Monday, April 7, 2008

సర్వే జనా సుఖినోభవంతు

మానవ జీవితం బహు అమూల్యం
ఎన్నో వేల హీన జన్మలననంతరం మాత్రమే లభించునది
కోట్ల ప్రాణులలో కొన్నింటికీ మాత్రమే దక్కునది
కుసంస్కారాలతో,ధనాశతో,అహంకారం తో
అరిషడ్వర్గాలకు లోబడి హింసాయుత ప్రవృత్తితో
విషయానందాలకు బానిసలమై
మానవతా విలువలను త్రుంగలోకి తొక్కి
సంభంధ భాంధవ్యాలను మరిచిపోయి
పశువుల కంటే జీవించడం శోచనీయం
దీనికి ప్రతిఫలం భవిష్యత్తులో లభించు హీన జన్మలు
సద్గుణాలను అలవర్చుకొని, భక్తి భావం పెంపొందించుకొని
ఉన్నతమైన ఆశయాల సాధనకు ఉపక్రమించి
మనం ఆనందం గా బ్రతుకుతూ
ఇతరులను బ్రతికిస్తూ
మన ఆనందాలను, ఐశ్వర్యాలను వీలైనంతగా
మన తోటి సమాజస్థులకు పంచి ఇస్తూ
సర్వే జనా సుఖినోభవంతు అను రీతిన
బ్రతుకు - బ్రతికించు అన్న సిధాంతాన్ని
త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ, ఆత్మ విశ్వాసం తో
ఆత్మ స్థైర్యం తో , పరిశుద్ధమైన మనసుతో
ముందడుగు వేసిన వారి జీవితం ధన్యం

జీవన విధానం

డబ్బు చుట్టూనే పరిభ్రమిస్తున్న ప్రపంచం
ధనార్జనే ధ్యేయం గా, పరమావధిగా
పశువుల కంటే హీనంగా కష్టిస్తున్న మానవుడు
తద్వారా సంపాదించిన ధనాన్ని అనుభవించేందుకు
సమయం,ఓపిక,ఆరోగ్యం అసలే లేవు
కూడబెట్టిన అస్థులన్నీ దాయాదుల వశం
ఆకలితో అలమటించే అన్నార్తులకు నయాపైసా
దానం చెయ్యలేని గొప్ప దయా హృదయం మనది
డబ్బు, కీర్తి, పదవి కాంక్షలు తలెకెక్కిన మత్తులో
నా అన్నవారినందరినీ దూరం చేసుకొని
ఈ సమాజం లో ఒంటరి జీవనం సాగిస్తున్న మానవుడు
ఖాళీ చేతులతో వచ్చి, తన స్వంతం అనుకున్న వాటిని
విడిచి పెట్టి ఖాళీ చేతులతోనే ఈ ప్రపంచాన్ని
విడిచివెళ్ళాలని తెలియనిది ఎవరికి ?
అయినా వీసమెత్తు దానగుణం ప్రదర్శించలేని
గొప్పవారము మనమందరం
తమ కంటూ వున్న దానిని సమానం గా పంచుకు తింటూ
ఆనందం గా, ఏ చీకూ చింతలు లేక ఆనందమయ
జీవనం సాగించే పశు పక్ష్యాదుల జీవన విధానమే ఎంతో శ్రేష్టం

Sunday, April 6, 2008

అందమైన జీవితం

అరోగ్యకరమైన ఆలోచనా ధోరణి
జీవితం లో విజయం సాధించుటకు
ఆనందమయమైన జీవనం సాగించుటకు అత్యావశ్యకం
అనారోగ్యకర ఆలోచనా విధానం ప్రగతికి చేటు
అశేష శారీరక , మానసిక వ్యాధులకు పుట్టినిల్లు
మానవ జీవితమంతా అశాంతి మయం
నిత్యం చింతలు, సమస్యలు, ఆందోళనలు
హృదయం ఒక మండుతున్న లావా
కటువైన ప్రవర్తనతో మానవ సంభందాలన్నీ దూరం
కృషి, పట్టుదల, తపనలతో పాటు
సానుకూల ఆలోచనా ధృక్పధం తో
నిత్యం ప్రశాంతం గా అరోగ్యకరం గా వుండే మనసుతో
ముందడుగు వేసిన నాడు
అనితర సాధ్యమైన విజయాలన్నీ మనకు స్వంతం
జీవితం ఒక విరబూసిన నందనవనం

విజయ రహస్యం

కాలం, ఖర్మం కలిసి రాలేదంటూ
జాతక చక్రం అనుకూలంగా లేదంటూ
జీవితం లో ప్రగతి సాధించలేకపోవుటకు
నెపాన్ని ఇతరులపై నెట్టేసి
నిమ్మకు నీరెత్తనట్లు హాయిగా
కూర్చునే వారు అధమాధములు
విజయం సాధించుటకు
తగిన మూల రహస్యం,సూత్రం
తమలోనే వున్నదని గ్రహించి
పట్టుదల, దీక్ష తపనలతో
క్రమబద్ధమైన ప్రణాళికతో
ధైర్యే సాహసే లక్ష్మీ అంటూ
ముందుకు సాగిన వారు ఉత్తములు
అనితర సాధ్యమైన విజయాలు వారికే స్వంతం