Sunday, May 18, 2008

ఆదర్శ పాలకులు

ప్రజలను పాలకులు బహు చక్కగా పాలించిన
దేశం సుభిక్షమౌతుందన్న భర్తృహరి
సుభాషితం మనకు ఆదర్శం
సనాతన పాలక ధర్మాలకు త్రిలోదకాలనిస్తూ
పదవి కోసం అనుక్షణం తపిస్తూ, తపన పడుతూ
పదవి నలంకరించిన అనంతరం
ప్రజా సంక్షేమాన్ని విస్మరించే
నేటి పాలకుల వైఖరి శోచనీయం
పదవి శాశ్వతం కాదు, ప్రజాహిత
కార్యక్రమముల ద్వారా అందరి
జీవితములలో వెలుగు నింపి తద్వారా
సాధించు సత్కీర్తియే శాశ్వతమన్న సత్యాన్ని విస్మరించిన
మన నేతాశ్రీలలో ఎన్నడు కలిగేను జ్ఞానోదయం ?
అధర్మం గా పెంచుకున్న ఆస్తులు అంతస్తులు
ఏనాటికైనా మంచు గడ్డ వలె తరిగిపోవడం తధ్యం
మంచి పాలకునిగా ఆర్జించుకున్న ఖ్యాతియే
ఆకాశం లో నక్షత్రాల వలే శాశ్వతం
అనుక్షణం పదవిని అంటిపెట్టుకొని వుండుటకు
అడ్డదారులు తొక్కే ప్రజా కంటకులకు
ఏనాటికైనా తప్పదు చీత్కారం
ఉన్నత పదవులను అధిష్టించే నేతలకు
కావాలి ఆదర్శమయ జీవన విధానం
ప్రజా సేవయే వారి పరమార్ధం కావాలి
ప్రజల కోసం అనుక్షణం తపించు వారు
సామ్రాట్ అశోకుని వలే చిరస్మరణీయులు
దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన
టంగుటూరి,పొట్టి శ్రీరాములు, మహాత్ముడు
వారికి కావాలి స్పూర్తి దాయకం
వారి అడుగు జాడలలో నడవడమే నేతల కర్తవ్యం

No comments: