Saturday, January 30, 2010

అసలు తండ్రి

మన్మధరావు, ప్రియంవదలు తమ పదవ పెళ్ళి రోజు వేడుకలను హోటల్ డాల్ఫిన్ లో అట్టహాసంగా జరుపుకుంటున్నారు. బంధు మిత్రులు అందరూ కలిసి ఒక వంద మంది దాకా వచ్చి ఫ్రీ గా వచ్చిన మందు,విందులను భలేగా ఎంజాయ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో పదేళ్ళు సక్సెస్ ఫుల్ గా పది సంవత్సరాలు కలిసి జీవించగలిగినందుకు వారిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ వారి విజయ రహస్యం అడిగి తెలుసుకుంటున్నారు.

నాల్గవ రౌండు డ్రింక్స్ తాగడం పూర్తయ్యాక మత్తు నెమ్మదిగా తలకు ఎక్కుతుండగా మన్మధరావు భార్యను పక్కకు పిలిచి ఆమె నాజుకైన చేతులను మెత్తగా నిమురుతూ మంద్ర స్వరంతో “ గత ఆరు నెలలుగా నిన్నొక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను, కాని ధైర్యం చాలక ఇంకా నువ్వు ఎక్కడ ఫీలవుతావోనన్న అనుమానంతో వూరుకున్నాను. ఇప్పుడు అడుగుదామనుకుంటున్నాను, అడగనా? ఏమనుకోవుగా?”అని అన్నాడు.

ఎన్నడూ లేనిది తన మన్మధం ఇలా కొత్తగా ప్రవర్తిస్తున్నాడేమిట్రా అని మనసులో అనుకుంటూ లేని , రాని నవ్వును హి హి హి అని కట్టుడు పళ్ళపైకి తెచ్చి పెట్టుకొని “ ఏం పర్లేదు డియర్ అడుగు” అంతే మత్తుగా అంది ప్రియంవద.అప్పటికింకా జిన్ రెండో రౌండ్ లో మాత్రమే ఆమె వుంది.సాధారణంగా అయిదు రౌండ్లు పూర్తయితే గాని ఆమెకు మత్తెక్కదు.

“ మన చిన్నోడు మిగితా ఇద్దరి కంటే ప్రవర్తనలోనూ, పోలికలలోనూ భిన్నంగా వుండడం గమనించాను. వాడు నన్ను ఒక తండ్రిలాగ చూడడు. నా దగ్గరకు రాడు, ఎత్తుకుంటే ఏడుస్తున్నాడు.మన ఫ్యామిలీ ఫొటో లో వాడు చాలా డిఫెరెంటుగా కనిపిస్తున్నాడు. మనకు పెళ్ళి అయ్యి పదేళ్ళు పూర్తయ్యింది, ఇక మన మధ్య ఏ రహస్యాలు వుండకూడదు, అందుకని ఈ విషయం లో నిజం చెప్పు”

ఊపిరి తీసుకోవడానికి అన్నట్లుగా ఒక్క క్షణం ఆగాడు మన్మధరావు.

“వీడికి తండ్రి వేరు కదూ? “ అని అడిగాడు మన్మధరావు.

భర్త మాటలకు ఆమె మైండులో వెయ్యి జిలిటెన్ స్టిక్స్ ల విస్పోటనం జరిగినట్లు ఫీలయ్యింది. తాను ఎంతో గుట్టుగా జరిపిన తెరచాటు భాగోతం గురించి భర్తకు సమస్తం తెలిసిపోయి వుండవచ్చుననుకుంది. కాని చాకచక్యంతో పరిస్థితి ని ఎదుర్కోవాలనుకొని ప్రియంవద కొంచెం సేపు కావాలనే ఏమీ మాట్లాడలేదు.

“ ఈ పదేళ్ళ మన సహచర్యంలో మనిద్దరి మధ్య బంధం చాలా బలపడింది. మనిద్దరం ఒకరిని విడువకుండా మరొకరం బ్రతికాం. నువ్వేం చెప్పినా నేను తట్టూకోగలను, పైగా నా మనసులో ఏమీ పెట్టుకోను, మన వైవాహిక జీవితం ఇంతకు ముందులాగనే మూడు డిన్నర్లు, ఆరు సినిమాల లాగ సాఫీగా,అద్భుతం గా నడుస్తుంది,కనుక నిజం చెప్పు ప్లీజ్” బ్రతిమిలాడుతున్నట్లు అడిగాడు మన్మధరావు.

గత రెండేళ్ళుగా అతని మనసులో గూడు కట్టూకున్న సంశయాన్ని ఈ పూట ఎట్లాగైనా నివృత్తి చేసుకోవాలనా పట్టుదల అతనిలో స్పష్టంగా కనిపిస్తోంది.

పది నిమిషాలైనా ఆమె నోరు విప్పకపోయేసరికి మన్మధరావులో అసహనం కట్టలు తెంచుకోసాగింది. ఇక లాభం లేదనట్లు ఆమె చేతులను తన తలపై వెసుకొని పాత సినిమాలో గుమ్మడిలా దీనంగా ఫోజు పెట్టి " నిజం చెప్పక పోతే నామీదొట్టే" అన్నాడు.

ఇక ఓవర్ యాక్టింగ్ చేస్తే మంచిది కాదని,మొదటికే మోసం రావచ్చునని అర్ధం చేసుకొని ప్రియంవద నోరు విప్పింది. నేల చూపులు చూస్తూ “ మీరన్నది నిజమే,మొదటి ఇద్దరికీ ,వాడికి తండ్రులు వేరు వేరు. అందుకే వారి ప్రవర్తనలలో తేడా వుంది” అని నెమ్మదిగా ఒక్కొక్క పదం వత్తి పలుకుతూ చెప్పింది.

ఆమె చెప్పిన సమాధానం ఆశించిన విధంగానే వుండడంతో మన్మధరావు పెద్దగా షాక్ కు గురవలేదు. బహుశా మరొకరైతే తెలుగు సినిమాలలో చూపించినట్లు ఎంత ద్రోహం చేసావు ప్రియంవదా, నేను నీకెం ఏమి అన్యాయం చేసానని నాకు ఈ పరీక్ష అంటూ ఆవేశంగా పెద్ద పెద్ద డైలాగులు పలకడం, ఆమె చెంపను చెళ్ళుమనిపించడం చెయ్యలేదు. స్వతాహాగా నెమ్మదస్తుడైనా మన్మధరావు ఒక గాఢమైన నిట్టూర్పు విడిచి” థ్యాంక్స్ ప్రియా, ఈ పూట నా మాట మన్నించి నిజం చెప్పినందుకు నీకు నేను ఎంతో ఋణపడివున్నాను. సరే! అయ్యిందేదో అయిపోయింది,ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. నారు వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా పంట చేతికి వచ్చాక ఏడిస్తే ఏం లాభం ? గతం గత: అనుకుంటూ యధావిధిగా మన జీవితం కంటిన్యూ చేద్దాం. కానీ ఒక చిన్న రిక్వెస్టు. చంటాడికి తండ్రి ఎవరో కాస్త చెప్పు” అని అన్నాడు.

ఆ మాటలకు మళ్ళీ ప్రియంవద పోయి నేల చూపులు చూడసాగింది. భర్తకు ఈ విషయం చెప్పాలా వద్దా అని మధన పడసాగింది.

మన్మధరావు ఆమెను వదిలి పెట్టలేదు. మళ్ళీ మళ్ళి అడగదమే కాకుండా చెప్పక పోతే ఒట్టు అంటూ మళ్ళి చేతులు తలపై పెట్టుకున్నాడు.

ప్రియంవద ఇక వూరుకోలేక ” మన చంటాడికి తండ్రి మీరే” అని గబ గబ అక్కడి నుండి వెళ్ళిపోయింది.

మొదట ఆమె మాటలు మన మన్మధరావుకు అర్ధం కాలేదు. ఒక పది నిమిషాల తర్వాత అతని బుర్రలో లైటు వెలిగి అసలు విషయం అర్ధం అయ్యేసరికి బుర్రలో పెద్ద విస్పోటనం జరిగి కళ్ళు తిరిగి కింద ఢామ్మని పడిపోయాడు చంటాడికి మాత్రమే తండ్రి అయిన మన్మధరావు.

Saturday, January 9, 2010

అటూ నేనే -- ఇటూ నేనే ( నా పేరే ఊసరవెల్లి)


ఒక రాజకీయ నాయకుడిని ఒక టి వి ప్రతినిధి ఇంటర్వ్యూ చేస్తున్నాడు.

"సార్,తెలంగణాపై మీ వైఖరి ఏమిటి"


రాజకీయనాయకుడు: మా వైఖరి ఇంతకు ముందు రెండు సార్లు స్పష్టం చేసాము. 2004 లో మరియు 2009 లో. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రెండు సార్లు లేఖ కూడా రాసాము.


విలేఖరి: రెండు సార్లు మీ వైఖరి భిన్నంగా వుంది కదా

రాజకీయనాయకుడు:దానికేముంది, తెలంగణా ప్రజల వైఖరి కూడా భిన్నంగా వుంది కదా.

విలేఖరి:మరి ఇప్పుడు మీ వైఖరి ఏమిటి?

రాజకీయనాయకుడు:అది అడిగే వారు ఏ ప్రాంతం వారన్న దాని బట్టి ఆధారపడి వుంటుంది, ఇంతకూ మీరు ఎక్కడి వారు ?

విలేఖరి: (నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి ఈయన గారు తిరిగి నన్నే ప్రశ్నలు వేస్తున్నారేమిట్రా అనుకొని) నేను తెలంగణా కు చెందిన వాడినిసార్.

రాజకీయనాయకుడు:అయితే రాసుకోండి. తెలంగణా ప్రజల మనోభావాలను ప్రభుత్వం గౌరవించాలి. వారి పోరాటం ఈనాటిది కదు, యాభై ఏళ్లనాటిది.వారికి ప్రత్యేక రాష్ట్రం వెంటనే ఇవ్వాలి. అందుకై నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం.జై తెలంగణా

ఇంతలో రాజకియనాయకుడు గారి సెల్లు మోగింది. ఒక పత్రికా విలేఖరి విజయవాడ నుండి ఫోన్ చెసి ఇదే ప్రశ్న అడగగా " రాష్ట్ర ప్రజలందరూ సమైక్యంగా వుండాలన్నదే నా అభిమతం. నేను సమైక్యాంధ్రా వాదిని. సమైక్యాంధ్రా కోసం నేను ఆత్మ త్యాగానికైనా సిద్ధం. సమైక్యాంధ్రా కోసం రేపటి నుండి ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలలో పర్యటన ప్రారంభిస్తున్నాను. అని చెప్పి ఫోన్ కట్ చేసాడు.

విలేఖరి: మరి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగణా లో మీ పర్యటన ఎప్పుడు సార్.

రాజకీయనాయకుడు: సీమాంధ్ర పర్యటన పూర్తవగానే తెలంగణా పర్యటన ప్రారంభమవుతుంది. అమరణ దీక్ష కూడా ప్రారంభిస్తున్నాను.

విలేఖరి: ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ దేశం నలుమూలల నుండి డిమాండ్స్ వెల్లువగా వస్తున్నాయి కదా మరి మీ అభిప్రాయం ఏమిటి ?

రాజకీయనాయకుడు : ఆయా రాష్ట్రాలలో ఏ ప్రభుత్వాలు వున్నాయనే దాని పై మా అభిప్రాయం ఆధారపడి వుంటుంది.ఇప్పుడు మూడు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగబోతున్నాయి కదా ఒకవేళ ప్రభుత్వాలు మారిపోతే వెంటనే మా వైఖరి కూడా మారిపోతుంది.

విలేఖరి: మీ వైఖరి చాలా విచిత్రంగా వుంది సార్?

రాజకీయనాయకుడు: విచిత్రం కాదూ పాడు కాదు. రెండు ప్రదేశాలలో నా పార్టీని కాపాడుకోవాలి కదా అందుకే ఈ జోడు గుర్రాల స్వారి.అప్పటికప్పుడు అందరికీ సర్ధి చెప్పదానికి వెయ్యి అబద్ధాలైనా ఆడక తప్పదు. అయినా మీ పిచ్చి గాని గంటకొక మాట మార్చే మా వంటి రాజకీయ నాయకులకు వైఖరి స్పష్టం చేయమనడం ఏమిటయ్యా? మేమెప్పుడైనా అన్న మాట మీద నిలబడ్డామా ఇప్పటి వరకు? మేము చెప్పిందే వేదం.మేము ఏమంటే అదే రాజ్యాంగం.ప్రజల నుండి రియాక్షన్ రాగానే మళ్ళీ మిమ్మల్ని పిలిచి మేమలా అనలేదని దిద్దుబాటు ప్రకటన ఇచ్చేస్తాం. ఇక్కడితో ఈ ఇంటర్వ్యూ సమాప్తం

ఇదంతా విన్న ఆ విలేఖరి కళ్ళు తిరిగి ఢామ్మని కింద పడిపోయాడు.

(కేవలం మనసారా నవ్వుకోవడానికి మాత్రమే ఈ కధ ఉద్దేశించినది. ఎవ్వరినీ నొప్పించడం నా అభిమతం కాదు.)

Wednesday, January 6, 2010

ఆత్మ విశ్వాసమే శ్రీరామ రక్ష

పూర్వం మగధ దేశం లో నివసించే రామశర్మ అనే బ్రాహ్మణుడు వర్తకం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆతనికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. భార్యా చాలా అనుకూలవతి, సత్వ గుణ సంపన్నురాలు. ఫిల్లలను, భర్తనూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ వుండేది. కోరికలను అదుపులూ వుంచుకుంటూ సంతృప్తి తో జీవి స్తుండడం వలన ఆందొళనలు, అశాంతి వారికి ఆమడ దూరం లో వుండేవి.అత్యాశకు పోకుండా కొద్దిపాటి లాభలతో వర్తకం చేస్తుండడం వలన రామ శర్మ యొక్క వ్యాపారం సాఫీగా సాగిపోతూ వుండేది. పైగా కల్తీ లేని సరుకులను తక్కువ ధరకు అమ్ముతాడన్న మంచి పేరు కూడా వచ్చింది.

రోజులన్నీ ఒకేలా వుంటే దానిని జీవితం అని ఎందుకు అంటారు? రామ శర్మ భార్యకు అనారోగ్యం వచ్చింది. దూర దేశం లో వైద్యం చేయించడం మొదలుపెట్టాడు. ఇద్దరు పిల్లలకు పెళ్ళిళ్ళి కూడా చేసేసాడు. వయో భారం వలన ఇదివరకటిలా వ్యాపారం చెయ్యలేకపోతున్నాడు. ఆదాయం మందగించింది, ఖర్చులు ఎక్కువయ్యాయి. పిల్లలు వాపారం నిమిత్తం దూర దేశాలకు వలస వెళ్ళిపోయి తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేసారు.జీవితం లో ఎదురైన ఈ కష్టాల పరంపరను తట్టుకోలేక తల్లడిల్లిపోయాడు.


ఆ సమయంలో వారి గ్రామానికి ఒక సాధు పుంగవుడు వచ్చారు. ఆయన సర్వసంగ పరిత్యాగి. సకల వేద పారంగతుడు. ఊరూరూ తిరిగుతూ అధ్యాత్మిక గోష్టి గావిస్తూ ప్రజలను సన్మార్గంలో నడిపించ యత్నించేవారు.ఆయన వద్దకు వళ్ళి పాదాలపై పడి తన కష్టాలను విన్నవించుకున్నాడు రామశర్మ.

ఆతని మాటలను విన్న ఆ సాధు పుంగవుడు చిరునవ్వుతో” నాయనా ! కష్టాలు, సుఖాల పరంపర ప్రతీ వారి జీవితం లో తప్పనిసరి. వాటిని ధైర్యం తో, ఆత్మ విశ్వాసం తో ఎదుర్కోవలే గాని పిరికితనంతో వాటి నుండి పారిపోకూడదు. పిరికి వానికి ఇహ పరములు రెండూ చెడుతాయి. ధర్మానికి మారుపేరైన శ్రీ రామ చంద్రునికి, మహలక్ష్మీ అవతారమైన సీతమ్మ తల్లికీ కష్టాలు తప్పలేదు కాదా! రాజ్య భోగాలు దూరమై పన్నెండేళ్ళూ వనవాసం చేసి పడరాని కష్టాలు పడ్డారు. సాక్షాత్తు శ్రీ కృష్ణుడు తోడున్నా పాండవులు ఎంతటి కష్టాలు పడ్డారో మనందరికి తెలుసు కదా! వారి కష్టాలతో పోలిస్తే నీకు వచ్చినవి ఎంతటివో ఒక్కసారి ఆలోచించు. జీవితాంతం సుఖాలు మాత్రమే వుండాలి కష్టాల నీలి నీడ మనపై పడకూడదని భావించడం అవివేకం. చేదు తిన్న తర్వాతే తీపి యొక్క తీయనత్వం అనుభవమగు అన్న రీతిన కష్టాలను చవి చూసినప్పుడే సౌఖాల లోని మాధుర్యం మనకు అర్ధమౌతుంది. ఆన్ని ద్వందాలనూ సమంగా స్వీకరించే ఓర్పు,నేర్పు మనం అలవరచుకోవాలి.

కష్టాలనేవి గురువు వంటివి. మనకు జీవిత సత్యాలను బోధించదానికి, ఓర్పు, సహనం, విశ్వాసం వంటి సద్గుణాలను నేర్పడానికే వస్తాయి. వాటిని చిరునవ్వుతో ఎదుర్కొని అధిగమించాలే కాని బెంబేలెత్తి పారిపోకూడదు” అని ఉద్భోదించారు.

అమృతతుల్యమైన ఆ మాటలకు రామశర్మకు జ్ఞానోదయం అయ్యింది.జారిపోయిన ఆత్మ విశ్వాసాన్ని మళ్ళీ నింపుకున్నాడు. ధైర్యంతో ముందుకు సాగి మళ్ళీ జీవితం లో ఉన్నత స్థాయిని సాధించాడు.

చీకటి వెలుగులు, అమావాశ్య పౌర్ణమి , రాత్రి పగలు వలె ద్వందాలు. ప్రతీవారి జీవితం లో ఈ చక్రభ్రమణం తప్పని సరి.కష్టాలు వచ్చినప్పుడు పరిస్థితులను, ఇతరులను నిందించకుండా భగవంతునిపై భారం వేసి ఆత్మ విశ్వాసంతో ఆ పరిస్థితి నుండి బయట పదే మార్గం ఆలోచించాలి.

సుఖాలలో మునిగి తేలుతున్నప్పుడు భగవంతుని విస్మరించరాదు. సదా భగవన్నామస్మరణ చేయడం, సత్కర్మలు ఆచరించడం, కరుణ, జాలి, క్షమలతో పరులను ప్రేమించడం, ఇతరులకు వీలైనంతగా సహాయం చేయడం, అన్నార్తులను ఆదుకోవడం వంటి సత్కార్యాలను చేస్తే భగవంతుడు సంతోషించి మానవులను భవిష్యత్తులో కష్టాల కడలిలో మునిగిపోకుండా కాపాడుతాడు. కామ, క్రోధాది అరిష్డ్వర్గములను లోబర్చుకొని సత్వ గుణ సంపన్నులమై శాంతియుత జీవనం సాగించుట అత్యావశ్యకం. ఇతరులను తమతో పోల్చుకొని తాము దురధృష్టవంతులమన్న నైరాశ్యాన్ని సత్వరం విడనాడాలి. ఈ సృష్టిలో జరిగే ప్రతీ సంఘటన ఈశ్వరేచ్చ ప్రకారమే జరుగుతుంది. సంపదలు కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చు కానీ ఆత్మ విశ్వాసం, ధైర్యం కోల్పొతే మాత్రం తిరిగి సాధించుకోలేము.

Friday, January 1, 2010

కవితా సమాహారం - 21


కర్తవ్యం


సేవ,ప్రేమ, త్యాగాలతో మానవ జన్మకు
సార్ధకత చేసుకొన యత్నించడమే
మానవుల ఏకైక కర్తవ్యం
లేనిచో తిరిగి పశు జన్మ ప్రాప్తం
జీవితమంటే ప్రేమ, వికాసం
సంకుచితం, ద్వేషాలకు లేదు చోటు
ఒకే ఒక్క క్షణం పరిపూర్ణంగా
జీవించాలన్న యోచనతోనే
జీవితం అగును సార్ధకం
ఇది అందరికీ అనుసరణీయం


చిరంజీవులు

యుగముల తరబడి రగులుతూ
పొగలు కక్కడం కంటే
ఒక్క క్షణం గొప్పగా జ్వలించడం మేలు
ఆ సత్యమును గుర్తెరిగి
ఆచరించు మానవులు
బ్రతికే వరకు జీవించెదరు
జీవితం ముగిసినా చిరంజీవులే

జీవనం

బ్రతకడం కంటే
జీవించడమే అత్యుత్తమం
స్పష్టమైన లక్ష్యములు లేక
బ్రతుకు బండి లాగించ యత్నించేవారు
లోకంలో ఒంటరులు
వారికి బ్రతుకు సంకుచితం
జీవనం కడు భారం
జీవితంలో మాధుర్యం
జీవనంలో రుచి ఆస్వాదించ
యత్నించువారు సమూహంలో
మమేకమై జీవనం సార్వజనీనం

వాగ్యజ్ఞం

వివేకులు ధనమును
దుర్వినియోగం చేయని రీతిన
వాక్కు దురుపయోగం తగదు
ప్రతీ అక్షరం ఒక పుష్పం వలె
భగవంతుని పాదాలను అర్చించవలెను
పవిత్ర పూజా ద్రవ్యం వలె
వాక్కును పవిత్రీకరించుకోవలెను
వాగ్యజ్ఞం మన కర్తవ్యం
జిహ్వ సార్ధక్యాన్ని సాధించుట
పలికిన ప్రతీ మాట
శుభ శబ్దం, శుభంకరం
కావాలన్నదే మన ప్రతిజ్ఞ

హాస్య వల్లరి-6

1.“కవిని పెళ్ళి చేసుకోవడం తప్పయిపోయిందే !” ఏడుస్తూ అంది రాధ.

“ ఏమయ్యింది ? ఆస్తి, అంతస్తులు, మంచి ఉద్యోగం వున్నాయని అతనిని కావాలనే పెళ్ళి చేసుకున్నావు గా!” ఆశ్చర్యంగా అడిగింది రేఖ.

“ప్రతి రోజూ రాత్రి తాను రాసిన ఆ దిక్కుమాలిన కవితలను వినిపిస్తూ నిద్ర లేకుండా చేస్తున్నాడు ఆ హింసరాజు ” అసలు సంగతి చెప్పింది కవి బాధితురాలైన రాధ.


2.“మీ అమ్మాయిని చూసి మొదట్లో వద్దనుకొని అంతలోనే వెంటనే ఎలా ఒప్పేసుకున్నారు పెళ్ళివారు ? “ ఆశ్చర్యంగా అడిగాడు నరసింహారావు.

“ కట్నం కింద రెండు బస్తాల కంది పప్పు అదనంగా ఇస్తానని కబురు పెట్టాను, ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నారు” అసలు సంగతి చెప్పాడు పరమేశం.

3. "ఎందుకే అయ్యగారికి జ్వరం వస్తే అంతగా బెంబేలు పడిపోతున్నావు ?” ఆశ్చర్యంగా అడిగింది ఆండాళ్ళు.

“ ఆయన మీకెంతో నాకూ అంతే కదమ్మా, అందుకే ఈ బెంగ” అసలు సంగతి చెప్పి నాలిక్కరుచుకుంది పనిమనిషి.

4. టెస్టులన్నీ చేసాక ఈ రాత్రి కంటే ఎక్కువ బ్రతకవని సుబ్బారావుకు డాక్టరు చెప్పేసాడు. విచారంగా ఇంటికి వచ్చి ఆదమరిచి నిద్రపోతున్న భార్య అనసూయను నిద్ర లేపి” ఏమేవ్! నేను ఈ రాత్రి కంటే ఎక్కువ బ్రతకనట. కనీసం ఈ రాత్రికి కబుర్లు చెప్పుకుందామే !. నా ఈ ఆఖరు కోరిక తీర్చవే” అని ప్రాధేయపడ్డాడు సుబ్బారావు.

“ ష్! ఊరుకొండి, వెధవ సంత.నేను ఉదయమే నిద్ర లేచి మహిళా మండలి మీటింగ్ కు వెళ్ళాలి. మీరైతే లేవనఖ్ఖరలేదు కదా!” అని పెద్దగా ఆవులించి తిరిగి దుప్పట్లోకి దూరింది అనసూయ.

5. ” డాక్టర్, పిప్పి పన్ను బాగా నొప్పి చేసి, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గడం లేదు. చాలా బిజీగా వుండడం వలన మీ దగ్గరకు రాలేకపోయాము. ఈ రోజు కూడా ఇంకొక అప్పాయింట్ మెంట్ వుంది. ఇంజెక్షను వగైరా అక్కరలేకుండానే త్వరగా పన్ను కాస్త పీకెయ్యండి” అఘిగాడు విశ్వేశ్వర రావు.

“అబ్బో, మీకు ధైర్యం చాలా ఎక్కువనుకుంటాను. ఏ పన్నో చూపించండి, ఒక్క నిమిషం లో లాగేస్తాను” పరికరాన్ని చేతిలోకి తీసుకొని అడిగాడు పన్నుల డాక్టర్.

“రజని, డాక్టర్ గారికి ఆ పిప్పి పన్ను కాస్త చూపించు” అని భార్యతో అని గది బయటకు జారుకున్నాడు విశ్వేశ్వర రావు.

6. ”ఏమండీ అల్లుడు గారికి ఆ పని చేత కాదుట. అమ్మాయి డార్జిలింగ్ నుండి ఫోన్ చేసింది. అటువంటి వ్యక్తితో జీవితాంతం కాపురం చెయ్యలేనని, విడాకులు వెంటనే కావాలని అంటోంది” ఏడుస్తూ చెప్పింది అనసూయ.

“ ఇంతకీ ఆల్లుడు గారికి ఏ పని చేత కాదుట?” గాభరాగా అడిగాడు సుబ్బారావు.

“వంట చెయ్యడం” తాపీగా చెప్పింది అనసూయ.

7. అలసత్వానికి మారుపేరైన సుబ్బారావుకు తీవ్రం గా జబ్బు చేసింది. చాలా కాలం తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకున్నాడు. డాక్టర్ రాసి ఇచ్చిన టెస్టులను బద్ధకించి ఇంకొక రెండు నెలల తర్వాత చేయించుకొని ,ఇంకొక నెల తర్వాత వాటిని చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు.

రిపోర్టులను చూసిన తర్వాత డాక్తర్” సుబ్బారావు గారు, మీకొక బాడ్ న్యూస్.మీరు ఎక్కువ కాలం బతకరు” అని అన్నాడు.

ఆ మాటలు విన్న సుబ్బారావుకు తల దిమ్మెక్కిపోయింది. “ఏమిటి డాక్టర్ గారు మీరు చెప్పేది ? ఇంకా ఎంత కాలం నేను బతుకుతాను ?” అని అడుగగా ఆ డక్తర్ “పది” అని చెప్పాడు.

“ఏమిటి పది డాక్టర్ ? సంవత్సరాలా?నెలలా?వారాలా?సరిగ్గా చెప్పండి? గద్దించాడు సుబ్బారావు.

“తొమ్మిది, ఎనిమిది,ఏదు” లెఖ పెట్టడం ప్రారంభించాడు డాక్టర్.

8. ఒక పిచ్చాసుపత్రి క్లీనిక్ ముందు నుండి వెళ్తుండగా “పదమూడు, పదమూడు “ అంటూ పెద్దగా కేకలు వినబడ్దాయి రామారావుకు.

ఆతృత ఎక్కువై ఏమిటో కనుకుందామని ఆసుపత్రి ఆవరణ లోనికి వెళ్ళాడు. మెయిన్ డొరు వేసి వుంది. దానికి వున్న కన్నం నుండి లోనికి చూడ్డానికి ప్రయత్నించాడు. ఇంతలో అతని కళ్ళు బైర్లు కమ్మాయి. లోపల్నుంచి ఎవరో పుల్లతో అతని కళ్ళలో గట్టిగా పొడిచారు. “అమ్మా" అని బాధతో గట్టిగా అరిచి కన్నుని మూసుకోగా “పధ్నాలుగు, పధ్నాలుగు " అని మళ్ళీ కేకలు మొదలయ్యాయి.

నీతి : తనకు మాలిన ధర్మం వలదు.