Monday, October 5, 2009

హాస్యవల్లరి-1

1.“నర్సమ్మా ! పోస్ట్ మార్టం లో ప్రాక్టికల్స్ కోసం నాలుగు బాడీలను రేపు పన్నెండింటి కల్లా సప్లయి చేస్తామని ఆ మెడికల్ కాలేజీ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పు” అన్నాడు డాక్టర్ దైవాధీనం

“అదెలా సాధ్యం సార్ ?” అడిగింది నర్స్.

“ రేపు ఉదయం మనకు నాలుగు ఆపరేషన్లు వున్నాయి కదా ! మధ్యాహ్నం కల్లా ఆ బాడీలను వాళ్ళకు ఇచ్చెయ్యవచ్చు” అసలు సంగతి చెప్పాడు డాక్టర్.


2." ఆడవాళ్ళ దగ్గర ఆచి తూచి మాట్లాడాలిరా !"


“ ఏమయ్యింది ?”


“ ఆ మధ్య కోపంలో నువ్వు చాలా అందంగా వుంటావని మా ఆవిడతో జోక్ చేసా! అప్పటి నుండి ఇరవై నాలుగు గంటలూ కోపంగా వుంటోంది. ఆ ముఖం చూడలేక చస్తున్నా”

3." ఈ సబ్బు వాడితే మురికి పోయి శుభ్రం గా అవుతుందని చెప్పావు. ఎంత అరగదీసినా ఈ షర్టు కున్న మురికి పోలేదు చూడు” కోపంగా షర్టును విసిరి కొట్టి అరిచాడు సుబ్బారావు.


“ ఎక్కువగా అరవకండి సార్ బి పి పెరిగి పోగలదు. నేనన్నది మీరు సరిగ్గా అర్ధం చేసుకోలేదు ! మురికి షర్టుకు పోతుందని ఎప్పుడు చెప్పాను ? ఈ సబ్బును చూడండి, ఎలా తళ తళ లాడుతుందో ?” తాపీగా అసలు సంగతి చెప్పాడు షాపు వాడు.

4.“ఏమిట్రా వాంతులకు విరేచనాలకు అన్నేసి బిళ్ళలు కొనుక్కెళుతున్నావు ? ఇంట్లో ఎవరికి ఏమయ్యింది ? అడిగాడు వెంకట్రావు.


“ ఎవరికీ ఏమీ అవకూడదనే వీటిని తీసుకెళ్ళుతున్నాను. నిన్నటి నుండి మా ఆవిడ కవితలు రాసి మాకు వినిపించడం మొదలెట్టింది. కాస్త ముందు జాగ్రత్త అవసరం కదా” అసలు సంగతి వివరించాడు నాగేశ్వరరావు.


5.“ డాక్టరు గారు. ఒళ్ళంతా నొప్పులుగా వుంది, అప్పాయింట్ మెంటు తీసుకోలేదు, కాస్త పరీక్ష చెయ్యరా ?” అందరినీ తోసుకొని గదిలోకి వచ్చి అడిగింది ఇరవై ఏళ్ళ రేఖ.


“ ఓకె, కాస్త బట్టలు వదులు చేసి ఆ టేబిల్ మీద పడుకొండి” చెప్పాడు విజయ్ రేఖ అందాన్ని కళ్ళతోనే జుర్రుకుంటూ.


“ నొప్పులు నాకు కాదు సార్, మా అమ్మగారికి”


“ సారి. ఇప్పుడు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం కుదరదు. సాయంత్రం తీసుకు రండి” చికాకుగా అన్నాడు విజయ్.

No comments: