Sunday, October 3, 2010

బుద్ధ భగవానుని దివ్యోపదేశం

మహారాజు కుటుంబం లో పుట్టి యవన వయస్కుడయ్యే వరకూ సకలైశ్వర్యాలను అనుభవించి తర్వాత చుట్టు వున్న ప్రపంచంలో ప్రజలు అనుభవిస్తున్న బాధలను ఓర్వలేక , రాజభోగాలన్నింటినీ పరిత్యజించి సత్యాన్వేషణలో బయలుదేరి , వివేక వైరాగ్యములతో కఠోర సాధన గావించి తుదకు బోధి చెట్టు కింద తీవ్రమైన తపస్సులో మునిగి వుండగా జ్ఞాదయం చెంది, సత్య దర్శనం పొంది బుద్ధుడిగా మారిన గౌతముని జీవితం సకల ప్రాణకోటికి ఆదర్శం. సత్యం, ధర్మం, న్యాయం, కరుణ, జాలి, ప్రేమ ఇత్యాది సద్గుణములను అలవరచుకొని, దానవ గుణమును త్యజించి మానవునిగా ప్రవర్తించి భగవంతుని కరుణకు పాత్రులు కావడమే మానవుల ముఖ్య కర్తవ్యమని బుద్ధ భగవానుడు తరచుగా ప్రభోధిస్తుండేవారు. ఆ మహనీయుని జీవిత చరిత్రలో ఇప్పుడు ఒక అపూర్వమైన ఘట్టమును స్మరించుకుందాం :

బుద్ధ భగవానుడు తన ఆశ్రమం లో తన ఆసనం పక్కన ఒక ఢమరుకాన్ని వుంచుకునేవారు.ప్రతీ దినం దానిని తానే స్వయంగా శుభ్రం చేసుకునేవారు. ఎన్ని నెలలైనా దానిని ఆయన ఒక్కసారి కూడా వుపయోగించిన పాపాన పోలేదు. ఒక రోజు శిష్యులందరూ కూడ బలుక్కొని “ భగవాన్, ఈ ఢమరుకాన్ని తమరి చెంత ఎప్పటి నుండో వుంచుకుంటున్నారు, కాని ఒక్కసారి కూడా వుపయోగించలేదు, కారణం ఏమిటో దయచేసి సెలవియ్యండి” అని అడిగారు.

అందుకు బుద్ధుడు చిరునవ్వుతో “ నాయనలారా ! ఏ రోజునైతే అతి గొప్ప త్యాగం చేసిన వ్యక్తి నా దగ్గరకు వస్తాడో ఆనాడే ఈ ఢమరుకాన్ని నేను స్వయం గా వాయిస్తాను, ఇంతవరకు అటువంటి త్యాగధనుడు నా వద్దకు రాలేదు కనుక దీనిని వుపయోగించలేదు” అని అన్నారు.
ఈ వార్త ఆ నోటా ఈ నోటా ఆ రాజ్యమంతా పాకింది. తాము త్యాగధనులని నిరూపించుకోవడం కోసం ఎందరెందరో ధనికులు వచ్చి బుద్ధుని దర్శనం చెసుకొని ఎన్నో విలువైన కానుకలను అర్పించుకొని, తమను ఆశీర్వదించమని కోరసాగారు, వైరాగ్యానికి మారు పేరైన బుద్ధ భగవానుడు వాటిని తాకనైనా తాకలేదు. దాంతో తమ త్యాగాన్ని బుద్ధుడు గుర్తించనందుకు వారంతా నిరాశతో వెళిపోసాగారు. అందులో కొంతమంది కుత్సితులు బుద్ధుడిని విమర్శించడం కూడా చేసారు.

ఒకరోజు ఆ దేశాన్ని ఏలే మహరాజు బుద్ధుడిని దర్శింపదలచి ఎన్నో విలువైన కానుకలను తీసుకొని తన పరివారంతో బయలుదేరాడు. దారిలో అతని పల్లకికి ఒక పండు ముసలిది అడ్డం వచ్చి ఆకలిగా వున్నది , కాస్త అన్నంపెట్టండి” మహారాజును ప్రాధేయపడింది. మహారాజు వెంటనే జాలితో ఒక మామిడి పండును ఆమెకు ఇచ్చాడు.

కొంత సేపటికి మహారాజు బుద్ధుని ఆశ్రమానికి వచ్చి తాను తెచ్చిన విలువైన కానుకలను అర్పించుకొని పాదాభివందనం చేసి ఒక పక్కన నిలబడ్డాడు. బుద్ధ భగవానులు అప్పుడు తీవ్రమైన ధ్యానంలో మునిగి వున్నారు.

అప్పుడే ఆ ముసలి కూడా వచ్చి బుద్ధునికి నమస్కారం చేసి మహనీయుల వద్దకు ఖాళీ చేతులతో వెళ్ళకూడదన్న నియమాన్ని అనుసరించి తనకు మహారాజు ఇచ్చిన మామిడి పండును అర్పించుకుంది.

వెంటనే బుద్ధ భగవానుడు కళ్ళు తెరిచి ఆ పండును అందుకొని ఎంతో ఇష్టం గా భుజించి పక్కనే వున్న ఢమరుకాన్ని మోగించారు.

అందరూ ఆశ్చర్యపోయారు. బుద్ధుని చర్య ఎవ్వరికీ అంతు పట్టలేదు.

మహారాజు అహంకారంతో ఎగిరిపడ్డాడు. బుద్ధుడు తనను పరాభవించినట్లు తలచుకొని “ అయ్యా! మీ చర్య పక్షపాత ధోరణితో కూడుకొని వున్నది. నేను మీకు ఎన్నో విలువైన ఆభరణలను, వజ్ర వైఢూర్యాలను సమర్పించుకున్నాను. తమరు ధ్యానంలో వుండి వాటిని కనీసం చూడనైనా చూడలేదు. తమకు తపో భంగం కలిగించకుడదని నేను ఎంతో సేపటి నుండి వేచి చూస్తున్నాను. ఒక్క చిల్లి గవ్వయినా విలువ చేయని ఈ ముదుసలి నేను భిక్షగా ఇచ్చిన పండును తీసుకొని మీవద్దకు వస్తే మీరు వెంతనే కళ్ళు తెరిచి దానిని భుజించడమే కాక ఆమె ఎంతో గొప్ప త్యాగం చేసినట్లు ఢమరుకాన్ని మోగించారు. ఇది నాకెంతో అవమానం కలిగింది. దయ చేసి మీ వింత ధోరణికి మాకు క్షమార్పణ చెప్పండి” అని హుంకరించాడు.

అప్పుడు దయా సముద్రుడైన బుద్ధ భగవానుడు ఎంతో ప్రేమతో కూడిన స్వరంతో “ నీవు అజ్ఞానంలో వున్నావు కాబట్టి వాస్తవాలను తెలుసుకోలేక నా చర్య వలన అవమానం పొందినట్లు అనుకుంటున్నావు. త్యాగం అనే పవిత్రమైన కార్యక్రమంలో ఎంత చేసావన్నది కాదు ఏమి చేసావన్నది ముఖ్యం.భావం బట్టే ఫలితం ఆధారపడి వుంటుంది. నీ వద్ద పర్వతం తో సమానమైన ఆస్థి పాస్థులు వున్నాయి. నీ తర్వాత వందల తరాలు తిన్నా కరిగి పోని భోగ భాగ్యాలు నీ స్వంతం. నువ్వు నా వద్దకు వచ్చినప్పుడు రాజుననే అహంకారంతో కానుకలను నాకు సమర్పించావు. వాటికి ప్రతిఫలంగా నా వద్ద నుండి దాత అనే గుర్తింపు పొందాలని ఆశించావు. కాని ఈ ముదుసలిది కూటికి గతి లేనిది. ఎన్నో రొజులు పస్తులు వున్న తర్వాత నీ దగ్గరకు భిక్షకు వచ్చి నువ్వు ఇచ్చిన మామిడి పండును తినబోతుండగా దారిలో పోయేవారు నా గురించి చెప్పగా విని, నా దర్శనం చేసుకుందామన్న అభిలాషతో తన వార్ధ్యకాన్ని, నడవలేని స్థితిని కూడా లెఖ్ఖ చెయ్యక నా వద్దకు పరుగు పరుగున వచ్చింది. పెద్దవారి వద్దకు వట్టి చేతులతో వెళ్ళకూడదన్న నియమాన్ని అనుసరించి కడుపులో మెలి పెడుతున్న తన ఆకలిని సైతం లెఖ్ఖ చెయ్యక ఆ పండును నాకు సమర్పించి గొప్ప త్యాగం చేసింది. ఆమె ఒనరించిన ఈ అపూర్వమైన త్యాగానికి నాకెంతో ప్రీతి కలిగి ఈ ఢమరుకాన్ని మోగించి ఆమె త్యాగనిరతిని ఈ లోకానికి చాటాను. మన వద్ద ఎక్కువగా వున్నవాటిని ఇతరులకు ఇవ్వడం త్యాగం కాదు.మనకు ఎంతో ప్రియమైన దానిని మనము వదులుకోలేని వాటిని ఇతరుల సంక్షేమం కోసం ఇవ్వడమే అసలైన త్యాగం” అని చెప్పారు.

ఆ మాటలకు జ్ఞానోదయమైన ఆ మహారాజు పరిశుద్ధమైన మనసుతో బుద్ధ భగవానుడిని తన అపరాధాన్ని మన్నించమని వేడుకొని ఆయన ఆశీర్వాదాలను తిసుకొని తన పట్టణానికి తిరిగి వెళ్ళాడు.

అసలైన త్యాగానికి నిర్వచనం పై కధ. అసలైన త్యాగానికి నిర్వచనం పై కధ. మనం ప్రతీరోజూ ఏవో చిన్నపాటి దాన ధర్మాలను చేస్తూ వాటికి భగవంతుడు మనలను అనుగ్రహించలేదని ఆయనపై అక్కసు వెళ్లగక్కుకుంటాము. కానీ అసలైన త్యాగం, దానం అంటే ఏమిటో మనం బుద్ధ భగవానుడు ఇచ్చిన దివ్యోపదేశం ద్వారా గ్రహించి తదనుగుణంగా నిత్య జీవితం లో నడుచుకున్నట్లయితే ఆ సర్వేశ్వరుని కృపకు శ్రీఘ్రంగా పాత్రులమగుతాము.