Wednesday, July 15, 2009

వినయ విధేయతలే శ్రేయోదాయకం

వినయ విధేయతలే శ్రేయోదాయకం

మానవాళిని నేడు పట్టి పీడిస్తున్న దుర్గుణ భూతములలో అత్యంత ముఖ్యమైనది గర్వాహంకారములు. నేడు మానవాళికి ఎన్నడూ లభించని విధం గా భోగ భాగ్యాలు, సుఖ సౌఖ్యాలు లభిస్తున్నాయి. మొత్తం ప్రపంచాన్ని గురించి తెలుపగలిగే కంఫ్యూటర్లు వచ్చాయి. ధనార్జన విపరీతం గా పెరిగింది. జీవితం విలాసవంతం అయ్యింది. వాటితో పాటుగా గర్వాహంకారములు కూడా కొండంత పెరిగాయి. గోరంత తెలిసి వున్నా కొందంత తెలిసిందని విర్ర వీగడం, ఎదుటి వారిని చులకన చేసి మాట్లాడడం, అసభ్య, పరుష పదజాలం తో దూషించడం సర్వ సాధారణమైపోయింది. నేటి మానవాళిలో వినయ, విధేయతలు , వినమ్రత మచ్చుకైనా కానరావడం లేదు.


మనిషికి గర్వం ఎప్పుడూ పనికి రాదు. అణుకువ లోనే అందం వుంది. భగవంతుడు మెచ్చని దుర్గుణం గర్వం. కొందరు పరిస్థితులను గమనించక అన్ని వేళలా గర్వాహంకారములతో మిడిసిపడుతుంటారు. అందరినీ ఎదిరించగలమని దర్పాన్ని ప్రదర్శిస్తుంటారు. శత్రువులు బలం గా వున్నప్పుడు తనను తాను తగ్గించుకొని , తదనంతరం తలెత్తుకు తిరగడం వివేకపూరితమైన చర్య. జీవితం లో ఎదుతయ్యే కష్ట నష్టములు కూడా మనకు శత్రువులే.

ఈ సంధర్భం లో ఒక కధను స్మరించుకుందాం.

ఒక సారి సముద్రుడు తన భార్యలను పిలిచి “ నదులన్నీ తమ ప్రవాహం లో అడ్డుగా వున్న పెద్ద పెద్ద వృక్షాలను, బండలను దుంగలను ఒక ఉదుట్టున పెకిలించి తమతో పాటు తీసుకుపోతున్నాయి. కాని తమ ఒడ్డున వున్న అత్యంత అల్పమైన గడ్డి మొక్కను పెకిలించలేకపోతున్నాయి. ఎన్ని వరదలు వచ్చినా , నదులెంత ఉధృతం గా ప్రవహించినా గడ్డి మొక్క మాత్రం సుఖ జీవనం సాగించగలుగుతోంది. కారణం ఏమిటి ? "అని అడుగగా , సముద్రుని భార్య అయిన గంగాదేవి ముందుకు వచ్చి మిక్కిలి వినయ విధేయతలతో “ స్వామీ ! తాము ఉధృతం గా ప్రవహిస్తున్నప్పుడు మార్గం లో అడ్డుగా వుండే వృక్షాలను , బండ రాళ్ళను అవలీలగా పెకిలించి వేయడానికి కారణం ఆ వృక్షాలు, బండలు నదీ ప్రవాహాన్ని ఎదిరించ యత్నించడమే. అదే ఒడ్డున వుండే గడ్డి మొక్క ప్రవాహం వచ్చినప్పుడు అణిగి వుంటుంది. ఉధృతం తగ్గాక తిరిగి తలెత్తుకు నిలబడుతుంది. ఆ గడ్డి మొక్క యొక్క సమయోచిత ప్రవర్తనే దానిని అన్ని ఉపద్రవాలకు ఎదురు నిలవగలిగే శక్తిని ఇస్తోంది.” ఆని వివరించింది.

ఈ కధ మానవులకు అణుకువ, విధేయతల ఆవశ్యకత గూర్చి అద్భుతం గా తెలియజేస్తోంది. కష్ట నష్టాలు, ఆందోళనలు ప్రతీ వారి జీవితం లో తప్పని సరి. చీకటి వెనుకే వెలుగు, రాత్రి వెనుకే పగలు వలె కష్టం తర్వాత సుఖం రావడం తప్పని సరి. కష్టాలు వచ్చినప్పుడు గర్వాహంకారములతో ప్రవర్తించరాదు. ఆ కష్టాలను ఎదిరించి నిలనగలిగే శక్తి వున్న వారి విషయం వేరు. వాటిని ఎదిరించి, ఎదురెడ్డి నిలువలేని వారు తమ శక్తి సామర్ధ్యాలను గ్రహించుకొని, గర్వాహంకారాలను విడిచి పెట్టి, అణిగి మణిగి వుండగలిగితే ఎలా వచ్చిన కష్టం అలానే పోతుంది. తిరిగి జీవితం లో ఆనంద పరిమళాలు విరబూస్తాయి. అట్లా కాక తగినంత శక్తి సామర్ధ్యాలు లేకపోయినా కష్టాలకు, ప్రతికూల పరిస్థితులలో ఎదురు నిలిచితే వినాశనం ఖాయం.

ధుర్యోధనుడికి పాందవులను ఎదిరించగల శక్తి సామర్ధ్యాలు లేవు.అయినా గర్వాహంకారాల వలనే వారితో ఏరి కోరి శత్రుత్వం తెచ్చుకొని చివరకు దుర్భరమైన మరణం పొందాడు. రావణాసురునికి శ్రీ రాముని ఎదిరించగల శక్తి లవలేశమైనా లేదు. సీతాపహరణం గావించి, ఎందరు హితవు చెప్పినా పెడచెవిన పెట్టి, సీతను రామునికి అప్పగించక, ఏరి కోరి విరోధాన్ని తెచ్చుకొని , యుద్ధం లో బంధు మిత్ర, సపరివారాన్ని మొత్తం పోగొట్టుకొని చివరకు హతం అయ్యాడు. ఎదుటివారి గొప్పదనాన్ని తెలుసుకోకుండా అయిన దానికి, కానిదానికి అహంకారం తో విర్రవీగడం, ప్రతీవారు తన కంటే అల్పులని భావించి మిడిసిపడడం వినాశన కారి అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. వినయ విధేయతలు మనిషికి అందానిచ్చే ఆభరణాలు. అందుకే ఏమీలేని తాటాకు ఎగిరెగిరి పడ్తుంది, అన్నీ వడ్డించిన అరిటాకు అణిగి మణిగి వుంటుందని మన పెద్దలు చెబుతూ వుంటారు.

సర్వం శ్రీ శిరిడి సాయినాధార్పణ మస్తు

No comments: