Saturday, December 19, 2009

భగవద్దర్శనం

పూర్వం మందగిరి అరణ్య ప్రాంతం లో ఒక గురు కులం వుండేది. అక్కడికి దేశం నలుమూలలా నుండి ఎందరో విధ్యార్ధులు విద్యాభ్యాసం కోసం వస్తుండేవారు. ఆ గురుకులానికి అధిపతి చిదానంద మహర్షుల వారు. చిదానంద మహర్షి సకల వేద పారంగతుడు. సకల శాస్త్రాలను, పనిషత్తులను,పురాణేతిహాసాలను ఔపాసన పట్టిన దిట్ట. తన తప:శ్సక్తితో తన గురుకులానికి వచ్చే ఎందరికో ఎన్నో వ్యాధులను నయం చేసేవారు. తన శిష్యులను తన కంటే ఉత్తములుగా తీర్చి దిద్దాలని సదా తాపత్రయపడుతుండేవారు.

ఆ గురుకులంలో రామశాస్త్రి అనే బ్రాహ్మణ బాలుడు విద్యాభ్యాసం చేస్తుండేవాడు. రామశాస్త్రి స్వతాహాగా చాలా తెలివైన వాడు. ఏక సంధాగ్రహి. గురువు చెప్పిన అతి క్లిష్టమైన పాఠాలను ఠక్కున అర్ధం చేసుకొని గుర్తుంచుకొనడమే కాదు, అడిగినప్పుడల్లా వెంటనే తిరిగి అప్పజెప్పేవాడు. తాను నేర్చుకున్న పాఠాలలో సందేహాలు కలిగితే ఏ మాత్రం సంశయం లేకుండా గురువు గారి దగ్గరకు వెళ్ళి సందేహ నివృత్తి చేసుకునేవాడు. రామశాస్త్రి యొక్క బహుముఖ ప్రజ్ఞ కు,తెలివితేటలకు సాటి విద్యార్ధులే కాక చిదానంద మహర్షి సైతం ఆశ్చర్యపోతుండేవారు.

ఒక సారి రామశాస్త్రి మహర్షుల వారు చెప్పిన భగవంతుని సర్వ వ్యాపక తత్వం అనే పాఠాన్ని తిరిగి వల్లె వేస్తుండగా భగవంతుడు ఎలా వుంటాడు అనే సందేహం కలిగింది. వెంటనే ధ్యానం చేసుకుంటున్న మహర్షుల పాదాలకు నమస్కరించి తన సందేహాన్ని తెలియజేసాడు. "గురుదేవా ! మీరు భగవంతుడు ఈ సకల చరా చర సృష్టిలో చివరకు జడమైన పధార్ధాలలో కూడా అంతటా వ్యాపించి వుంటాడని తెలియజేసారు. అసలు ఆ పరమాత్ముని స్వరూపమేమిటి ? ఏ రూపంలో ఈ విశ్వమంతటా వ్యాపించి వున్నాడు ? ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలని నాకు గాఢం గా వుంది"

శిష్యునికి వచ్చిన సందేహం విని మహర్షుల వారు ఎంతో సంతోషించి భగవంతుని సర్వ వ్యాపకత్వం గూర్చి మరింత విపులంగా తెలియజెసి , ఆఖరులో " ఆ భగవంతుని దర్శించాలన్న నీ కోరిక చాలా పవిత్రమైనది మరియు ఉన్నతమైనది.అయితే కేవలం కోరిక వుంటే సరిపోదు. ఆ సర్వేశ్వరుడిని దర్శించాలన్న ఆకాంక్ష తీవ్రం గా వుండాలి.అప్పుడే భవద్దర్శనం ప్రాప్తమౌతుంది" అని ఉద్భోదించారు.

"నాకు ఆ దేవుడిని దర్శించాలన్న కోరిక చాలా ఎక్కువగా వుంది గురుదేవా ! మీ తప:శ్శక్తితో ఎట్లాగైనా నాకు ఆ ప్రాప్తం కలుగజేయండి" అని ప్రార్ధించాడు రామశాస్త్రి.

శిష్యుని మాటలు విని చిన్నగా మందహాసం చెసి "తప్పకుండా నాయనా ! సమయం వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం చేయిస్తాను" అని అన్నారు మహర్షుల వారు.

ఆ సమాధానంతో అప్పటికి సంతృప్తి చెందినా ప్రతీ రోజూ భగవంతుడు ఎలా వుంటాడా అని ఆలోచించసాగాడు రామశాస్త్రి. భగవంతుడు ఏ రూపంలో వుంటే ఈ విశ్వమంతటా వ్యాపించి వుండగలడు? ఆ రూపాన్ని ఒక్కసారి దర్శిస్తే గాని తన సంశయం తీరదని ధృఢంగా నిశ్చయించుకున్నాడు.అదే విషయాన్ని మహర్షుల వారిని పదే పదే అడగసాగాడు.

ఒకరోజు చిదానంద మహర్షుల వారు రామశాస్త్రిని తనతో పాటు సముద్ర స్నానానికి రమ్మన్నారు.అలాగేనని గురువుతో పాటు వెళ్ళాడు రామశాస్త్రి. ఇద్దరూ నడుమ లోతు నీటిలోకి దిగి స్నానం చెయ్యసాగారు. ఇంతలో మహర్షుల వారు రామశాస్త్రి పిలక పట్టుకొని హఠాత్తుగా నీళ్ళలోనికి ముంచేసారు.ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపోయిన రామసాస్త్రి భయాందోళనలతో "గురుదేవా ! నన్ను రక్షించండి. నేను చచ్చిపోతున్నాను,నాకు ఊపిరి ఆడడం లేదు" అంటూ బిగ్గరగా ఆర్తనాదం చేయసాగాడు.అంతే కాక ఒడ్డున పడిన చేపపిల్లలా కాళ్ళు,చేతులు గట్టిగా కొట్టుకోసాగాడు.గురువు గారు పట్టిన పట్టును విడువకపోయేసరికి ఇక తనకు ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లేనని, తన అహంకారానికి గురువు గారి ఈ విధంగా శిక్షిస్తున్నారని నిర్ణయించుకున్నాడు రామ శాస్త్రి.

సరిగ్గా అప్పుడే శిష్యుని పిలక పట్టుకొని నీళ్ళ నుండి పైకి లాగారు మహర్షుల వారు. ఆ చర్యతో ఒకింత ఉపశమనం పొందాడు రామశాస్త్రి.

'నీళ్ళలో వుండేటప్పుడు నీకేమనిపించింది? దేని కోసం పరితపించావు? "ప్రశ్నించారు చిదానంద మహర్షి.
"గురుదేవా! నీళ్ళలో మునిగిపోయినప్పుడు ఊపిరి అందలేదు.మరణం తధ్యమని భావించాను.కాస్తంత ఊపిరి లభిస్తే చాలని భావించాను" వినయంగ చెప్పాడు రామశాస్త్రి.

"నువ్వు ఇంతకాలంగా అడుగుతున్న ప్రశ్నకు ఇదే సమాధానం"చెప్పారు చిదానంద మహర్షి. "నీటిలో మునిగిపోయినప్పుడు ఊపిరి కోసం,ప్రాణానికి రక్షణ కోసం ఎలా పరితపించావో అంతే ఆర్తితో భగవంతుని కోసం పరితపించినప్పుడు ఆ సర్వేశ్వేరుడు తప్పక తన దర్శన భాగ్యం కలుగజేస్తాడు.భగవద్దర్శనం కోసం కావల్సినంత కేవలం ప్రేమ, భక్తి మరియు తీవ్రమైన ఆకాంక్ష,ఐహికపరమైన కోరికలతో అనుక్షణం కొట్టుమిట్టాడే వారికి భగవద్దర్శనం అసాధ్యం. ఆ విధంగా కృషి చేసి నీ లక్ష్యాన్ని సాధించుకో."

గురుదేవుల మాటలకు రామశాస్త్రి ఎంతో సంతోషించి కళ్ళ నీళ్ళ పర్యంతమై పాదాభివందనం చేసాడు.

No comments: