Tuesday, November 23, 2010

సజ్జన సాంగత్యం

సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్వం
నిశ్చల తత్వే జీవన్ముక్తి:

సాక్షాత్తూ ఆదిగురువైన శ్రీ శంకర భగవానుని దివ్య అవతారమైన ఆది శంకరాచార్యుల వారు రచించిన భజ గోవిందం లోని పై శ్లోకం సత్సంగం యొక్క ప్రాముఖ్యాన్ని అపూర్వం గా వివరిస్తుంది. సత్సంగం అంటే సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం బహు అమూల్యమైనది.ఎన్నో జన్మల పుణ్య ఫలితం వలనే సత్సంగం సిద్ధిస్తుంది.సజ్జన సాంగత్యం నిస్సంగత్వం అనగా వివేక వైరాగ్యాలను, నిస్సంగత్వం నిర్మొహత్వం అంటే మాయ నుండి విడిపడిన పరిస్థితి, నిర్మోహత్వం నిశ్చలతత్వాన్ని అనగా మనస్సు చంచలత్వం పొందని స్థితిని ప్రసాదిస్తాయి.ఆఖరుగా నిశ్చలతత్వం జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. సాక్షాత్తు దైవ స్వరూపులైన మానవుల లక్ష్యం జొవన్ముక్తియే కదా!

మనం నిత్య జీవితం లోచేసే సాంగత్యం పై మన జీవితం, మన ఉన్నతి అధారపడి వుంటాయి.అది మన మనస్సులను, భవిష్యత్తును మన ఆత్మను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దుర్జనుల సాంగత్యం లో మనకు దురలవాట్లు అబ్బుతాయి. వారితో కలిసి ఎన్నో పాప కార్యాలను చేస్తాం. తిరిగి వాటిని మనమే అనుభవిస్తూ అంతులేని దూఖాన్ని పోగుచేసుకుంటాము. సజ్జన సాంగత్యం మన ఉన్నతికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ పంధాన నడవక పోతే పాప కార్యాల పంకిలంలో పడి చేసిన కర్మల తాలూకూ ఫలితాన్ని అనుభవించదానికి ఎన్ని జన్మలైనా జనన మరణ చక్రభ్రమణంలో కొట్టు మిట్టాడుతునే వుంటాము. అందుకే ఆత్మ సాక్షాత్కారం పొందిన ఒక సద్గురువును ఆశ్రయించడం ఎంతో అవశ్యం. వారు మనకు జీవన్ముక్తిని సాధించే మార్గాన్ని చూపిస్తారు. ఆందువలన ఆత్మ జ్ఞానాన్ని మనకై మనం వెతుక్కోవల్సిన పని లేదు. సద్గురువులకు త్రికరణ శుద్ధిగా సర్వశ్య శరణాగతి చేస్తే చాలు.

ఓ మానవుడా! జ్ఞాన వంతుల ,సద్భుద్ధి గల సజ్జనుల సాంగత్యంలో జీవితాన్ని గడుపు. ఆందువలన వారి జ్ఞానం, నీకు సంక్రమించి నువ్వు కూడా ఉద్ధరించబడతావు. భగవంతుని అపూర్వమైన , అపారమైన కరుణా కటాక్షాలకు పాత్రుడవౌతావు. లేకుంటే నరక ప్రాప్తియే గతి అంటూ శంకర భగత్పాదులు మానవులకు పై శ్లోకం ద్వారా కర్తవ్య బోధ చేసారు.

సజ్జన సాంగత్యం యొక్క ప్రాశస్తిని ఇంతకంటె అద్భుతంగా ఇంకెవరు వివరించగలరు ?

సత్సంగం మరియు సజ్జన సాంగత్యం యొక్క ప్రాశస్తిని వివరించే మరొక అద్భుతమైన కధను ఇప్పుడు స్మరించుకుందాం :

నాగరాజైన ఆదిశేషుడు సమస్త భూమండలాన్ని తన వేయి పడగలపై మోస్తున్నాడు. ఒక రొజు బ్రహ్మ దేవునికి దీటుగా సృష్టికి ప్రతి సృష్టి గావించిన రాజర్షి అయిన విశ్వామిత్రుడు వచ్చి నాగరాజును తనతో రమ్మన్నాడు. ఆందుకు ఆదిశేషుడు మిక్కిలి వినయ విధేయతలతో “ ఓ బ్రహ్మర్షి! ఈ సమస్త భూమండలం నా శిరస్సుపైనే వుంది. దీనిని పరిరక్షించడమే నా కర్తవ్యం. నేను ఈ కార్యాన్ని విస్మరించినట్లైతే ఈ భూమండలం పాతాళం వైపు పడిపోవడం తధ్యం. అప్పుడు అనేక కోట్ల జీవ రాశులు నాశనమైపోతారు” అన్నాడు.

ఆందుకు విశ్వామిత్ర మహర్షి చిరునవ్వు నవ్వి “ అటువంటిదే గనక జరిగితే నేను నా అమోఘమైన తపశ్సక్తితో దానిని ఆపుతాను” అన్నాడు.
అందుకు నాగరాజు ఒప్పుకోలేదు. విశ్వామిత్రుడు ఎన్ని విధాలుగా నచ్చ జెప్పి చూసినా ఆదిశేషుడు తన నిర్దేశిత కార్యాన్ని వదలనని మొండిపట్టు పట్టాడు. ఆదిశేషుని మంకుపట్టు చూసి విశ్వామిత్రునికి తీవ్రమైన కోపం వచ్చింది. కమండలం ఎత్తి శపించబోయేంతలో ఆదిశేషుడు భయపడి ఇక చేసేది లేక భూమిని పక్కకు పెట్టి వచ్చాడు.

అంతలొనే ఘోరమైన విపత్తు సంభవించింది. ఇన్ని వేల యుగాలుగా ఆదిశేషుని వేయిపడగలపై బధ్రంగా వున్న భూగొళం వెంటనే పాతాళం వైపు పడిపోవడం ప్రారంభించింది. దానిపై నివాసముంటున్న వేల కోట్ల జీవరాశులు ప్రాణ భయంతో ఆర్తనాదాలు చేయడం ప్రారంభించాయి.
ఆదిశేషుడు జరిగిన దానిని చూసి తీవ్రమైన దుఖంతో మాంపడిపోగా తప్పశ్శక్తి సంపన్నుడన్న గర్వంతో విశ్వామిత్రుడు కమండలం లోని నీరు ధారపొసి ఆగు అంటూ భూమిని ఆజ్ఞాపించాడు. భోగోళం పతనం ఆగలేదు. పైపెచ్చు ఆది మరింత వేగంగా పడిపోవడం ప్రారంభించింది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి పట్టరాని ఆగ్రహంతో “ నా తప శ్సక్తి అంతా ధారపోస్తున్నాను,వెంటనే ఆగు” అంటూ ఆజ్ఞాపించాడు.అయినా ఫలితం లేకపోయింది.

అప్పడు విశ్వామిత్రునికి అహంకార మైకం తొలిగిపోయింది. భూమిని ఆపడానికి తన తప: శ్సక్తి చాలదని తెలుసుకున్నాడు. ఏం చేయలా అని ఆలోచిస్తుండగా నారద మహర్షి అక్కడికి వచ్చి జరిగిన దానిని తెలుసుకొని” ఓ మహర్షి! నీవు ఎప్పుదైనా సజ్జన సాంగత్యం చేసి వుంటే ఆ ఫలితాన్ని వెంటనే ధారపొయు. భూపతనం ఆగిపోతుంది” అని సెలవిచ్చాడు.

అప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు.తాను అందరితో తగవులు పెట్టుకోవడమే కాని సజ్జన సాంగత్యం చేసింది లేదు.సాటి ముని పుంగవులతో సజ్జన సాంగత్యం , సత్సంగం చేసింది కూడా లేదు.అయినా తాను వశిష్ట మహర్షి వద్దకు వెళ్ళిన సంగతి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ పుణ్యాన్ని ధారపోయగా వెంటనే భూగోళ పతనం ఆగిపోయింది. ఆది శేషుడు యధావిధిగా తిరిగి భూమండలాన్ని తన తలకు ఎత్తుకున్నాడు.

మానవులలో దానవ మానవ గుణాలు రెండూ నిక్షిప్తమై వుంటాయి.సమయం సంధర్భం బట్టి ఏదో ఒక గుణం బయటకు ప్రకటితమౌతూ వుంటుంది. దుర్జనులతో సాంగత్యం చెస్తే అసుర గుణం బలీకృతమై ఎన్నో చెడ్డ పనులను చేస్తాం.

అందు వలన పైన వివరించినట్లుగా చెసిన పాప కర్మల తాలూకు ఫలితాన్ని అనుభవించేందుకు జనన మరణ చక్ర భ్రమణంలో పడిపోతాం.సజ్జన సాంగత్యం మనలో రజో తమో గుణాలను తగ్గించి సాత్విక భావాలను పెంచుతుంది.భగవత్ ధ్యానం, నామ స్మరణ,సంఘ సేవ, యజ్ఞ యాగాదులను నిర్వహించుట,పరుల పట్ల కరుణా కటాక్షాలను కలిగి వుండుట వంటి చక్కని కర్మలను చేసేందుకు ఎంతగానో సజ్జన సాంగత్యం తోడ్పడుతుంది. ఎక్కడ సత్సంగం జరుగునో అచ్చట దేవతలు స్థిర నివాసం చెస్తారన్నది శాస్త్ర వాక్యం. సత్కర్మలు భగవంతుని సన్నిధికి చేరేందుకు దారి చూపిస్తాయి.

కలి ప్రాభావాం అధికంగా వున్న ఈ రోజులలో సత్సంగం అంత త్వరగా దొరకదు. మానవులు ధనార్జనే ముఖ్య ధ్యేయం గా బ్రతుకుతూ మానవతా విలువలకు త్రిలోదకాలిస్తున్నారు.అరిష డ్వర్గాలకు బానిసలైపోతూ దానవ గణానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు.మంచితనం అన్నది మచ్చుకైనా కనిపించదం లేదు.

అంతటా స్వలాభం, స్వార్ధం, అవినీతి, హింసా విలయ తాండవం చేస్తున్నాయి.అటువంటి పరిస్థితులలో సత్సంగం దొరకడం బహు కష్టం. కాని ఆశావహ ధృక్పధంతో, సానుకూలంగా యత్నిస్తే సజ్జన సాంగత్యం దొరకడం కష్టమే కాని దుర్లభం కాదు. అయితే ఈ సత్సంగం అనే పూదోతలో కలుపు మొక్కలు విరివిగా మొలకెత్తడం అనివార్యం. అట్టివారి మాయలో పడక,అప్పడప్పుడు ఆ కలుపు మొక్కలను ఏరిపారవేయడం చేస్తుండాలి.లేకపోతే అద్బుతమైన పూదొట కలుపు వనంగా మారే ప్రమాదం వుంది. ఒక్క సజ్జనుడి పక్కన నిలబడితే అంత పుణ్యం లభిస్తుందని పైన వివరించిన కధ ద్వారా మనకు తెలిస్తే ఇక సాత్విక భావ సంపన్నులైన అనేక మంది సజ్జనులతో కలిసి నిత్య సహవాసం ఇంకెంత పుణ్యం సంప్రాప్తిస్తుందో కదా !

సజ్జన సాంగత్యం లోని గొప్పదనాన్ని గుర్తెరిగి, వారి కోసం కృషి చేసి అట్టి సాంగత్యాన్ని తనివి తీరా అనుభవించి శాశ్వతానందం పొందడమే మన తక్షణ కర్తవ్యం.