Sunday, December 14, 2008

కవితలు 5

కరుణామయుడు

కరుణ ,దయ, ప్రేమలకు ప్రతిరూపం మన జీసస్
యావత్ ప్రపంచమంతా నిరాశా,నిస్పృహ, దుఖం, కష్టాల కడలిలో
కొట్టుమిట్టాడుతుండగా బెత్లెహాము నగరం లో
వేకువజామున మెరిసిందొక ధృవతార
జీసస్ నామధేయంతో దిన దిన ప్రవర్ధమానమై
శిష్ట జన సంరక్షణకు స్వయం గా
నడుం కట్టింది ఆ పరమాత్మ స్వరూపం
పాలకులే పాతకులై పాశవికత జూపి
శిలువ నెక్కించగా చిరునవ్వుతో సకల ప్రాణ కోటి కొరకు
తన రక్తం చిందించి అశువులు బాసిన కరుణామయుడు
పాపాత్ములను సైతం పరిశుద్ధులను గావించి
తద్వారా జీవన్ముక్తిని ప్రసాదించిన దేవదేవుడు
వెన్న కంటే మృదువైన మనసుతో
తనను శరణు జొచ్చిన వారిని చివరికంటూ కాపాడిన దయామయుడు
హేళన జేసిన వారిపై లాలన, దూషించిన వారిపై కరుణ
సమాంతరం గా కురిపించిన కరుణామయుడు
ప్రేమ,దయ, కరుణ, సత్యం లకు నిర్వచనం జీసస్ ప్రభువు

దేశ భాషలందు తెలుగు లెస్స !

దేశ భాషలందు తెలుగు లెస్స
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా యావత్
ప్రపంచమంతటా వేన్నోళ్ళ కీర్తింపబడుతున్న గొప్ప భాష
తేనె కంటే తీయనైన కమ్మని భాష
ప్రాచీన హోదా లభ్యం కోట్లాది ఆంధ్రులకు గర్వకారణం
మాతృ భాషాభిమానులలో ఉప్పొంగిన ఆనందం
మమ్మీ డాడీ సంస్కృతికి ఇక పలకాని మనం వీడ్కోలు
భావి తరాలకు కమ్మని తెలుగు
పలుకుల సొగసులను అందించడం మన కర్తవ్యం
పర భాషా వ్యామోహంతో మాతృ భాషకు
దూరం కావడం శోచనీయం
మాతృ భాషను నిర్లక్ష్యం చేయడం
కన్న తల్లిని అగౌరవపరచడం తో సమానం
ప్రాచీన భాష హోదాతో మన భాషా సంస్కృతులను
పరిరక్షించి కమ్మని తెలుగు భాషపు
పరిమళ సుగంధాలను దిగంతాలకు వ్యాపింపజేయడం
తెలుగు భాష వికాసం, వ్యాప్తిలకు కృషి సల్పడం
తెలుగు వారిగా మన ప్రధమ కర్తవ్యం
తెలుగు తల్లికి జై
తెలుగు తల్లి ఒడిలో సేద తీరడం
ఒక అనిర్వచనీయమైన అనుభూతి
అన్ని భాషలలోన ఎన్నదగిన సాహితీ శిఖరం తెలుగు

అభినందనల మందారం

ఎన్నో వేల జన్మల పుణ్య ఫలం
ఫలితం మనకు లభించిన మానవ జన్మ
సకల జీవ ప్రాణులన్నింటిలో కెల్లా
మానవులకు మాత్రమే లభించిన అపురూప వరం వాక్కు
మనస్సులోని ఉద్వాగాలను,భావాలను
అద్భుతం గా వెల్లడించగల శక్తి "మాట"
అందమైన భాష మాటకు ఆలంబన
మదిలో మెదిలే ఆలోచనలకు వస్త్రాలంకారం
అభినందనలు తెల్పుటు మన భాషను
సద్వినియోగపరచుటకు బహు చక్కని అవకాశం
ఎదుటి వారి మంచితనం , సహృదయత,సుగుణాలు
ఒనరించిన మహోపకారములకు
మనస్పూర్తిగా మెచ్చుకొనుటయే అభినందన
అభినందనలు తెల్పుట మన సంస్కారానికి
విశాల హృదయానికి ఒక గీటురాయి
ఎదుటివారిని అభినందించడం వలననే
మనకు అభినందింపబడడమనే అర్హత లభ్యం
ఈర్ష్యానుద్వేషాలు,మద మాత్సర్యాలు తొలగిపోయి
సర్వ మానవ సౌభృతృత్వం , సర్వ జీవ సమానత్వం
కలిగి వసుదైక కుటుంబం స్థాపనకు నాంది
సమ దృష్టి, సమ భావం సహృదయత్వం కలిగి
మనస్సు స్పటికం వలే స్వచ్చం పవిత్రమగును
మానవ జన్మకు లభించును సార్ధకత

No comments: