Thursday, December 16, 2010

నాలుగు బొమ్మల కధ

కుటుంబరావు, అనసూయ దంపతులకు ప్రియ లేక లేక కలిగిన సంతానం. వివాహం అయిన పది సంవత్సరాల తర్వాత పుట్టినందున ఆ అమ్మాయిని వారు ఎంతో ప్రేమగా పెంచుకోసాగారు. తాను ఆడిందే ఆట, పాడిందే పాటగా పెరిగింది. బజార్లో ఏ వస్తువునైనా చూసి కావాలని పేచీ పెడితే క్షణాలలో ఆ వస్తువు ఆమె ఒడిలో వుండాల్సిందే ! ఇంటిలో పని చేసే నౌకర్లందరూ కూడా ప్రియ అంతే ఎంతో అభిమానంగా వుండే వారు.

అష్టైశ్వర్యాలలో పుట్టి పెరుగుతున్నా ఆ అమ్మాయిలో గర్వం అనేది కించిత్ కూదా కనిపించేది కాదు. అందరితో ప్రేమగా, స్నేహంగా మెలుగుతుండేది. స్నేహితులు తన వస్తువులను అడిగితే కాదనకుండా ఇచ్చేసేది.ఆమే స్నేహానికి కులం, మతం, పేదా గొప్పా అన్న పట్టింపులు అసలు లేవు.అందరితో కల్మషం లేకుండా మెలుగుతూ,స్నేహం చేస్తూ ప్రియ మంచి అమ్మాయి అన్న పేరు తెచ్చుకుంది.ప్రియలో అన్నీ మంచి గుణాలే వున్నా ఈ ఒక్క లక్ష్నమే కుటుంబరావు దంపతులకు నచ్చేది కాదు. ప్రేమించడానికి, స్నేహాలకు,త్యాగానికి ఒక హద్దు అంటూ వుండాలన్నదే వారి ధృఢ విశ్వాసం.ప్రియ హద్దులనేవి లేకుండా ఎలాంటి వారితోనైనా ఎంత సేపైనా భేజషాలు లేక మట్లాడడం, అడిగిన వారికి లేదనకుండా, ఆసలు ఆలోచించకుండా ఇచ్చెయ్యడం భవిష్యత్తులో ఎటువంటి దుష్పరిణామాలకు దారి తీస్తుందో నని వారు అనుక్షణం భయపడుతుండేవారు.

వయసుతో పాటు ప్రియలోని స్నేహ, దాన గుణాలు కూడా పెరుగుతూ వచ్చాయి.అయితే ఇది కొన్ని సార్లు చెడు ఫలితాలను ఇచ్చేది. అమాయకురాలైన ప్రియకు మంచికి, చెడుకూ మధ్య తేడా ను గుర్తించగలిగేది కాదు. ఏవరు ఏది అడిగితే అది కాదనకుండా ఇచ్చేసేది.లేదు, కాదు అన్న పదాలు ఆమె డిక్షనరీలోనే లేవు. ఏదైనా ఇచ్చే ముందు ఫలనా వస్తువును ఫలనా వారికి ఇవ్వవచ్చునా లేదా అన్న ఆలోచన అసలు చేసేది కాదు.ఎదుట వారిలోని మాయ, కల్మషం, కుట్ర ఇత్యాది స్వభావాలను కనిపెట్టలేకపోయేది. ఫలితంగా ఎందరో ఆమె అమాయకత్వాన్ని పలు విధాలుగా కాష్ చేసుకుంటుండే వారు. కొన్ని సంధర్భాలలో షాప్ కీపర్లు ఆమె అమాయకత్వాన్ని గుర్తించి చిల్లర కూడా ఎగ గొట్టేసినా ఆమె ఏమీ అనేది కాదు. అంతకంటే అనలేకపోయేది అనడమే సమంజసంగా వుంటుంది.

ఒకరోజు ప్రియా వాళ్ళ అమ్మ ప్రియను అదే ఊరిలో వుండే తమ దూరపు బంధువులకు కొన్ని బట్టలు, స్వీట్స్ ఇచ్చి రమ్మని పంపగా అరగంట లోనే ప్రియ ఉత్తి చేతులతో తిరిగొచ్చింది. ఏమయ్యిందని అడుగగా వీధి మొదట్లో ఒక బిచ్చగత్తె ఎదురుపడి కట్టుకోవడానికి బట్టలు లేవని అడగగా ప్రియ మొత్తం బట్టలను స్వీట్స్ లను ఆమెకు ఇచ్చేసి వచ్చానని ఎంతో అమాయకం గా చెప్పింది. ఆ మాటలతో అనసూయకు పట్టరాని కోపం రాగా ఆవేశంతో ఊగిపోతూ ప్రియ రెండు చెంపలను ఎడా పెడా వాయించేసింది.ఎప్పటికి బాగుపడతావే ముదనష్టపు దానా! ఆని ఇష్టం వచ్చినట్లు తిట్టి ప్రియను గదిలోకి తోసేసి తలుపులేసేసింది.

జరిగే తతంగాన్ని చూస్తున్న ప్రియ నాయనమ్మ వచ్చి అనసూయను వారించి ఆ పిల్లది చాలా అమాయకమైన స్వభావం. దానిని మనం మంచి మాటలతో మార్చాలి గాని ఇలా ఆవేశపడితే లాభం లేదని అనునయించి చెప్పింది.ప్రియలో మార్పు తప్పక తేవాలని అప్పటి కప్పుడే ప్రియ నాయనమ్మ నిర్ణయించేసుకుంది.

ఆ రోజు రాత్రి ప్రియ నాయనమ్మ ప్రియ దగ్గరకు వచ్చి మూడు బొమ్మలను ఇచ్చి ఒక దారాన్ని ఒకొక్క బొమ్మ చెవి గుండా ఎక్కించమని చెప్పింది.

నాయనమ్మ చెప్పినట్లే ప్రియ చెసింది. ఆశ్చర్యం కలిగే విధంగా మొదటి బొమ్మ చెవుల గుండా దారం సాఫీగా సాగి పోయింది.” ప్రపంచంలో కొంతమంది ఏ మాటలనైనా ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారు. మాటలను ఏ మాత్రం మనస్సుకు పట్టించుకోరు. అలాంటి మనష్యులకు ఈ మొదటి బొమ్మ తార్కాణం. ఇప్పుడు రెండో బొమ్మ చెవుల గుండా దారం పోనివ్వు” అంది నాయనమ్మ.

రెండొ బొమ్మ చెవి నుండి దారం దూర్చగా అది నోట్లో లుంగలు చుట్టుకొని పోయింది.

“ ఈ తరహా మనుష్యులు ఏం వింటారో దానంతటినీ బయటకు చెప్పెస్తారు. దేనిని మమసులో దాచుకోరు ఇక మూడో బొమ్మను ట్రై చెయ్యి” అంది నాయనమ్మ.

ఆ మాటలకు ప్రియలో కుతూహలం ఎక్కువయ్యింది.

మూడో బొమ్మ చెవిలో నుండి వెళ్ళిన దారం బయటకు రాలేదు.

“ ఇటువంటి మనష్యులు చాలా వింటారు కాని కొంచెమే మాట్లాడుతారు. పై రెండు బొమ్మల లాగే ఈ లక్షణం కూడా మంచిది కాదు” చెప్పింది నాయనమ్మ.

‘అయితే ఎటువంటి ప్రవర్తన మంచిదనిపించుకుంటుంది నాయనమ్మా ?”ఆసక్తిగా అడిగింది ప్రియ. ఆమె ముఖ కవళికలు బట్టి ఆమెపై తన మంత్రం పని చెస్తోందని గ్రహించింది నాయనమ్మ. వెంటనే వెళ్ళి నాలుగో బొమ్మ తెచ్చి ప్రియకు ఇచ్చి “ దీనిని ప్రయత్నించు” అని చెప్పింది.

ఎడమ చెవి గుండా ప్రియ దారం పోనివ్వగా అది రెండో చెవి నుండి బయటకు వచ్చింది.

“ఇంకొక సారి ప్రయత్నించు” చెప్పింది నాయనమ్మ.

ఈసారి చెవిలో నుండి పంపగా దారం నోట్లోంచి బయటకు వచ్చింది.

ముచ్చటగా మూడొసారి ట్రై చెయ్యగా చెవిలోంచి పంపించిన దారం అసలు బయటకు రాలేదు.

ఫై మూడింటి కంటే ఇదే మంచి బొమ్మ.ఈ బొమ్మకు ఎప్పుడు వినాలో, ఏం వినాలో,ఎప్పుడు మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో, ఏది మాట్లాడకూదదో , ఎప్పుడు మౌనంగా వుండాలో తెలుసు. సంధర్భాన్ని బట్టి దీని ప్రవర్తన మారుతుంటుంది.ఇటువంటి ప్రవర్తన కలిగినవారే ఉత్తములు.వారే జీవితంలో బాగా రాణిస్తారు” అని ప్రియను అక్కున చేర్చుకొని ముద్దు పెట్టుకుంది నాయనమ్మ.” నా పిచ్చి తల్లీ. మంచితనం వుండడం తప్పుకాదు కాని అది చేతకానితనంగా మారకూడదు.ఇతరులకు మనకు వున్న దాంట్లో కొంత ఇవ్వడం లో తప్పులేదు కాని అవసరం వున్నవారికే ఇవ్వాలి, లేకపోతే నీ దానం పనికి రాకుండా పోయే ప్రమాదం వుంది. మోసం చెయ్యడం ఎంత తప్పో మోసగింపబడడం కూడా అంతే తప్పు. ఇదే నువ్వు ఈ నాలుగు బొమ్మ ల నుండి నేర్చుకోవలసింది” అని అనునయం గా చెప్పింది నాయనమ్మ.
ఆనాటి నుండి ప్రియ అవసరం వున్నప్పుదే మాట్లాడడం,అపరిచితులను దూరంగా వుంచడం, అవసరం వున్నా వారికే సహాయం చేయడం మొదలు పెట్టింది. అసలే మంచి పిల్ల అయిన ప్రియ తన మారిన ప్రవర్తనతో ఇంకా మంచి పిల్లగా పేరు తెచ్చుకుంది.

నీతి: ఎప్పుడు మాట్లాడాలో, ఏది మాట్లాడాలో, ఎవరికి సహాయం చెయ్యాలో తెలుసుకోవడం చాలా అవసరం. ఆపరిచితుల పట్ల తస్మాత్ జాగ్రత్త.మంచితనం చేతగానితనంగా మారకుండా చూసుకోండి.

Saturday, December 11, 2010

ఆతిధి దేవో భవ ……..

కౌసల దేశాన్ని ఏలే విక్రమ సేనుడు తన ప్రధాన మంత్రితో కలిసి ఒకరోజు రహస్య రాజ్య పర్యటనకు బయలుదేరాడు. తన రాజ్యంలో ప్రజల స్థితి గతుల గురించి అధ్యయనం చేద్దామని అనంతరం ఎవరైతే అతిధుల పట్ల అత్యున్నత రీతిలో గౌరవం కనబరుస్తారో వారికి బహుమానం ఇద్దామని మహారాజు మంత్రితో చెప్పాడు.

ఆ రోజు సాయంత్రం ఇద్దరూ వెళ్ళి ఒక ఇంటి తలుపు తట్టారు. తలుపు తెరచిన ఇంటి యజమానితో ‘అయ్యా, మేము పొరుగు రాజ్యం నుండి వర్తకం చెయ్యడానికి వచ్చాం. ఈ రాత్రికి మీ ఇంట్లో కాస్త తల దాచుకోనిస్తే ఉదయాన్నే లేచి వెళిపోతాం. మాకు ఈ వూరిలో ఎవ్వరూ తెలియదు. దయ చెసి మాకు సహాయం చెయ్యండి” అని అభ్యర్ధించారు.

ఆ మాటలు విన్నంతనే ఆ ఇంటి యజమాని కోపంతో మండిపడ్డాడు. “ భలేవాళ్ళె మీరు. ముక్కు ముఖం తెలియని వారికి ఇంట్లో ఎలా తల దాచికోనిస్తాం ? మీరు దొంగలు కారన్న నమ్మకం ఏమిటి ?అయినా అడ్డమైన వాళ్ళ్కు ఆశ్రయం ఇవ్వడానికి నా ఇల్లేమైనా ధర్మ సత్రం అనుకున్నారా ? ఇంకొక్క క్షణం లో ఈ ఇక్కడి నుండి వెళ్ళకపోతే రాజ భటులను పిలవాల్సి వస్తుంది” అని పెద్దగా అరుస్తూ తలుపు వాళ్ళ ముఖం మీదే వేసేసాడు.

అప్పుడు వారిద్దరూ మరొక ఇంటి తలుపు తట్టి ఇంతకు ముందు లాగే ఎంతో వినయంతో అభ్యర్ధించారు.

ఆ ఇంటి యజమాని “ అయ్యా ! నా ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే.ముందు మీరు ఎంత మంది వున్నారో లెఖ్ఖ సరిగ్గా చెబితే అప్పుడు ఆలోచిస్తాను” అని అన్నాడు. ఆందుకు మహారాజు” అయ్యా ! మేము ఇద్దరమే వున్నాము. మా వద్ద చెల్లించుకోవడానికి అట్టె ధనం లేదు. ఈ రేత్రికి మీ ఇంట్లో తల దాచుకోనివ్వండి. ముందుగా మేము దైవ దర్శనం చేసుకొని వస్తాం” అని చెప్పి ముందుకు కదిలారు.

తర్వాత వారు ఇంకొక ఇంటి తలుపు తట్టారు. ఇంటి యజమానిని అదే విధంగా అడగగా అతను ఎంతో వినయంతో తలుపులు తెరిచి “దయ చేసి లోపలికి రండి ,ఈ ఇంటిని మీదిగా భావించి విశ్రాంతి తీసుకొండి. ఆతిధి అభ్యాగతులను గౌరవించడం మా రాజ్యం యొక్క సంప్రదాయం” అంటూ వారిని ఎంతో సాదరంగా ఆహ్వానించాడు. ఆ ఇంటి యజమాని ఆర్ధిక పరిస్థితి అధ్వాహ్నంగా వుంది అయినా వున్నంతలోనే వారిదరికీ స్వాగత సత్కారాలను చేసాడు. ఈ ఇంటి కుటుంబ సభ్యులు కూడా అతిధుల పట్ల ఎంతో ప్రేమానురాగాలను కనబరిచారు.

మర్నాడు రాజ్యానికి తిరిగి వెళ్ళిన మహారాజు ముగ్గురు ఇంటి యజమానులను పిలిచి వారితో ఇలా అన్నాడు.

మొదటి వానితో “ ఇంటికి ఆశ్రయం కోసం వచ్చిన వారిని కన్ను మిన్ను కానక నువ్వు తీవ్రంగా అవమాన పరిచావు. నీ వంటి వాడు ఈ రాజ్యంలో వుండదానికి అనర్హుడు “ అని వానికి దేశ బహిష్కార శిక్ష ను విధించాడు.

రెండవ వ్యక్తితో” నువ్వు ముందు వాని వలే కాక కనీసం ఎందరు వున్నారన్న దానిని బట్టి ఆశ్రయం ఇచ్చేదీ లేనిదీ నిర్ణయించుకున్నావు. నీ ఆర్ధిక పరిస్థితి నీ చేత ఆ విధంగా ఆలోచింప చేసింది. అందుకని నీ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచడం అవశ్యం. వున్న దానిలో కొంతదానిని ఇతరులకు పంచాలన్న నీ ఆలోచనను ఎన్నడూ విడవకు" అంటూ వానికి కొంత ధనం ఇచ్చి పంపేసాడు.

మూడవ వ్యక్తిని మహారాజు దుశ్సాలువతొ సన్మానించి లెఖ్ఖ లేనంత ధనాన్ని, బంగారాన్ని ఇచ్చి” ఆగర్భ దారిద్రంలో మునిగి వున్నా తనకు చేతనైనంతలో పరులకు సహాయం చెయ్యాలన్న గొప్ప సంస్కారం నీకు వుంది. ఆతిధులను సాక్షాత్తు భగవంతునిగా చూసే ఈ రాజ్యపు సంస్కృతి సాంప్రదాయాలను ఆచరణలో చూపించావు ” అంటూ అతనికి తన రాజ్యపు కొలువులో ఒక చక్కని ఉద్యోగం ఇచ్చాడు.

ఆతిధులను ఎలా గౌరవించాలో తెలియజేసే భావ గర్భితమైన కధ ఇది. ఇందులో నుండి ప్రతీ ఒక్కరం చాలా విషయాలను నేర్చుకోవలిసి వుంటుంది.

మాతృదేవో భవ..పితృదేవోభవ,…ఆచార్య దేవోభవ, ..అథిది దేవో భవ అన్నది వేదోక్తి.అవసరార్ధం మనింటికి వచ్చే అతిధులను సాదరంగా ఆహ్వానించి చేతనైనంతగా గౌరవ మర్యాదలను చూపించాలని మన శాస్త్రం తెలియజేస్తోంది. ఆతిధిని గౌరవించిన చోట దేవతలు నివాసం చేస్తారని అంటారు.అతిధుల విషయం లో కుల, మత, ప్రాంతీయ బేధాల పట్టింపులు చూపకూడదు. ఆతిధులు సంతృప్తి చెందితే యజమానికి సర్వ సౌఖ్యాలు లభిస్తాయన్నది నిర్వి వాదాంశం. కానీ ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నదేమిటి ? ప్రపంచీకరణ నేపధ్యంలో మన జీవితాలలో వేగం పెరిగింది. లెఖ్కకు మించి వస్తున్న ఉపకరణాల వలన మానవుల అహం పెచ్చు పెరిగింది. సంబంధ బాంధవ్యాలు పూర్తిగా నశించిపోయాయి. ఇచ్చి పుచ్చు కోవడం లోనూ, కలిసి మెలిసి జీవించడం లోనే అసలైన ఆనందం దాగి వుందీన్న సంగతిని పూర్తిగా మర్చిపోయాం.సహాయార్ధం ఎవరైనా ఇంటికి వస్తే ముఖం చిట్లిస్తాము. వచ్చిన వారిని గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడే సంస్కృతి వచ్చింది. టైమునప్పుడు టి విలు, కంప్యూటర్లు, వీడియో గేంస్ లతో కాలక్షేపం చేస్తున్నాం తప్ప ఒకరి ఇంటికి వెళ్ళడం, ఇంకొకరిని మన ఇంటికి ఆహ్వానించడం లాంటి సహ జీవన సంస్కృతికి పూర్తిగా దూరమైపోయాము. కొన్ని ప్రధాన నగరాలలో అయితే అప్పాయింట్ మెంట్ తిసుకోకుండా వస్తే ఎందుకు వచ్చారని ముఖంమీదే తలుపులేసేసే పరిస్థితి వుంది.
మనుషిని మనిషిగా చూడాలి. ఫరులకు వీలైనంతగా సహాయం చెయ్యాలి.ఇంటికి వచ్చిన వారిని ఆదరించడం, తోచిన విధంగా సత్కార్యం చెయ్యడం మన విధి. దీనిని విస్మరించిన నాడు మన మనుగడకు అర్ధం లేదు.

Tuesday, December 7, 2010

యధ్భావం తధ్భవతి

శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో నా భక్తులు నన్నే విధముగా భావిస్తారొ నేను అదే విధంగా వారికి దర్శనమిచ్చి వారి సకల కొరికలను తొరుస్తానని ప్రవచించారు. కలియుగ దైవం, భక్తుల పాలిటి కల్పవృక్షం, సమర్ధ సద్గురువు అయిన శ్రీ సాయినాధులు తన భక్తులు తనను ఏ విధంగా భావించారో వారికి ఆదే రూపంలో దర్శనమిచ్చిన సంఘటనలు శ్రీ సాయి సచ్చరిత్రలో అనేకం కనిపిస్తాయి. మారుతి, వెంకటేశ్వరుడు, దుర్గాదేవి, నరసింహ స్వామి,దత్తాత్రేయుడు ఇలా ఎందరో భక్తులు వారు భావించిన విధంగా దర్సనమిచ్చిన వైనం అద్వితీయం, అపుర్వం, అసామాన్యం అని చెప్పక తప్పదు. అట్లే కలియుగం లో ఈ భువిపై అవతరించిన శ్రీపాద శ్రీ వల్లభులు,నరసింహ సరస్వతి,రమణ మహర్షి, లహరి మహాశయులు ఇత్యాది సద్గురువులు తమ భక్తులకు ఇటువంటి మహత్తర అనుభవాలను ప్రసాదించారు. దీనినే శాస్త్రం యద్భావం తద్భవతి అని ప్రభోదిస్తొంది అంటే భావం బట్టే ఫలితం.

మన మనసులో ఎటువంటి ఆలోచనలు ప్రవేశిస్తాయో ఫలితాలు అదే విధంగా వుంటాయి అనడానికి ఉదాహరణ ఈ క్రింది కధ :

ఒక లోభి అయిన సన్యాసి తన గురువు వద్ద ఉపదేశం తీసుకొని భగవంతుని కోసం తీవ్రంగా తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై తన మనస్సులో మూడు సార్లు ఏమైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని వరం ఇచ్చాడు.

వెంటనే ఆ సన్యాసి మహదానంద భరితుడై ఈ లోకంలోనే ఇప్పటి వరకు లేని విధంగా సకల సదుపాయాలు గల ఒక భవంతిని కావాలనుకున్నాడు. క్షణాలలో ఒక దివ్య భవంతి అక్కడ ప్రత్యక్షమయ్యింది. రెండు రోజులపాటు ఆ భవంతిలో సకల రాజ్య భోగాలు అనుభవించాక తనకు తోడుగా ఒక దేవ కన్య వుంటే ఈ సుఖాలను మరింత అద్భుతంగా, సంతృప్తి కరంగా అనుభవించవచ్చునని కోరుకున్నాడు. వెంటనే జగదేక సుందరి అయిన ఒక దేవ కన్య ప్రత్యక్షమయ్యింది. ఆమె చూడగానే తన జన్మ ధన్యమయ్యిందని భావించి ఆమెతో శృంగార కార్యకలాపలలో తేలిపోయాడు. రొజులు, వారాలు, నెలలుగా గడిచాయి. ఈ హడావిడిలో తనకు ఒకే కోరిక మాత్రం తీర్చుకోగలడన్న విషయం మరిచిపోయాడు ఆ సన్యాసి.
ఒక రోజు మధువు, మగువ మైకంలో వున్న అతడు " ఏ జన్మలోనో పుణ్యం చెసుకోబట్టి ఇంతటి అద్భుతమైన జీవితం అనుభవిస్తున్నాను. ఒక వేళ పొరపాటునో గ్రహపాటునో ఈ సిరి సంపదలన్నీ మాయమైపోయి నేను ఇంతకు ముందు కంటే బికారిని అయిపోయి తిండి కూడా లేక కుక్క చావు చస్తేనో ?" అని అనుకున్నాడు. వెంటనే దేవుడు ఇచ్చిన వరం ఫలితంగా అతను అనుభవించే సిరి సంపదలు మొత్తం మాయమైపోయి ఒక్కసారిగా బికారి అయిపోయాడు. అంతే కాక తన ఆలోచన ఫలితంగా తిండికి కూడా గడవని పరిస్థితి వచ్చి నిజంగానే దుర్భరమైన మరణం పొందాడు.

అన్ని ఆలోచనలకూ మన మనస్సే కేంద్ర బిందువు. మంచి ఆలోచనలను మానవుల అభివృద్ధికి ప్రాణవాయువు వంటివి.అవి మనలను సన్మార్గంలో నడిపిస్తాయి.చెడ్డ ఆలోచనలు తులసి వనంలో గంజాయి మొక్కల వంటివి. మానవాళిని అధమ : పాతాళానికి తొక్కివేస్తాయి. రెండవ ప్రపంచ యుద్దంలో ఒక దేశాధినేతకు కలిగిన ఒక చెడ్డ ఆలోచన అణుబాంబును జపాన్ లోని హోరొషిమా పై వేసి లక్షలది మంది మరణానికి కారణమయ్యింది. అణుబాంబు లోని అదే ఇంధనాన్ని మానవాళికి ఉపయోగపడేలా చేయాలన్న అబ్ధుల్ కలాం వంటి మహోన్నత వ్యక్తులకు కలిగిన ఒక మంచి ఆలోచనకు ప్రతిరూపం ఇప్పుడు కార్య రూపం దాలుస్తోంది.ఇక భవిష్యత్తులో మన దేసంలో ఇంధన కొరత వుండదని నిపుణులు భావిస్తున్నారు.

మనం ఈ సమాజానికి ఏది ఇస్తామో అదే తిరిగి మనకు లభిస్తుంది. ఇతరులకు దుఖం ఇస్తే దుఖం, ఆనందం ఇస్తే ఆనందం, సహాయం చెస్తే అదే సహాయం వెయ్యింతలై ఏదో ఒక రుపెణా మనకు లభిస్తుంది.మన ఆలోచనలే మన భవిష్యత్తుకు పునాది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నది విజ్ఞుల ఉవాచ. మంచిని చెస్తే మనకు మంచే కలుగుతుంది. మంచిని చెయ్యాలంటే మంచి ఆలోచనల ఆవశ్యకత ఎంతైనా వుంది. ఒక మంచి ఆలోచన పరిధి ఎంతో గొప్పది. వైరస్ వలే త్వర త్వరగా ఇతరులకూ వ్యాపిస్తుంది. మంచి ఆలోచనలు తద్వారా మంచి పనుల వలన మనకు లభించే సుఖ సంతోషలు, శాంతి సౌభాగ్యాలను చూసి ఇతరులు కూడా స్పూర్తి తో అటువంటి మంచి పనులను చేయడానికి ఉద్యుక్తులౌతారు. సత్కర్మల వలన విశ్వశాంతి, సమాజ శ్రేయస్సు వృద్ధి చెందుతాయి. అప్పుడు ప్రపంచం ఒక నందన వనం అవుతుంది.

సర్వేజనా సుఖినోభవంతు
లోకాస్సమస్తా సుఖినోభవంతు