Friday, June 6, 2008

కవితలు 1

సత్కీర్తి

జీవితానికొక గమ్యం, లక్ష్యం అత్యావశ్యకం
ఆ లక్ష్య సాధనకు నిర్ధుష్ట్యమైన ప్రణాళిక
శక్తి సామర్ధ్యాలను కూడ గట్టుకొని
కష్టాలకు,సమస్యలకు చెదరక
చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం తో
కార్య సాధనే ధ్యేయం గా ఏకోన్ముఖం గా
ముందుకు సాగితే అనితర సాధ్యమైన
కార్యములను సాధించుట సాధ్యం
జీవన గమనం లో నిర్దేశించిన కార్యములను
అంకిత భావం తో నిర్వర్తించవలెను
కృషితో నాస్తి దుర్భిక్షం.
చంచలత్వం, సోమరితనం, అలసత్వం
నిర్లక్ష్యం ఇత్యాది దుర్గుణముల వలన
మనిషి జీవితం అధ:మ పాతాళానికి క్రుంగిపోవును
చరిత్రలో చిర స్థాయిగా నిలిచి పోయే సత్కర్మలను
మనము ఒనరించుట అత్యావశ్యకం

సత్వ గుణం

త్రిగుణాల కలయికే ఈ ప్రపంచం
రజో, తమ గుణములు మనిషి వివేకాన్ని హరించి
అసురీ లక్షణములను వృద్ధి చేయును
సత్వ గుణం గల్గిన మానవుడు దేవునికి ప్రీతికరం
ఉత్తముల సాంగత్యం, సద్గ్రంధ పఠనం,
భగవత్ ధ్యానం, నామ సంకీర్తన, పూజ, జపం
ఇత్యాది మార్గములెన్నో శాస్త్రములో మనకు లభ్యం
తీవ్రమైన తపనతో, సాధనతో
రజ, తమో గుణములను తగ్గించుకుంటూ
భగవత్స్వరూపమైన సత్వ గుణమును
పెంపొందించుకుంటూ సన్మార్గ వర్తనుడై
చరించడం ఎంతో శ్రేయస్కరం

ఆత్మ విమర్శ

ఆత్మ విమర్శ ప్రతి మానవుడు అలవర్చుకోవల్సిన సద్గుణం
తన లోని దోషాలను దర్శించుకొని
వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం
చిత్త శుద్ధితో ఒనరించడం అత్యావశ్యకం
ఆత్మ విమర్శ వలన ఇతరులను విమర్శించుట
వారి యందు దుర్గుణాలను చూచి
అనుచిత మైన వ్యాఖ్యలను చేయుట
ఇతాది అవలక్షణములు నశించిపోవును
హృదయం పరిశుద్ధం అగును
సర్వ వ్యాపకత, సర్వ జీవ సమానత్వం
అనుభవించుట సాధ్యమగును
అహంకారాది దోషాలు నశించి
మానవీయ స్వభావం పెంపొందును
పూర్ణ దైవత్వ సిద్ధి సాధ్యం
తన దినచర్యలో భాగం గా
ప్రార్ధనతో సహితం గా
ఆత్మ విమర్శ విధిగా చేయు
మహాత్ముని జీవన విధానం మనకు ఆదర్శం

No comments: