోదాతో మన భాషా సంస్కృతులను
పరిరక్షించి కమ్మని తెలుగు భాషపు
పరిమళ సుగంధాలను దిగంతాలకు వ్యాపింపజేయడం
తెలుగు భాష వికాసం, వ్యాప్తిలకు కృషి సల్పడం
తెలుగు వారిగా మన ప్రధమ కర్తవ్యం
తెలుగు తల్లికి జై
తెలుగు తల్లి ఒడిలో సేద తీరడం
ఒక అనిర్వచనీయమైన అనుభూతి
అన్ని భాషలలోన ఎన్నదగిన సాహితీ శిఖరం తెలుగు

అభినందనల మందారం

ఎన్నో వేల జన్మల పుణ్య ఫలం
ఫలితం మనకు లభించిన మానవ జన్మ
సకల జీవ ప్రాణులన్నింటిలో కెల్లా
మానవులకు మాత్రమే లభించిన అపురూప వరం వాక్కు
మనస్సులోని ఉద్వాగాలను,భావాలను
అద్భుతం గా వెల్లడించగల శక్తి "మాట"
అందమైన భాష మాటకు ఆలంబన
మదిలో మెదిలే ఆలోచనలకు వస్త్రాలంకారం
అభినందనలు తెల్పుటు మన భాషను
సద్వినియోగపరచుటకు బహు చక్కని అవకాశం
ఎదుటి వారి మంచితనం , సహృదయత,సుగుణాలు
ఒనరించిన మహోపకారములకు
మనస్పూర్తిగా మెచ్చుకొనుటయే అభినందన
అభినందనలు తెల్పుట మన సంస్కారానికి
విశాల హృదయానికి ఒక గీటురాయి
ఎదుటివారిని అభినందించడం వలననే
మనకు అభినందింపబడడమనే అర్హత లభ్యం
ఈర్ష్యానుద్వేషాలు,మద మాత్సర్యాలు తొలగిపోయి
సర్వ మానవ సౌభృతృత్వం , సర్వ జీవ సమానత్వం
కలిగి వసుదైక కుటుంబం స్థాపనకు నాంది
సమ దృష్టి, సమ భావం సహృదయత్వం కలిగి
మనస్సు స్పటికం వలే స్వచ్చం పవిత్రమగును
మానవ జన్మకు లభించును సార్ధకత