Wednesday, January 6, 2010

ఆత్మ విశ్వాసమే శ్రీరామ రక్ష

పూర్వం మగధ దేశం లో నివసించే రామశర్మ అనే బ్రాహ్మణుడు వర్తకం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆతనికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. భార్యా చాలా అనుకూలవతి, సత్వ గుణ సంపన్నురాలు. ఫిల్లలను, భర్తనూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ వుండేది. కోరికలను అదుపులూ వుంచుకుంటూ సంతృప్తి తో జీవి స్తుండడం వలన ఆందొళనలు, అశాంతి వారికి ఆమడ దూరం లో వుండేవి.అత్యాశకు పోకుండా కొద్దిపాటి లాభలతో వర్తకం చేస్తుండడం వలన రామ శర్మ యొక్క వ్యాపారం సాఫీగా సాగిపోతూ వుండేది. పైగా కల్తీ లేని సరుకులను తక్కువ ధరకు అమ్ముతాడన్న మంచి పేరు కూడా వచ్చింది.

రోజులన్నీ ఒకేలా వుంటే దానిని జీవితం అని ఎందుకు అంటారు? రామ శర్మ భార్యకు అనారోగ్యం వచ్చింది. దూర దేశం లో వైద్యం చేయించడం మొదలుపెట్టాడు. ఇద్దరు పిల్లలకు పెళ్ళిళ్ళి కూడా చేసేసాడు. వయో భారం వలన ఇదివరకటిలా వ్యాపారం చెయ్యలేకపోతున్నాడు. ఆదాయం మందగించింది, ఖర్చులు ఎక్కువయ్యాయి. పిల్లలు వాపారం నిమిత్తం దూర దేశాలకు వలస వెళ్ళిపోయి తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేసారు.జీవితం లో ఎదురైన ఈ కష్టాల పరంపరను తట్టుకోలేక తల్లడిల్లిపోయాడు.


ఆ సమయంలో వారి గ్రామానికి ఒక సాధు పుంగవుడు వచ్చారు. ఆయన సర్వసంగ పరిత్యాగి. సకల వేద పారంగతుడు. ఊరూరూ తిరిగుతూ అధ్యాత్మిక గోష్టి గావిస్తూ ప్రజలను సన్మార్గంలో నడిపించ యత్నించేవారు.ఆయన వద్దకు వళ్ళి పాదాలపై పడి తన కష్టాలను విన్నవించుకున్నాడు రామశర్మ.

ఆతని మాటలను విన్న ఆ సాధు పుంగవుడు చిరునవ్వుతో” నాయనా ! కష్టాలు, సుఖాల పరంపర ప్రతీ వారి జీవితం లో తప్పనిసరి. వాటిని ధైర్యం తో, ఆత్మ విశ్వాసం తో ఎదుర్కోవలే గాని పిరికితనంతో వాటి నుండి పారిపోకూడదు. పిరికి వానికి ఇహ పరములు రెండూ చెడుతాయి. ధర్మానికి మారుపేరైన శ్రీ రామ చంద్రునికి, మహలక్ష్మీ అవతారమైన సీతమ్మ తల్లికీ కష్టాలు తప్పలేదు కాదా! రాజ్య భోగాలు దూరమై పన్నెండేళ్ళూ వనవాసం చేసి పడరాని కష్టాలు పడ్డారు. సాక్షాత్తు శ్రీ కృష్ణుడు తోడున్నా పాండవులు ఎంతటి కష్టాలు పడ్డారో మనందరికి తెలుసు కదా! వారి కష్టాలతో పోలిస్తే నీకు వచ్చినవి ఎంతటివో ఒక్కసారి ఆలోచించు. జీవితాంతం సుఖాలు మాత్రమే వుండాలి కష్టాల నీలి నీడ మనపై పడకూడదని భావించడం అవివేకం. చేదు తిన్న తర్వాతే తీపి యొక్క తీయనత్వం అనుభవమగు అన్న రీతిన కష్టాలను చవి చూసినప్పుడే సౌఖాల లోని మాధుర్యం మనకు అర్ధమౌతుంది. ఆన్ని ద్వందాలనూ సమంగా స్వీకరించే ఓర్పు,నేర్పు మనం అలవరచుకోవాలి.

కష్టాలనేవి గురువు వంటివి. మనకు జీవిత సత్యాలను బోధించదానికి, ఓర్పు, సహనం, విశ్వాసం వంటి సద్గుణాలను నేర్పడానికే వస్తాయి. వాటిని చిరునవ్వుతో ఎదుర్కొని అధిగమించాలే కాని బెంబేలెత్తి పారిపోకూడదు” అని ఉద్భోదించారు.

అమృతతుల్యమైన ఆ మాటలకు రామశర్మకు జ్ఞానోదయం అయ్యింది.జారిపోయిన ఆత్మ విశ్వాసాన్ని మళ్ళీ నింపుకున్నాడు. ధైర్యంతో ముందుకు సాగి మళ్ళీ జీవితం లో ఉన్నత స్థాయిని సాధించాడు.

చీకటి వెలుగులు, అమావాశ్య పౌర్ణమి , రాత్రి పగలు వలె ద్వందాలు. ప్రతీవారి జీవితం లో ఈ చక్రభ్రమణం తప్పని సరి.కష్టాలు వచ్చినప్పుడు పరిస్థితులను, ఇతరులను నిందించకుండా భగవంతునిపై భారం వేసి ఆత్మ విశ్వాసంతో ఆ పరిస్థితి నుండి బయట పదే మార్గం ఆలోచించాలి.

సుఖాలలో మునిగి తేలుతున్నప్పుడు భగవంతుని విస్మరించరాదు. సదా భగవన్నామస్మరణ చేయడం, సత్కర్మలు ఆచరించడం, కరుణ, జాలి, క్షమలతో పరులను ప్రేమించడం, ఇతరులకు వీలైనంతగా సహాయం చేయడం, అన్నార్తులను ఆదుకోవడం వంటి సత్కార్యాలను చేస్తే భగవంతుడు సంతోషించి మానవులను భవిష్యత్తులో కష్టాల కడలిలో మునిగిపోకుండా కాపాడుతాడు. కామ, క్రోధాది అరిష్డ్వర్గములను లోబర్చుకొని సత్వ గుణ సంపన్నులమై శాంతియుత జీవనం సాగించుట అత్యావశ్యకం. ఇతరులను తమతో పోల్చుకొని తాము దురధృష్టవంతులమన్న నైరాశ్యాన్ని సత్వరం విడనాడాలి. ఈ సృష్టిలో జరిగే ప్రతీ సంఘటన ఈశ్వరేచ్చ ప్రకారమే జరుగుతుంది. సంపదలు కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చు కానీ ఆత్మ విశ్వాసం, ధైర్యం కోల్పొతే మాత్రం తిరిగి సాధించుకోలేము.

No comments: