Friday, January 1, 2010

హాస్య వల్లరి-6

1.“కవిని పెళ్ళి చేసుకోవడం తప్పయిపోయిందే !” ఏడుస్తూ అంది రాధ.

“ ఏమయ్యింది ? ఆస్తి, అంతస్తులు, మంచి ఉద్యోగం వున్నాయని అతనిని కావాలనే పెళ్ళి చేసుకున్నావు గా!” ఆశ్చర్యంగా అడిగింది రేఖ.

“ప్రతి రోజూ రాత్రి తాను రాసిన ఆ దిక్కుమాలిన కవితలను వినిపిస్తూ నిద్ర లేకుండా చేస్తున్నాడు ఆ హింసరాజు ” అసలు సంగతి చెప్పింది కవి బాధితురాలైన రాధ.


2.“మీ అమ్మాయిని చూసి మొదట్లో వద్దనుకొని అంతలోనే వెంటనే ఎలా ఒప్పేసుకున్నారు పెళ్ళివారు ? “ ఆశ్చర్యంగా అడిగాడు నరసింహారావు.

“ కట్నం కింద రెండు బస్తాల కంది పప్పు అదనంగా ఇస్తానని కబురు పెట్టాను, ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నారు” అసలు సంగతి చెప్పాడు పరమేశం.

3. "ఎందుకే అయ్యగారికి జ్వరం వస్తే అంతగా బెంబేలు పడిపోతున్నావు ?” ఆశ్చర్యంగా అడిగింది ఆండాళ్ళు.

“ ఆయన మీకెంతో నాకూ అంతే కదమ్మా, అందుకే ఈ బెంగ” అసలు సంగతి చెప్పి నాలిక్కరుచుకుంది పనిమనిషి.

4. టెస్టులన్నీ చేసాక ఈ రాత్రి కంటే ఎక్కువ బ్రతకవని సుబ్బారావుకు డాక్టరు చెప్పేసాడు. విచారంగా ఇంటికి వచ్చి ఆదమరిచి నిద్రపోతున్న భార్య అనసూయను నిద్ర లేపి” ఏమేవ్! నేను ఈ రాత్రి కంటే ఎక్కువ బ్రతకనట. కనీసం ఈ రాత్రికి కబుర్లు చెప్పుకుందామే !. నా ఈ ఆఖరు కోరిక తీర్చవే” అని ప్రాధేయపడ్డాడు సుబ్బారావు.

“ ష్! ఊరుకొండి, వెధవ సంత.నేను ఉదయమే నిద్ర లేచి మహిళా మండలి మీటింగ్ కు వెళ్ళాలి. మీరైతే లేవనఖ్ఖరలేదు కదా!” అని పెద్దగా ఆవులించి తిరిగి దుప్పట్లోకి దూరింది అనసూయ.

5. ” డాక్టర్, పిప్పి పన్ను బాగా నొప్పి చేసి, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గడం లేదు. చాలా బిజీగా వుండడం వలన మీ దగ్గరకు రాలేకపోయాము. ఈ రోజు కూడా ఇంకొక అప్పాయింట్ మెంట్ వుంది. ఇంజెక్షను వగైరా అక్కరలేకుండానే త్వరగా పన్ను కాస్త పీకెయ్యండి” అఘిగాడు విశ్వేశ్వర రావు.

“అబ్బో, మీకు ధైర్యం చాలా ఎక్కువనుకుంటాను. ఏ పన్నో చూపించండి, ఒక్క నిమిషం లో లాగేస్తాను” పరికరాన్ని చేతిలోకి తీసుకొని అడిగాడు పన్నుల డాక్టర్.

“రజని, డాక్టర్ గారికి ఆ పిప్పి పన్ను కాస్త చూపించు” అని భార్యతో అని గది బయటకు జారుకున్నాడు విశ్వేశ్వర రావు.

6. ”ఏమండీ అల్లుడు గారికి ఆ పని చేత కాదుట. అమ్మాయి డార్జిలింగ్ నుండి ఫోన్ చేసింది. అటువంటి వ్యక్తితో జీవితాంతం కాపురం చెయ్యలేనని, విడాకులు వెంటనే కావాలని అంటోంది” ఏడుస్తూ చెప్పింది అనసూయ.

“ ఇంతకీ ఆల్లుడు గారికి ఏ పని చేత కాదుట?” గాభరాగా అడిగాడు సుబ్బారావు.

“వంట చెయ్యడం” తాపీగా చెప్పింది అనసూయ.

7. అలసత్వానికి మారుపేరైన సుబ్బారావుకు తీవ్రం గా జబ్బు చేసింది. చాలా కాలం తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకున్నాడు. డాక్టర్ రాసి ఇచ్చిన టెస్టులను బద్ధకించి ఇంకొక రెండు నెలల తర్వాత చేయించుకొని ,ఇంకొక నెల తర్వాత వాటిని చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు.

రిపోర్టులను చూసిన తర్వాత డాక్తర్” సుబ్బారావు గారు, మీకొక బాడ్ న్యూస్.మీరు ఎక్కువ కాలం బతకరు” అని అన్నాడు.

ఆ మాటలు విన్న సుబ్బారావుకు తల దిమ్మెక్కిపోయింది. “ఏమిటి డాక్టర్ గారు మీరు చెప్పేది ? ఇంకా ఎంత కాలం నేను బతుకుతాను ?” అని అడుగగా ఆ డక్తర్ “పది” అని చెప్పాడు.

“ఏమిటి పది డాక్టర్ ? సంవత్సరాలా?నెలలా?వారాలా?సరిగ్గా చెప్పండి? గద్దించాడు సుబ్బారావు.

“తొమ్మిది, ఎనిమిది,ఏదు” లెఖ పెట్టడం ప్రారంభించాడు డాక్టర్.

8. ఒక పిచ్చాసుపత్రి క్లీనిక్ ముందు నుండి వెళ్తుండగా “పదమూడు, పదమూడు “ అంటూ పెద్దగా కేకలు వినబడ్దాయి రామారావుకు.

ఆతృత ఎక్కువై ఏమిటో కనుకుందామని ఆసుపత్రి ఆవరణ లోనికి వెళ్ళాడు. మెయిన్ డొరు వేసి వుంది. దానికి వున్న కన్నం నుండి లోనికి చూడ్డానికి ప్రయత్నించాడు. ఇంతలో అతని కళ్ళు బైర్లు కమ్మాయి. లోపల్నుంచి ఎవరో పుల్లతో అతని కళ్ళలో గట్టిగా పొడిచారు. “అమ్మా" అని బాధతో గట్టిగా అరిచి కన్నుని మూసుకోగా “పధ్నాలుగు, పధ్నాలుగు " అని మళ్ళీ కేకలు మొదలయ్యాయి.

నీతి : తనకు మాలిన ధర్మం వలదు.

No comments: