Friday, December 18, 2009

ధర్మాచరణే శ్రేష్టం

ధర్మార్ధ, కామ,మోక్షములను పురుషార్ధములని మన వేదాలు నిర్వచించాయి. అంటే ఏన్నో వేల జన్మల అనంతరం లభించే ఈ అపురూపమైన మానవ జన్మ ఎత్తిన ప్రతీవారు తప్పక సాధించవలసిన విషయములివి అని అర్ధం. వీటిలో ఏ ఒక్కటి సాధించలెకపోయినా ఎత్తిన ఈ మానవ జన్మకు విలువ వుండదు.ఈ పురుషార్ధముల వరుస క్రమాన్ని పరిశీలిస్తే ధర్మం ప్రధమ స్థానం లో వుంది.దీనిని బట్టి ధర్మాచరణ మరియు ధర్మయుతమైన జీవనాన్ని కొనసాగించవల్సిన ఆవశ్యకతను మన వేదాలు నొక్కి వక్కాణించాయి.

ఐహిక విషయ వాంచలు, భోగ భాగ్యాలే కాక మైధునముల విషయములను కూడా ధర్మయుతంగానే మనం సాధించుకోవాలి , అనుభవించాలి. మనం వేసే ప్రతీ అడుగు, ప్రతి ఆలోచనా కూడా ధర్మానుకూలంగానే వుండాలి.ఇది సృష్టి నియమం. ఎంతటి మహా భక్తుడైనా వీటిని అధర్మయుతంగా సాధించాలని యత్నిస్తే అధోగతి పాలు కాక తప్పదు. ఇందుకు మన పురాణాలలో లెక్కకు మించిన తార్కాణాలు వున్నాయి.

రాక్షసరాజైన హిరణ్య కశిపుడు దేవతలను లొంగదిసుకోవడానికి బ్రహ్మ దేవుని గూర్చి అతి కఠోరమైన తపస్సు చేసాడు. మహర్షులకు సైతం సాధ్యం కాని రీతిన తపస్సు ఒనరించాడని మన పురాణాలు తెలియజెస్తున్నాయి. ఆయన తపస్సుకు సంతోషించి బ్రహ్మదేవుడు ఏదైనా వరం కోరుకోమని అడిగితే అజ్ఞానం, గర్వాహంకారములతో తల్లి కడుపులో నుండి పుట్టక,రాత్రి, పగలు కాక, మనిషి, జంతువు కాక నేలమీద, ఆకాశం లో కాక మరణించకుండునట్లు వరం పొందాడు. ఇది ఎంతటి అధర్మ యుతం ? సృష్టికి విరుద్ధం ? స్వార్ధానికి పరాకాష్ట. వరం పొందాక మరణమును జయించానన్న అహంకారంతో విర్రవీగి ఎన్నో వర్ణింప శక్యం కాని దుర్మార్గాలను చేసాడు.దేవతలను అనేక ఇ క్కట్ల పాలు చేసాడు. ఎందరో పర స్త్రీలను అమానుషంగా అధర్మయుతం గా అనుభవించాడు. ఫలితంగా అతని పాపం పండే నాటికి శ్రీ మహా విష్ణువు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపనార్ధం నారసింహావతారమును ఎత్తి హిరణ్య కశిపుని సంహరించాడు. హిరణ్య కశిపుని ఘోర తపస్సు అధర్మ యుత కోరికలకు , నడవడికకు బలైపోయింది.

పరమ శివ భక్తాగ్రేసరుడైన రావణ బ్రహ్మ తన తల్లి కొరిక తీర్చడం కొరకు కఠోర తపస్సు గావించి శివుని ఆత్మ లింగానే కానుకగా పొందాడు.మహా భక్తుడనన్న అహంకారంతో శివ పార్వతుల నివాసమైన కైలాస పర్వతమును పెకిలించి తన శిరస్సుపై మోసినవాడు. నిత్యం సప్త సముద్రాలను దాటి శివ ఆరాధన గావించి తిరిగి తన లంకాపురికి వచ్చేవరకు పచ్చి గంగైనా ముట్టని రావణ బ్రహ్మ తన అద్భుతమైన, అసామాన్యమైన దీక్ష ద్వారా దేవతల చేత మరణం పొందకుండునట్లు వరం పొందాడు, కేవలం అహంకారం చేతనే మానవ, జంతువులను విస్మరించాడు.

అపూర్వమైన వరములను పొందిన కారణంగా దేవతలపై దండెత్తి వారిని దారుణంగా హింసించాడు. ఎందరో పర స్త్రీలను చెరబట్టాడు, చివరకు శుర్పణఖ ప్రేరేపించిన కారణంగా మహా సాధ్వి, శ్రీ రామ చంద్రుని పట్టమహిషి అయిన సీతమ్మ తల్లినే కపట వంచనతో సాధువు రూపంలో వచ్చి అపహరించాడు. అధర్మయుతంగా ఇతరుల సంపదలను, స్త్రీలను అనుభవించిన కారణంగానే యుద్ధంలో తన వారినందరినీ పోగొట్టుకొని చివరకు శ్రీ రామచంద్రుని చేతిలో దిక్కు లేని చావు చచ్చాడు. ఎంతటి మహా భక్తుడు ? ధర్మ బద్ధం కాని నడవడిక వలన నాశనమైపోయాడు.

కలిపురుషుడి అంశలో జన్మించి అసమాన్య శూరులైన కౌరవులందరికీ అగ్రజుడైన ధుర్యోధనుడి జీవితం ఒకసారి పరిశీలించండి. అతనికి వున్న సిరి సంపదలు, బల పరాక్రమాలు అనిర్వచనీయం. అయితే అధర్మయుత నడవడికే అతని కొంప ముంచింది కౌరవ వంశాన్ని సమూలంగా నాశనం చెసింది. అసమాన్యమైన వైభవం కలిగిన ఆ రారాజు శకుని పన్నిన కుట్రలో పాల్గొని ధర్మానికి మారుపేరైన పాండవుల సిరి సంపదలన్నింటినీ అపహరించి వారిని అడవుల పాలు జేసాడు. మహా పతివ్రత అయిన ద్రౌపది యొక్క వస్త్రములను నిండు సభలో నలుగురి ఎదుట విప్పించి అతి ఘోరంగా అవమానించాడు.కాని చివరకు ధర్మమే జయించింది. అధర్మంగా సంపదలను, కామమును అనుభవించ యత్నించిన ఆ రారాజు తన వారినందరినీ కురుక్షేత్ర యుద్ధం లో కోల్పోయి దిక్కులేని చావు చచ్చాడు. దాన చక్రవర్తిగా చరిత్ర కెక్కిన కర్ణుడు కూడా అధర్మానికి బాసటగా నిలవడం వలనే అతి దారుణంగా చంపబడ్డాడు.

పై ఉదాహరణలను నిశితంగా పరిశీలిస్తే మనకు ఒక విషయం చాలా సుస్పష్టంగా అర్ధమౌతుంది.మిగితా మూడు అర్ధములైన అర్ధ, కామ మోక్షములు ధర్మయుతమైన నడవడిక ద్వారానే సాధించాలి, లేకపోతే వినాశనం తప్పదు.ధర్మం చాలా గొప్పది. ధర్మోతి రక్షితి రక్షిత: అన్నది ఆర్యోక్తి.ధర్మాన్ని ఆచరిస్తే అది మనలను తప్పక కాపాడుతుంది.ఇందులో కించిత్ సందేహం కూడా లేదు.కనుక మనమందరం కూడా ధర్మ మార్గంలోనే నడిచి ధర్మయుతమైన కోరికలను ధర్మ మార్గంలోనే తీర్చుకుందాం. ధర్మ మార్గంలోనే సంసార సుఖమును అనుభవిద్దాం మరియు ధర్మ మార్గంలోనే అర్ధం అంటే భోగ భాగ్యాలను సంపాదించుదాం , వాటిని ఆనందంతో అనుభవించుదాం.అధర్మ మార్గం చాలా వినాశకారి. మొదట్లో సౌఖ్యంగా వున్నా చివరకు వినాశనం తప్పదు. ధర్మ మార్గం తొలుత కష్టంగా వున్నా చివరకు సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. మానవులను ముక్తికి అర్హులను చేస్తుంది.ఎన్ని యజ్ఞయ యాగాదులు చేసినా, కఠోర తపస్సులు సల్పినా ధర్మబద్ధమైన జీవనం చేయకపోతే అవన్నీ నిష్ప్రయోజనం.ధర్మమునకే అంతిమ విజయం, యుగ యుగాలుగా నిరూపింపబడిన సత్యం.


సర్వే జనా సుఖినోభవంతు
లోకా స్సమస్తా సుఖినోభవంతు

No comments: