Saturday, July 18, 2009

మోక్ష సాధనే ధ్యేయం

వేదాలలో నిర్వచించబడిన ధర్మార్ధ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్ధాలలో మోక్షానికే అత్యంత విలువ వుంది.అందుకే సనాతన మహర్షులు అనునిత్యం జపం, తపస్సు ఇత్యాది కార్యక్రమాలలో మునిగి మోక్ష సాధనే అంతిమ ధేయం గా కృషి చేస్తుంటారు. మోక్షం పొందడం అంటే ఈ జనన,మరణ చక్ర భ్రమణం నుండి విడిపడి ఆ భగవంతుని పాదాలకు చేరుకోవడమే ! ఆ భగవంతుని సన్నిధి లోనే శాశ్వత ఆనందం వుంది. అక్కడ ఎటువంటి చీకు, చింత, ప్రయాసలు, ఆందోళనలు, కష్ట సుఖాలు వుండవు. ఏదో సాధించాలన్న తపన, కోరికల చింతన అసలే మాత్రం వుండవు. ఉన్నదంతా ఆనందమే ! భగవంతుని సన్నిధిలో వున్నది శుద్ధ, ఘన చైతన్య స్వరూపం, నిత్యం,సత్యం అయిన ఆనందం మాత్రమే ! అయితే మోక్ష సాధన అనుకున్నంత సులభం కాదు. ఎన్నో జన్మలలో ముముక్షువు వలే తీవ్రమైన సాధన చేస్తే గాని సాధ్యం కాదు.

ఈ కలియుగం లో మాయా ప్రభావం లో పడి మానవుడు ఇంద్రియ లాలసుడు అయ్యాడు. అశాశ్వతమైన భోగ భాగ్యాల వెంట అవిశ్రాంతం గా పరుగులు తీయడం, అరిషడ్వర్గాలకు లోబడిపోయి తన నిజమైన ఉనికిని మర్చిపోయి పశువుల వలె ప్రవర్తించడం చేస్తున్నాడు. తత్ఫలితం గా అశాంతికి, అలజడులకు లోనవుతున్నాడు. సంతృప్తి అనేది లవలేశమైనా కానరావడం లేదు. భగవంతుని తోనే క్రయ విక్రయాలను ప్రారంభించాడు.దేవాలయానికి వెళ్ళడం అంటే కోరికల మూటతో వెళ్ళి యాంత్రికం గా ప్రార్ధనలు చేయడం గా మారింది. భూత దయ,సర్వ జీవ సమానత్వం, సర్వ మానవ సౌభ్రాతృత్వం అనేవి మచ్చుకైనా కానరావడం లేదు.జీవితమనే రంగ స్థలం పై వివిధ కాలాలలో విభిన్న పాత్రలను పోషించమని తద్వారా మోక్ష సాధనకు కృషి చేయమని భగవంతుడు అతి విలువైన ఈ మానవ జన్మను మనకు ప్రసాదిస్తే అవసరానికి మించినటించి పాపాలను మూట కట్టుకుంటున్నాడు. వాటిని ఇక్కడే అనుభవించి దు:ఖానికి లోనవుతున్నాడు. తిరిగి మరొక జన్మకు పునాది వేసుకుంటున్నాడు. చేసిన చిన్న మంచి పనికి ఆ జగన్నాటక సూత్రధారి నుండి గొప్ప బహుమానం రావాలని కోరుకోవడం మరొక వింత.ప్రతీ జన్మలో పాప, పుణ్యాల బ్యాలెన్స్ షీట్ లో పాపాలే చివరకు ఎక్కువగా మిగలడం, వాటిని అనుభవించేందుకు తిరిగి మరొక జన్మ ఎత్తి అందులోనూ క్రితం జన్మ యొక్క పాపాన్ని అనుభవిస్తునే మరిన్ని పాపలను ప్రోగు చేసుకోవడం - ఆ నికర పాపమంతా తిరిగి ఇంకొక జన్మకు బదిలీ కావడం - ఇలా చూస్తే మానవ జన్మలన్నీ చివరకు అనుభవించవల్సిన పాపలతోనే మిగిలి వుంటాయి. ఇక మోక్షం లభించేది ఎప్పుడు ?

కర్మ సిద్ధాంతం ఎంతో శక్తివంతమైనది.చేసిన కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. నాటిన విత్తనల పంటే మనం తినాల్సి వస్తుంది. మోసం చేస్తే మోసగించబడక తప్పదు.అధర్మం గా సంపాదించిన ప్రతీ పైసాను తిరిగి కక్కవలసిందే !అందుకే ఈ క్షణం నుందే మన ఆలోచనా విధానం మారాలి .మోక్షం పొందడమే మన ఏకైక లక్ష్యం కావాలి. నిత్యం భగవన్నామస్మరణ, జపం, తపస్సు, ధ్యానం, యోగాభ్యాసం, మృదుభాషణం, సద్గంధ పఠనం, సత్సంగం లో పాల్గొనుట, సాత్విక ఆహార స్వీకరణ, కోరికల ఉధృతిని తగ్గించుకొనుట, అనిత్యమైన భోగ భాగ్యల పట్ల ఆసక్తి తగ్గించుకొని శాశ్వతమైన పుణ్య సముపార్జన కోసం కృషి చేయడం,సాధు సత్పురుషుల దర్శనం,సజ్జన సాంగత్యం, భూత దయ పెంపొందించుకొనుట,శక్తికి మేర ధాన ధర్మములనాచరించడం,ఇత్యాది మంచి కార్యాలను చేపట్టాలి. జగత్తనే ఈ నాటక రంగం లో నటించి అలసి సొలసి పోయాను.ఇకనైనా కైవల్యం ప్రసాదించు స్వామీ అన్నదే మన నిత్య ప్రార్ధన కావాలి.నీ పాదాల చెంతనే నాకు లభించును ఆనందం. అనుక్షణం నీ పద సేవలోనే వుండి నన్ను తరించనీయవయ్యా స్వామీ ! అని ప్రార్ధిస్తూ, ఓర్పు, సహనం తో వేచి వుంటే కరుణామయుడు,దయాపూరిత హృదయుడు, అయిన ఆ స్వామి తప్పక కరుణిస్తాడు. పంజరం లో బంధించిన చిలుకను స్వేచ్చా లోకానికి వదిలిపెడితే ఏ విధమైన ఆనందం అనుభవిస్తుందో , శరీరం లో బంధించిన ఈ ఆత్మకు మోక్షం పేరిట విముక్తి లభిస్తే ఎల్లలు లేని ఆనందాన్ని అనుభవించి , ఆ భగవంతుని పాదాల చెంత వాలుతుంది.

సర్వం శ్రీ శిరిడీ సాయినాధార్పణ మస్తు

No comments: