Saturday, January 9, 2010

అటూ నేనే -- ఇటూ నేనే ( నా పేరే ఊసరవెల్లి)


ఒక రాజకీయ నాయకుడిని ఒక టి వి ప్రతినిధి ఇంటర్వ్యూ చేస్తున్నాడు.

"సార్,తెలంగణాపై మీ వైఖరి ఏమిటి"


రాజకీయనాయకుడు: మా వైఖరి ఇంతకు ముందు రెండు సార్లు స్పష్టం చేసాము. 2004 లో మరియు 2009 లో. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రెండు సార్లు లేఖ కూడా రాసాము.


విలేఖరి: రెండు సార్లు మీ వైఖరి భిన్నంగా వుంది కదా

రాజకీయనాయకుడు:దానికేముంది, తెలంగణా ప్రజల వైఖరి కూడా భిన్నంగా వుంది కదా.

విలేఖరి:మరి ఇప్పుడు మీ వైఖరి ఏమిటి?

రాజకీయనాయకుడు:అది అడిగే వారు ఏ ప్రాంతం వారన్న దాని బట్టి ఆధారపడి వుంటుంది, ఇంతకూ మీరు ఎక్కడి వారు ?

విలేఖరి: (నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి ఈయన గారు తిరిగి నన్నే ప్రశ్నలు వేస్తున్నారేమిట్రా అనుకొని) నేను తెలంగణా కు చెందిన వాడినిసార్.

రాజకీయనాయకుడు:అయితే రాసుకోండి. తెలంగణా ప్రజల మనోభావాలను ప్రభుత్వం గౌరవించాలి. వారి పోరాటం ఈనాటిది కదు, యాభై ఏళ్లనాటిది.వారికి ప్రత్యేక రాష్ట్రం వెంటనే ఇవ్వాలి. అందుకై నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం.జై తెలంగణా

ఇంతలో రాజకియనాయకుడు గారి సెల్లు మోగింది. ఒక పత్రికా విలేఖరి విజయవాడ నుండి ఫోన్ చెసి ఇదే ప్రశ్న అడగగా " రాష్ట్ర ప్రజలందరూ సమైక్యంగా వుండాలన్నదే నా అభిమతం. నేను సమైక్యాంధ్రా వాదిని. సమైక్యాంధ్రా కోసం నేను ఆత్మ త్యాగానికైనా సిద్ధం. సమైక్యాంధ్రా కోసం రేపటి నుండి ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలలో పర్యటన ప్రారంభిస్తున్నాను. అని చెప్పి ఫోన్ కట్ చేసాడు.

విలేఖరి: మరి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగణా లో మీ పర్యటన ఎప్పుడు సార్.

రాజకీయనాయకుడు: సీమాంధ్ర పర్యటన పూర్తవగానే తెలంగణా పర్యటన ప్రారంభమవుతుంది. అమరణ దీక్ష కూడా ప్రారంభిస్తున్నాను.

విలేఖరి: ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ దేశం నలుమూలల నుండి డిమాండ్స్ వెల్లువగా వస్తున్నాయి కదా మరి మీ అభిప్రాయం ఏమిటి ?

రాజకీయనాయకుడు : ఆయా రాష్ట్రాలలో ఏ ప్రభుత్వాలు వున్నాయనే దాని పై మా అభిప్రాయం ఆధారపడి వుంటుంది.ఇప్పుడు మూడు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగబోతున్నాయి కదా ఒకవేళ ప్రభుత్వాలు మారిపోతే వెంటనే మా వైఖరి కూడా మారిపోతుంది.

విలేఖరి: మీ వైఖరి చాలా విచిత్రంగా వుంది సార్?

రాజకీయనాయకుడు: విచిత్రం కాదూ పాడు కాదు. రెండు ప్రదేశాలలో నా పార్టీని కాపాడుకోవాలి కదా అందుకే ఈ జోడు గుర్రాల స్వారి.అప్పటికప్పుడు అందరికీ సర్ధి చెప్పదానికి వెయ్యి అబద్ధాలైనా ఆడక తప్పదు. అయినా మీ పిచ్చి గాని గంటకొక మాట మార్చే మా వంటి రాజకీయ నాయకులకు వైఖరి స్పష్టం చేయమనడం ఏమిటయ్యా? మేమెప్పుడైనా అన్న మాట మీద నిలబడ్డామా ఇప్పటి వరకు? మేము చెప్పిందే వేదం.మేము ఏమంటే అదే రాజ్యాంగం.ప్రజల నుండి రియాక్షన్ రాగానే మళ్ళీ మిమ్మల్ని పిలిచి మేమలా అనలేదని దిద్దుబాటు ప్రకటన ఇచ్చేస్తాం. ఇక్కడితో ఈ ఇంటర్వ్యూ సమాప్తం

ఇదంతా విన్న ఆ విలేఖరి కళ్ళు తిరిగి ఢామ్మని కింద పడిపోయాడు.

(కేవలం మనసారా నవ్వుకోవడానికి మాత్రమే ఈ కధ ఉద్దేశించినది. ఎవ్వరినీ నొప్పించడం నా అభిమతం కాదు.)

1 comment:

bondalapati said...

మన పరిధి లో మనమూ అప్పుడప్పుడూ ఇలానే ప్రవర్తిస్తూ ఉంటాం. ముఖ్యం గా గృహ రాజకీయాలవిషయం లో.