Sunday, May 18, 2008

సగటు మానవుడు

మ్రోగింది ఉప ఎన్నికల నగారా
ఎ సి రూముల నుండి బయట కొచ్చిన నేతలు
వివిధ రాజకీయ పక్షాలు ఆరంభించాయి బురద జల్లుకోవడం
ఒకరిపై మరొకరి మాటల తూటాలు
పేదవాడిపై నేతలలో హఠాత్తుగా ఉప్పొంగిన అభిమానం
చాలీ చాలని జీతాలతో కడుపు నింపని పనులతో
రోగ గ్రస్థమైన శరీరాలతో దుర్భరమైన
జీవితం గడుపుతున్న పేదవాడు అందరికీ
మరొక్కసారి గుర్తుకొచ్చాడు,అయ్యాడు ఓటరు దేముడు
ఘరానా నేతల నుండి అందుకుంటున్నాడు దండాలు
భగీరధ వాగ్దానాలు కురుస్తున్నాయి అతనిపై
సిద్ధాంతాలు పొసగకపోయినా చేతులు కలిపి
అనైతిక పొత్తులతో, రాత్రికి రాత్రే స్నేహం కలిపి
బద్ధ శత్రువులు కలిసి వచ్చిన వైనాన్ని
అతి చోద్యం గా చూస్తున్నాడు
అయినా మనసులో ఏ మూలో ఈ బ్రతుకులు మారవన్న
గట్టి నమ్మకం బలపడి పోయింది
తన ఓటుతో గద్దె నెక్కి తనపై స్వారీ చేసే
ఈ నేతలపై రవ్వంత విశ్వాసం కూడా లేదు
ఎన్నికలయ్యాక షరా మామూలే నేతలందరూ అంతర్ధానం
పల్లెలో సందడి మటుమాయం
తన జీవిత పోరాటం యధావిధిగా సాగుతుంది
ఈ భారతావనిలో సగటు మానవుని బ్రతుకు ఇంతే

No comments: