Thursday, June 26, 2008

కవితలు - 4

నిష్కృతి లేని పాపములు

కష్టాల కల్లోలం చుట్టుముట్టినప్పుడు
భగవంతుడు జ్ఞప్తికి వచ్చుట తీవ్రమైన వేదనతో
కష్ట నష్టములను దూరమొనర్చమని
కోరికల మూటతో ప్రార్ధన గావించడం,
అనంతరం భగవంతుడిని మరచుట మానవ నైజం
సుఖముల పానుపుపై తేలియాడే సమయమందు
భగవంతుడిని జ్ఞప్తికి చేసుకోవడం బహు అరుదైన విషయం
స్వార్ధపు చింతనతో కోర్కెల మూటతో చేయు
ప్రార్ధనలు ఆ సర్వేశ్వరుడిని చేరలేవు
చిత్త శుద్ధి లేని శివ పూజ ఫలించదు
భగవంతుడిని కష్ట నష్టములను తీర్చెడి
యంత్రము వలే భావించే నేటి తరం మానవునికి
భక్తి, ముక్తి, మోక్షం అసాధ్యం
అనుక్షణం భగవంతుడిని జ్ఞప్తికి తెచ్చుకొని
ఆయన అనుగ్రహ ఫలం వర్షించని క్షణం
వ్యర్ధమని తలుస్తూ కష్ట సుఖములను
ఆయన పవిత్ర ప్రసాదము గా భావించి
ఆనందం గా యధాతధముగా స్వీకరించడమే
నిస్వార్ధ , నిష్కల్మష భక్తుల తత్వం
రక్తి, విరక్తి అను నవి భక్తికి కారణములే
సుఖములలో మునిగి భగవంతుడిని విస్మరించుట ,
కష్టములు ఎదురైనప్పుడు నిందించుట కూడని పనులు,
ఈ పాపములకెన్నడూ నిష్కృతి లేదు

పించనుదారుల వెతలు

జీవితమంత అంకిత భావం తో
పని చేసినందుకు పదవీ విరమణానంతరం
ఇచ్చెడి గౌరవ భృత్యం పించన్లు
చాలీ చాలని భృత్యాలను అందుకునే
పించనుదారులంతే అందరికీ అగౌరవమే
జీవితాన్ని నెట్టుకురాలేక వారి వెతలు వర్ణనాతీతం
నింగికి ఎగిసే ధరలు, ముంచుకొస్తున్న వ్యార్ధకం
రోజురోజుకూ క్షీణించే ఆరోగ్యం
అయినా వారి కందించే భృత్యం అంతంత మాత్రం
సజీవులై వున్నామని నిరూపించుకోమని
రోజు కొక తల తిక్క నిబంధనలు
చేతులు తడపనిదే కదలని కాగితాలు
ప్రభుత్వాలు మారినా కించితైనా మారని వారి జీవన గతి

ఆత్మ తత్వం


ఏకమైవా ద్వైతం బ్రహ్మ అన్నది ఆర్యోక్తి
ఈ సృష్టి అంతటా నిండి వున్న పర బ్రహ్మం ఒక్కటే
అజ్ఞానం వలన అనేకమైనట్లు గోచరించును
సాధన సమయం లో ద్వైత భావనను అనుభవించు సాధకుడు
సద్గురువు కృప వలన ఆత్మ సాక్షాత్కారమును పొంది
హృదయం లో అజ్ఞానపు చీకట్లు తొలిగి
జ్ఞాన జ్యోతి ప్రకాశించినప్పుడు ద్వైత భావన నిష్క్రమించి
అద్వైతం అనుభవమగును,
సాధకుడు ముముక్షువగును
బ్రహ్మానంద భరితమైన ఆత్మ తత్వం
తన నిజస్వరూపమన్న సత్యం అవగతం
అదే ఆత్మ పరమాత్మల సంగమం

తెలుగు భాష వైభవం

తేనె కన్నా తీయనిది తెలుగు భాష
తెలుగు మాధుర్యం , గొప్పదనం వర్ణనాతీతం
తెలుగు భాషా పరిమళం, సుగంద భరితం
ప్రపంచీకరణ నేపధ్యం లో పరభాషలపై పెరిగిన మోజు
తెలుగు భాషకు అంతట నిరాదరణ
తెలుగు సాహిత్యం చదివే వారే కరువు
తెలుగు మాధ్యమ బోధన నానాటికీ అంతరార్ధం
మమ్మీ డాడీ సంబోధనలు కుటుంబాలలో కూడా
తెలుగును తరిమేసి ఆంగ్లేయమయం చేసాయి
అధికార భాషగా అమలులో పాలకుల నిర్లక్ష్యం
ప్రతీ ఎటా మొక్కుబడి కార్యక్రమాలు, సదస్సులు
తీర్మానాలు , ఫొటోలతో హంగామా
మాతృభాషను చిన్నచూపు చూడడం
కన్న తల్లిని అవమానించినంత పాపం
అందుకే నానాటికీ కళను కోల్పోతున్న
తెలుగు భాషకు జీవం పోసేందుకు
తెలుగు బిడ్డలందరం నడుం కడదాం
తెలుగు భాషకు ప్రాచీన వైభవాన్ని పునరుజ్జీవజింపజేద్దాం

No comments: