Saturday, July 18, 2009

మోక్ష సాధనే ధ్యేయం

వేదాలలో నిర్వచించబడిన ధర్మార్ధ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్ధాలలో మోక్షానికే అత్యంత విలువ వుంది.అందుకే సనాతన మహర్షులు అనునిత్యం జపం, తపస్సు ఇత్యాది కార్యక్రమాలలో మునిగి మోక్ష సాధనే అంతిమ ధేయం గా కృషి చేస్తుంటారు. మోక్షం పొందడం అంటే ఈ జనన,మరణ చక్ర భ్రమణం నుండి విడిపడి ఆ భగవంతుని పాదాలకు చేరుకోవడమే ! ఆ భగవంతుని సన్నిధి లోనే శాశ్వత ఆనందం వుంది. అక్కడ ఎటువంటి చీకు, చింత, ప్రయాసలు, ఆందోళనలు, కష్ట సుఖాలు వుండవు. ఏదో సాధించాలన్న తపన, కోరికల చింతన అసలే మాత్రం వుండవు. ఉన్నదంతా ఆనందమే ! భగవంతుని సన్నిధిలో వున్నది శుద్ధ, ఘన చైతన్య స్వరూపం, నిత్యం,సత్యం అయిన ఆనందం మాత్రమే ! అయితే మోక్ష సాధన అనుకున్నంత సులభం కాదు. ఎన్నో జన్మలలో ముముక్షువు వలే తీవ్రమైన సాధన చేస్తే గాని సాధ్యం కాదు.

ఈ కలియుగం లో మాయా ప్రభావం లో పడి మానవుడు ఇంద్రియ లాలసుడు అయ్యాడు. అశాశ్వతమైన భోగ భాగ్యాల వెంట అవిశ్రాంతం గా పరుగులు తీయడం, అరిషడ్వర్గాలకు లోబడిపోయి తన నిజమైన ఉనికిని మర్చిపోయి పశువుల వలె ప్రవర్తించడం చేస్తున్నాడు. తత్ఫలితం గా అశాంతికి, అలజడులకు లోనవుతున్నాడు. సంతృప్తి అనేది లవలేశమైనా కానరావడం లేదు. భగవంతుని తోనే క్రయ విక్రయాలను ప్రారంభించాడు.దేవాలయానికి వెళ్ళడం అంటే కోరికల మూటతో వెళ్ళి యాంత్రికం గా ప్రార్ధనలు చేయడం గా మారింది. భూత దయ,సర్వ జీవ సమానత్వం, సర్వ మానవ సౌభ్రాతృత్వం అనేవి మచ్చుకైనా కానరావడం లేదు.జీవితమనే రంగ స్థలం పై వివిధ కాలాలలో విభిన్న పాత్రలను పోషించమని తద్వారా మోక్ష సాధనకు కృషి చేయమని భగవంతుడు అతి విలువైన ఈ మానవ జన్మను మనకు ప్రసాదిస్తే అవసరానికి మించినటించి పాపాలను మూట కట్టుకుంటున్నాడు. వాటిని ఇక్కడే అనుభవించి దు:ఖానికి లోనవుతున్నాడు. తిరిగి మరొక జన్మకు పునాది వేసుకుంటున్నాడు. చేసిన చిన్న మంచి పనికి ఆ జగన్నాటక సూత్రధారి నుండి గొప్ప బహుమానం రావాలని కోరుకోవడం మరొక వింత.ప్రతీ జన్మలో పాప, పుణ్యాల బ్యాలెన్స్ షీట్ లో పాపాలే చివరకు ఎక్కువగా మిగలడం, వాటిని అనుభవించేందుకు తిరిగి మరొక జన్మ ఎత్తి అందులోనూ క్రితం జన్మ యొక్క పాపాన్ని అనుభవిస్తునే మరిన్ని పాపలను ప్రోగు చేసుకోవడం - ఆ నికర పాపమంతా తిరిగి ఇంకొక జన్మకు బదిలీ కావడం - ఇలా చూస్తే మానవ జన్మలన్నీ చివరకు అనుభవించవల్సిన పాపలతోనే మిగిలి వుంటాయి. ఇక మోక్షం లభించేది ఎప్పుడు ?

కర్మ సిద్ధాంతం ఎంతో శక్తివంతమైనది.చేసిన కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. నాటిన విత్తనల పంటే మనం తినాల్సి వస్తుంది. మోసం చేస్తే మోసగించబడక తప్పదు.అధర్మం గా సంపాదించిన ప్రతీ పైసాను తిరిగి కక్కవలసిందే !అందుకే ఈ క్షణం నుందే మన ఆలోచనా విధానం మారాలి .మోక్షం పొందడమే మన ఏకైక లక్ష్యం కావాలి. నిత్యం భగవన్నామస్మరణ, జపం, తపస్సు, ధ్యానం, యోగాభ్యాసం, మృదుభాషణం, సద్గంధ పఠనం, సత్సంగం లో పాల్గొనుట, సాత్విక ఆహార స్వీకరణ, కోరికల ఉధృతిని తగ్గించుకొనుట, అనిత్యమైన భోగ భాగ్యల పట్ల ఆసక్తి తగ్గించుకొని శాశ్వతమైన పుణ్య సముపార్జన కోసం కృషి చేయడం,సాధు సత్పురుషుల దర్శనం,సజ్జన సాంగత్యం, భూత దయ పెంపొందించుకొనుట,శక్తికి మేర ధాన ధర్మములనాచరించడం,ఇత్యాది మంచి కార్యాలను చేపట్టాలి. జగత్తనే ఈ నాటక రంగం లో నటించి అలసి సొలసి పోయాను.ఇకనైనా కైవల్యం ప్రసాదించు స్వామీ అన్నదే మన నిత్య ప్రార్ధన కావాలి.నీ పాదాల చెంతనే నాకు లభించును ఆనందం. అనుక్షణం నీ పద సేవలోనే వుండి నన్ను తరించనీయవయ్యా స్వామీ ! అని ప్రార్ధిస్తూ, ఓర్పు, సహనం తో వేచి వుంటే కరుణామయుడు,దయాపూరిత హృదయుడు, అయిన ఆ స్వామి తప్పక కరుణిస్తాడు. పంజరం లో బంధించిన చిలుకను స్వేచ్చా లోకానికి వదిలిపెడితే ఏ విధమైన ఆనందం అనుభవిస్తుందో , శరీరం లో బంధించిన ఈ ఆత్మకు మోక్షం పేరిట విముక్తి లభిస్తే ఎల్లలు లేని ఆనందాన్ని అనుభవించి , ఆ భగవంతుని పాదాల చెంత వాలుతుంది.

సర్వం శ్రీ శిరిడీ సాయినాధార్పణ మస్తు

Wednesday, July 15, 2009

యాంత్రికత ను విడనాడాలి

సనాతన మహర్షులు తమ అమోఘమైన తప: శక్తి వలన ఆలోచనా స్థాయిని ఊర్ధ్వ కేంద్రాలకు అభివృద్ధి చేసుకొని సర్వజ్ఞులై, సర్వ సక్తిమంతులై చరించారు. భూత, వర్తమాన కాలం లతో పాటు భవిష్యత్ లో సంభవించు సంఘటనలను సైతం చూడగలిగే అద్భుతమైన దివ్య ధృష్టి వారికి వుండేది. కాలక్రమేణా కలిప్రభావం వలన అధర్మం పెచ్చు పెరిగి, మాయ మోహావేశాలు మానవాళిని తీవ్రం గా లోబరుచుకొని వారిని ఇంద్రియ లాలసులను చేసింది. ధనార్జనే ప్రధమ కర్తవ్యం గా సాగే జీవితం లో సాధన, అనుష్టానం కుంటుపడ్డాయి. ధర్మం నాలుగు పాదాల నుండి ఒక పాదం మీద నడువసాగింది. తత్ఫలితం గా మానవులు దిగువ స్థాయి శక్తి కేంద్రాల నుంది ఆలోచించసాగారు. ఆనందం,సుఖ శాంతుల స్థానే అలజడి, దు:ఖం, మనో వైకల్యం, అసూయా ద్వేషాలు మానవ జీవితం లో ప్రవేశించాయి. అనుక్షణం భావోద్వేగాలతో సహవాసం చేస్తున్నారు. గౌతమ బుద్ధుడు పుట్టిన ఈ పవిత్ర భారతావనిలో హింస విశృంఖలం గా రాజ్యమేలుతోంది.

మానవాళిని ఇటీవలి కాలం లో పట్టి పీడిస్తున్న మరొక సమస్య యాంత్రికత. తన సహజత్వానికి ముసుగు వేసుకొని జీవిస్తున్న మానవుడు సంకుచిత భావాలతో యాంత్రికం గా జీవించడం అలవాటు చేసుకున్నాడు. పున్నమి వెన్నెలను,ఆకాశం లో మిల మిల మెరిసే నక్షత్రాలను, మంచు బిందువులను, అందం గా అరవిరిసే గులాబీలను, సువాసన లందించే మల్లె మొగ్గలను, చిట్టి చిన్నారుల నవ్వులను చూసి మనస్పూర్తిగా స్పందించే హృదయం గల మానవులు నేడు లక్షల్లో ఒకరు కూడా కనిపించడం లేదు. కళ్ళెం లేని గుర్రాల వలె పరుగులు తీస్తున్న కోరికలను తీర్చుకునే క్రమం లో వేగవంతమైన జీవితాన్ని గడపడం అలవాటు చేసుకున్న మానవుడు మర బొమ్మల వలే అధ్వాహ్నం గా జీవిస్తున్నాడు. జీవితపు మకరందాన్ని ఆస్వాదించడం మరిచిపోయాడు. మనిషి అనుభవిస్తున్న కష్ట, నష్టాలకు, అశాంతికి,యాంత్రికతే ముఖ్య కారణమని మనో వైజ్ఞనికులందరూ స్పష్టం చేస్తున్నారు.

చీమను చూసి వెంటనే స్పందించే భావుకత కల్గిన మహా కవులు పుట్టిన దేశం మనది. క్రమం గా రోబోలతో నిండిపోవడం శోచనీయం.మనిషి ఆలోచనా స్థాయి కూడా అధమపు శక్తి కేంద్రాలకు దిగజారిపోయింది. ప్రస్తుత పరిస్థితులలో ఉన్నత శక్తి కేంద్రాల నుండి ఆలోచించగలగాలంటే కొన్ని జన్మలు పట్టవచ్చు. సూర్యోదయం ఒకప్పుడు రమణీయ ధృశ్యం, ఒక కొత్త జీవితానికి నాందీ వాక్యం. ఎన్నో క్రొత్త ఆశలతో, ఆశయాలతో వచ్చే రోజు నేడు తమ నిద్రకు ఆటంకం గా భావిస్తున్నారు.ఒకప్పుడు నిషేధింపబడిన ఆహార పధార్ధాలను నేడు వివిధ పేరులతో అందంగా ప్యాక్ చేసి ఇస్తే రుచికరంగా అస్వాదిస్తున్నారు.భగవంతుడు సృష్టించిన ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూసి ఆనందించే మనోనేత్రాలు యాంత్రికత ముసుగులో మూసుకుపోయాయి. శాశ్వత ఆనందానికి చిరునామా అయిన మానవుడు అలజడులు,అశాంతికి లోనై , వ్యతిరేక ఆలోచనా విధానం తో సతమవుతూ ఎన్నో రోగాలను ఏరి కోరి తెచ్చుకుంటున్నాడు. ఈ పరిస్థితి మారాలి. మానవాళి ఆలోచనా విధానం మారాలి. శాశ్వత, అశాశ్వత విషయల మధ్య వ్యత్యాసం గమమించగల వివేకం ఉదయించాలి. మన సనాతన మహర్షుల జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. ఆచరణలో మిక్కిలి కష్ట సాధ్యమైనా ప్రయత్నించడం లో దోషమేమీ లేదు కదా ! ప్రశాంత చిత్తం తో జీవించడం, పరుగులు తీసే కోరికల గుర్రానికి కళ్ళెం వేయడం, మృదు భాషణం, సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించడం, సద్గంధ పఠన, వీలైనంతగా నామ సంకీర్తన లేదా నామస్మరణ, పరులకు తమ శక్తి సామర్ధ్యాల సారం సహాయ సహకారాలను అందించడం, శక్తిని బట్టి దాన ధర్మాలను చేయడం ఇత్యాది సత్కార్యాలను విధిగా చేయాలి.ధ్యానం, యోగా వలన తామస, రజో గుణాలు నశించి సత్వ గుణం వృద్ధి చెందుతుంది. అప్పుడు క్రమేపీ అలోచనా స్థాయి దిగువ స్థాయి శక్తి కేంద్రాల నుంది వృద్ధి చెంది ఊర్ధ్వ కేంద్రాలకు పెరుగుతుంది. దు:ఖం, అశాంతి, అలజడి, మనో వికారాలు వాటి కవే మాయమౌతాయి. అప్పుడు శాశ్వతమైన, నిత్యమైన ఆనందానికి మానవుల జీవితం నెలవు అవుతుంది.

సర్వం శ్రీ శిరిడీ సాయి సమర్పయామి

వినయ విధేయతలే శ్రేయోదాయకం

వినయ విధేయతలే శ్రేయోదాయకం

మానవాళిని నేడు పట్టి పీడిస్తున్న దుర్గుణ భూతములలో అత్యంత ముఖ్యమైనది గర్వాహంకారములు. నేడు మానవాళికి ఎన్నడూ లభించని విధం గా భోగ భాగ్యాలు, సుఖ సౌఖ్యాలు లభిస్తున్నాయి. మొత్తం ప్రపంచాన్ని గురించి తెలుపగలిగే కంఫ్యూటర్లు వచ్చాయి. ధనార్జన విపరీతం గా పెరిగింది. జీవితం విలాసవంతం అయ్యింది. వాటితో పాటుగా గర్వాహంకారములు కూడా కొండంత పెరిగాయి. గోరంత తెలిసి వున్నా కొందంత తెలిసిందని విర్ర వీగడం, ఎదుటి వారిని చులకన చేసి మాట్లాడడం, అసభ్య, పరుష పదజాలం తో దూషించడం సర్వ సాధారణమైపోయింది. నేటి మానవాళిలో వినయ, విధేయతలు , వినమ్రత మచ్చుకైనా కానరావడం లేదు.


మనిషికి గర్వం ఎప్పుడూ పనికి రాదు. అణుకువ లోనే అందం వుంది. భగవంతుడు మెచ్చని దుర్గుణం గర్వం. కొందరు పరిస్థితులను గమనించక అన్ని వేళలా గర్వాహంకారములతో మిడిసిపడుతుంటారు. అందరినీ ఎదిరించగలమని దర్పాన్ని ప్రదర్శిస్తుంటారు. శత్రువులు బలం గా వున్నప్పుడు తనను తాను తగ్గించుకొని , తదనంతరం తలెత్తుకు తిరగడం వివేకపూరితమైన చర్య. జీవితం లో ఎదుతయ్యే కష్ట నష్టములు కూడా మనకు శత్రువులే.

ఈ సంధర్భం లో ఒక కధను స్మరించుకుందాం.

ఒక సారి సముద్రుడు తన భార్యలను పిలిచి “ నదులన్నీ తమ ప్రవాహం లో అడ్డుగా వున్న పెద్ద పెద్ద వృక్షాలను, బండలను దుంగలను ఒక ఉదుట్టున పెకిలించి తమతో పాటు తీసుకుపోతున్నాయి. కాని తమ ఒడ్డున వున్న అత్యంత అల్పమైన గడ్డి మొక్కను పెకిలించలేకపోతున్నాయి. ఎన్ని వరదలు వచ్చినా , నదులెంత ఉధృతం గా ప్రవహించినా గడ్డి మొక్క మాత్రం సుఖ జీవనం సాగించగలుగుతోంది. కారణం ఏమిటి ? "అని అడుగగా , సముద్రుని భార్య అయిన గంగాదేవి ముందుకు వచ్చి మిక్కిలి వినయ విధేయతలతో “ స్వామీ ! తాము ఉధృతం గా ప్రవహిస్తున్నప్పుడు మార్గం లో అడ్డుగా వుండే వృక్షాలను , బండ రాళ్ళను అవలీలగా పెకిలించి వేయడానికి కారణం ఆ వృక్షాలు, బండలు నదీ ప్రవాహాన్ని ఎదిరించ యత్నించడమే. అదే ఒడ్డున వుండే గడ్డి మొక్క ప్రవాహం వచ్చినప్పుడు అణిగి వుంటుంది. ఉధృతం తగ్గాక తిరిగి తలెత్తుకు నిలబడుతుంది. ఆ గడ్డి మొక్క యొక్క సమయోచిత ప్రవర్తనే దానిని అన్ని ఉపద్రవాలకు ఎదురు నిలవగలిగే శక్తిని ఇస్తోంది.” ఆని వివరించింది.

ఈ కధ మానవులకు అణుకువ, విధేయతల ఆవశ్యకత గూర్చి అద్భుతం గా తెలియజేస్తోంది. కష్ట నష్టాలు, ఆందోళనలు ప్రతీ వారి జీవితం లో తప్పని సరి. చీకటి వెనుకే వెలుగు, రాత్రి వెనుకే పగలు వలె కష్టం తర్వాత సుఖం రావడం తప్పని సరి. కష్టాలు వచ్చినప్పుడు గర్వాహంకారములతో ప్రవర్తించరాదు. ఆ కష్టాలను ఎదిరించి నిలనగలిగే శక్తి వున్న వారి విషయం వేరు. వాటిని ఎదిరించి, ఎదురెడ్డి నిలువలేని వారు తమ శక్తి సామర్ధ్యాలను గ్రహించుకొని, గర్వాహంకారాలను విడిచి పెట్టి, అణిగి మణిగి వుండగలిగితే ఎలా వచ్చిన కష్టం అలానే పోతుంది. తిరిగి జీవితం లో ఆనంద పరిమళాలు విరబూస్తాయి. అట్లా కాక తగినంత శక్తి సామర్ధ్యాలు లేకపోయినా కష్టాలకు, ప్రతికూల పరిస్థితులలో ఎదురు నిలిచితే వినాశనం ఖాయం.

ధుర్యోధనుడికి పాందవులను ఎదిరించగల శక్తి సామర్ధ్యాలు లేవు.అయినా గర్వాహంకారాల వలనే వారితో ఏరి కోరి శత్రుత్వం తెచ్చుకొని చివరకు దుర్భరమైన మరణం పొందాడు. రావణాసురునికి శ్రీ రాముని ఎదిరించగల శక్తి లవలేశమైనా లేదు. సీతాపహరణం గావించి, ఎందరు హితవు చెప్పినా పెడచెవిన పెట్టి, సీతను రామునికి అప్పగించక, ఏరి కోరి విరోధాన్ని తెచ్చుకొని , యుద్ధం లో బంధు మిత్ర, సపరివారాన్ని మొత్తం పోగొట్టుకొని చివరకు హతం అయ్యాడు. ఎదుటివారి గొప్పదనాన్ని తెలుసుకోకుండా అయిన దానికి, కానిదానికి అహంకారం తో విర్రవీగడం, ప్రతీవారు తన కంటే అల్పులని భావించి మిడిసిపడడం వినాశన కారి అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. వినయ విధేయతలు మనిషికి అందానిచ్చే ఆభరణాలు. అందుకే ఏమీలేని తాటాకు ఎగిరెగిరి పడ్తుంది, అన్నీ వడ్డించిన అరిటాకు అణిగి మణిగి వుంటుందని మన పెద్దలు చెబుతూ వుంటారు.

సర్వం శ్రీ శిరిడి సాయినాధార్పణ మస్తు

Tuesday, July 14, 2009

స్వధర్మాచరణ వైశిష్ట్యం

స్వధర్మాచరణ వైశిష్ట్యం

శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో (కర్మ యోగం, 35 వ శ్లోకం) ఈ విధం గా ప్రవచించారు:

శ్రేయాన్ స్వధర్మ విగుణ : పరధర్మాత్స్వ నుష్టితాత్
స్వధర్మ నిధనం శ్రేయ: పరధర్మో భయావహ:

“ ఓ అర్జునా ! ఎంతో నైపుణ్యం తో ఆచరించే పరధర్మం కన్నా , గుణరహితం గా చేసినప్పటికీ స్వధర్మమే మేలు. స్వధర్మ నిర్వహాణార్ధం సమసిపోయినా మంచిదే కాని, అమరణాంత భయావహమైన పరధర్మానుష్టానం మాత్రం తగదు."

ఈ ప్రపం చం లో మానవులకు వారి వారి కుల, మత,ప్రాంతీయ దేశ కాలమాన పరిస్థితుల ధృష్ట్యా విధించబడిన కర్మలను చేయుట, ధర్మమును ఆచరించుట వారికే కాక యావత్ సమాజానికే ఎంతో శ్రేయస్కరం. జన్మత: ప్రాప్తించిన కర్తవ్యాలను నిర్వహించడమే స్వధర్మాచరణ.

మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధం లో ప్రతిపక్షం లో తాతలు,తండ్రులు, సోదర సమానులు,గురుతుల్యులు, వున్న కారణం గా అర్జునుడు మాయామోహం లో పడి మనస్థాపం చెంది విల్లును క్రింద పడవైచి యుద్ధం చేయలేనని అశక్తత వెల్లడించినప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు స్వధర్మాచరణ గూర్చి అత్యద్భుతం గా బోధ చేసారు. : దేశ ప్రజల రక్షణ కోసం, అధర్మాన్ని శిక్షించేందుకు , ధర్మ పరిరక్షణ గావించేందుకు యుద్ధం చేయుట క్షత్రియ ధర్మం. ఈ ధర్మచరణ లో అసువులు బాసినప్పటికీ వీరస్వర్గమే ప్రాప్తిస్తుంది. అట్లు కాక వెన్ను చూపి పలాయనం చిత్తగిస్తే స్వధర్మాచరణ గావించని కారణం గా రౌద్రవాది నరకములు ప్రాప్తిస్తాయి. కావున నీ క్షత్రియ ధర్మమును నెరవేర్చు” అని అర్జునుడికి హితబోధ చేసి కర్తవ్యన్ముఖుడిని గావించారు. పై ఉదంతాన్ని బట్టి స్వధర్మాచరణకు తమకు విధించిన కర్తవ్య నిర్వహణకు శ్రీ కృష్ణ భగవానుడు విశిష్ట స్థానం కల్పించారు.

స్వధర్మమనగా మనకు విధింపబడిన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని ప్రతీ ఒక్కరు సక్రమంగా నిర్వహించడం వలన వ్యక్తిగతం గానే కాక సమాజ పరం గా కూడా శ్రేయస్సు ఒనగూరుతుంది.

పాలకులు నిష్పక్షపాతం గా తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ, బంధుప్రీతికి, అవినీతికి తావ్వివక నిరంతరం తావివ్వక నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే దేశం అత్యున్నతం గా పురోగమిస్తుంది. ఉపాధ్యాయులు అకుంఠిత దీక్షతో , నిస్వార్ధం గా పాఠ్య బోధన గావిస్తూ విధ్యార్ధులలో క్రమశిక్షణ నెలకొల్పేందుకు కృషి చేయాలి. మత ప్రచారకులు , గురువులు సంకుచిత బుద్ధిని విడనాడి ధర్మాధర్మముల మధ్య వ్యత్యాసాన్ని , ధర్మాచరణ యొక్క వైశిష్ట్యాన్ని ప్రజలకు తెలియజేసే కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలి. రైతులు వ్యవసాయాన్ని,వ్యాపారులు ఎక్కువ లాభాలకు ఆశ పడక ప్రజలకు ధర్మ బద్ధంగా తక్కువ ధరలకే వస్తువులను విక్రయించడం, కార్మీకులు క్రమశిక్షణతో నాణ్యమైన వస్తువుల ఉత్పత్తికి కృషి చేయడం,పోలీసులు అవినీతికి తావ్వివక అక్రమార్కులను శిక్షించడం, శాంతి భద్రతలను కాపాడేందుకు చిత్త శుద్ధితో కృషి చేయడం –ఇలా ప్రతీ ఒక్కరు తమకు నిర్దేశింపబడిన కర్తవ్యాన్ని క్రమశిక్షణతో నిర్వర్తిస్తే మన సమాజం లో అన్ని అసమానతలు తొలిగి పురోగమిస్తుంది.గాంధీ మహాత్ముడు కలలు గన్న రామరాజ్య స్థాపన సాధ్యం.

గుణరహితమైనా ,కష్ట సాధ్యమైనా స్వధర్మాచరణయే అన్నింటి కంటే మేలైనది. పర ధర్మాచరణ మానవుని వినాశనానికి దారి తీస్తుంది. సమాజం లో అశాంతి, అలజడులు, అసమానతలు నెలకొనడం ఖాయం. జన్మత: ,వృత్తి వలన ప్రాప్తించిన స్వధర్మాన్ని విడవడం, పరధర్మాన్ని ఆచరించడం ఎంత మాత్రం తగదు. స్వధర్మం ఆచరించిన ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి మొదలైన వారు చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. మాకు ఒక మతం వలన మేలు కావడం లేదని ఇతర మతములను ఆశ్రయించేవారు ఈ విషయం లో సక్రమం గా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. జన్మత: సంక్రమించిన మతం పితృ సమానం. జన్మ నిచ్చిన తండ్రిని మార్చడం ఎంత పాపభూయిష్టమో మత మర్పిడి కూడా అంతే. దాని వలన బ్రహ్మ హత్యా పాతకం వంటి భయం కరమైన దోషాలు సంక్రమించడం తో పాటు రౌద్రవాది నరకముల ప్రాప్తి తప్పదు. అందుకే స్వధర్మాచరణే మిక్కిలి శ్రేష్టం

సర్వం శ్రీ శిరిడీ సాయినాధార్పణ మస్తు

Monday, July 6, 2009

కవితా సమాహారం - 20

సహవాసం

ఏవరి పిచ్చి వారికానందం
తానే తెలివైనవాడినని ఇతరులందరూ అధములని
భావించు వారు అధమాధములు
మనసుకు, వ్యక్తిత్వానికి ముసుగులు ధరించి
మేక పోతు గాంభీర్యం
ప్రదర్శించుట అవివేకం
దిగువ స్థాయి శక్తి కేంద్రముల నుండి
ఆలోచనలు చేయుట
తదనుగుణముగా కార్యములను చేపట్టుట
నైతిక పతనానికి నిదర్శనం
నిత్యం భావోద్వాగాలతో సహవాసం
మన దుఖములకు మూల కారణం

కార్పరేట్ ఆసుపత్రులు

ఇదేం ఆసుపత్రి నాయనోయ్
డబ్బుతో, డబ్బుకొరకు
డబ్బు మదం తో వైద్యమందించే
కార్పొరేటు ఆసుపత్రులు ప్రజల పాలిటి
నరక కూపాలు,వ్యాపార కేంద్రాలు
డబ్బిస్తేనే నాడి చూడడానికి సంసిద్ధం
ప్రాణాలు పోతున్నా డబ్బు వాసన పడనిదే
కదలికలు రాని డాక్టర్ బాబులు
వారినే నమ్ముకొని వున్న పరీక్షకులకు
అను నిత్యం పండగే
అన్ని రకాల అవసరం లేని టెస్టులను చేయించి
జలగల వలె డబ్బు గుంజే వైనం బాధాకరం
అడ్డగోలుగా ధన దోపిడీ జరుగుతున్నా
నిమ్మకు నీరెత్తనట్లు మిన్నకుండే అధికారులు
పేదవారికి నాణ్యమైన వైద్యం
ఎప్పటికీ నిజం కాని సుదూర స్వప్నం

Wednesday, June 3, 2009

కవితా సమాహారం-19

మానవ జీవితమునకు సార్ధకత

ఆతి విలువైన మానవ జన్మకు సార్ధకత
సాధించుట అత్యావశ్యకం
సనాతన మహర్షుల , మహాత్ముల
జీవన విధానమే మనకు ప్రమాణం
పావురాయి కోసం దేహార్పణ గావించిన బలి
రాక్షస వినాశనార్ధం తపశ్సక్తితో
దేహపుటెముకలను వజ్రాయుధం కొరకు
అమరేంద్రునకు అర్పించిన దధీచి
సత్య జీవనం కొరకు
భార్యా బిడ్డలనమ్ముకొని కటిక దరిద్రం
అనుభవించిన హరిశ్చంద్రుడు
యావత్ జీవితం మృదుభాషణం, సత్యవాక్కు కోసమే
వెచ్చించిన ధర్మరాజు
కరుణతో ప్రపంచమును జయించిన జీసస్
మహమద్ ప్రవక్తలు మనకాదర్శం
వారు జూపిన జీవన మార్గములో
సూటిగా సాగిపోవుటయే మన కర్తవ్యం

దాన గుణం

అన్ని ప్రధాన ధర్మములలో దానగునమే మిన్న
నిత్యం మనకు లభించే ధనం
మన కొరకే కాక పరులకు పంచే
భాగ్యం కల్పించిన భగవంతునికి వందనం
అన్నదానము,వస్త్ర దానము, మాట దానము
తప్పక ఆచరించవల్సిన కర్మలు
ధన దానమునకు పాత్రత అత్యావశ్యకం
ధనము పరులను సోమరులను
చేయరాదన్నదే నిబంధన
అస్సహాయులను, దీన జన బాంధవులను
అన్నార్తులను ఆదుకొనుటయే మన కర్తవ్యం
కష్ట, నష్టములలో, కన్నీళ్ళ కడలిలో వున్నవారిని
రోగపీడితులకు స్వలాభపేక్ష లేక
ఆదుకొను వారికి శ్రిహరి ఆశ్వీర్వవచనములు లభ్యం

మహాత్ముల లక్షణములు

జ్ఞానం, క్షమ, జాలి, కరుణ,ప్రేమ
ఇంద్రియ నిగ్రహం,సత్య వాక్కు, దానం
ఇత్యాది సద్గుణములు గలిగినవారందరూ
పరమాత్మ స్వరూపులే
అట్టి వారి హృదయములయందు
ఆ సర్వేశ్వరుడు సదా కొలువైవుండును
ఈ జనన మరణ చక్రభ్రమణం నుండి
విడిపడి మోక్షమును పొందెదరు
సామాన్య మైన జీవితం గడుపుతూ
రవ్వంత ఉనికి కూడా లేని
మనవంటి వారందరికీ
అట్టి దివ్యత్వం సాధించుట సాధ్యమే
కఠోర శ్రమ, తపన
లక్ష్యం, ప్రణాళిక ద్వారా
మహనీయత్వం సాధించుట సాధ్యం

Monday, June 1, 2009

కవితా సమాహారం - 18

దాన ధర్మములు

అదాన దోషేణ భవే దరిద్ర:
దాన ధర్మములు ఒనరించక
మానవులకు మరు జన్మలో దరిద్రులుగా
జన్మ నెత్తడం ఖాయం
న్యాయ పరమైన సంపాదనలో
తృణమో, పణమో లేనివారికి
దనమిచ్చుట అత్యావశ్యకం
తన కొక ఉనికి కల్పించి
ఎదుగుదలకు పునాది కల్పించిన
సమాజమునకు చేయూత నందించుట
ఋణము తీర్చుకొనుట అవశ్యం
శ్రద్ధతో, నిశ్చయం తొ
నిస్వార్ధ బుద్ధితో దానమిచ్చు
గుణం అలవరచుకోవలెను
ఇవ్వని వారికి భవిష్యత్తులో
ఇవ్వబడదు అన్నది శాస్త్ర ఉవాచ
ప్రేమతో, కరుణతో, జాలితో
ప్రతిఫలాపేక్ష ఆశించక ఇచ్చువారికి
భగవంతుని అపూర్వ
కరుణా కటాక్షములు శ్రీఘ్రమే లభించును

దాన గుణమే శ్రేష్టం

దాన గుణం తోనే మనవుడు అగును ధర్మాత్ముడు
ఇతరులకు ఆదర్శవంతుడు,భగవత్స్వరూపుడు
సమాజ హితమును కాంక్షిస్తూ
చిత్త శుద్ధితో కృషి సల్పుతూ
ఉత్తమ విలివలకు ఆలంబనౌతాడు
దానం చేయుట హస్తమునకు భూషనం
గొప్ప సౌశీల్యం
తన కొరకు కాక ఇతరులకు
ధనమును ఖర్చు చేయుట
మహాత్ముల లక్షణం
అపాత్ర దానం కూడదు
మానవ జీవితం దాన ధర్మములతోనే
ముడిపడి వుందన్నది గొప్ప సయం
సద్గతికి మార్గము
ఉత్తమ జీవితమునకు నాంది
దాన గుణముతో చరిత్ర కెక్కిన
కర్ణుడు, బలి చక్రవర్తి మనకు ఆదర్సం
పిసినారితనం అతి ప్రమాదకరమైన వ్యాధి
మానవులను అధమ: పాతాళానికి తొక్కి వేయును
జీవితం క్షణ భంగురమని గుర్తించి
దాన ధర్మములను విశేషముగా
ఒనరించుట మన తక్షణ కర్తవ్యం

Saturday, May 23, 2009

కవితా సమాహారం - 17

ఆలౌకిక ప్రేమ

ఆన్ని ప్రేమల కంటే అలౌకిక ప్రేమ దివ్యమైనది
నిస్వార్ధము, దయపూరితము
బేధ భావము లేనిదియు
దివ్యత్వమును సంతరించుకున్నది
భగవంతుని సన్నిధికి చేర్చునది
సకల జీవులతో ఆత్మానుసంధానము చేయునది
ఇంతింతై వటుడింతై అను రీతిన
దిన దిన ప్రవర్ధమానము చెంది
ప్రాపంచిక విషయములయందు
విముఖత భావం ఏర్పరిచి
మానవులను మహనీయత్వము వైపుకు
మోక్ష మార్గమందు నడిపించి గమ్యమునకు
అవలీలగా చేర్చునది అలౌకిక ప్రేమ
అలౌకిక ప్రేమ సాధించుటకు
భగవంతుని యందు భక్తి, తపన
మధుర హృదయము అత్యావశ్యకం


దురాశ

అత్యాశ,స్వార్ధ చింతన అన్ని
వ్యాధుల కంటే అతి ప్రమాదకరము
సృష్టిలో అన్నియూ తనకే చెందవలెనన్న
స్వార్ధ చింతనతో జీవించే
మానవుల హృదయములు దురాశాపూరితం
సర్వ జీవరాశులకు ప్రకృతి ఫలములు
సమనముగా లభింపవలెనన్న
ఒక్కరి కొరకు అందరరం
అందరం కొరకు ఒక్కరం అను
సృష్టి ధర్మములను మరిచి
అధర్మముగా, అన్యాక్రాంతముగా
సర్వం చేజిక్కించుకోవలెనన్న
మానవుల దురాశ దుఖమునకు చేటు
చివరకు ప్రకృతి మాత ఆగ్రహమునకు
గురి కావడం తధ్యం

కవితా సమాహారం - 16

ఆలౌకిక ప్రేమ

ఆన్ని ప్రేమల కంటే అలౌకిక ప్రేమ దివ్యమైనది
నిస్వార్ధము, దయపూరితము
బేధ భావము లేనిదియు
దివ్యత్వమును సంతరించుకున్నది
భగవంతుని సన్నిధికి చేర్చునది
సకల జీవులతో ఆత్మానుసంధానము చేయునది
ఇంతింతై వటుడింతై అను రీతిన
దిన దిన ప్రవర్ధమానము చెంది
ప్రాపంచిక విషయములయందు
విముఖత భావం ఏర్పరిచి
మానవులను మహనీయత్వము వైపుకు
మోక్ష మార్గమందు నడిపించి గమ్యమునకు
అవలీలగా చేర్చునది అలౌకిక ప్రేమ
అలౌకిక ప్రేమ సాధించుటకు
భగవంతుని యందు భక్తి, తపన
మధుర హృదయము అత్యావశ్యకం


దురాశ

అత్యాశ,స్వార్ధ చింతన అన్ని
వ్యాధుల కంటే అతి ప్రమాదకరము
సృష్టిలో అన్నియూ తనకే చెందవలెనన్న
స్వార్ధ చింతనతో జీవించే
మానవుల హృదయములు దురాశాపూరితం
సర్వ జీవరాశులకు ప్రకృతి ఫలములు
సమనముగా లభింపవలెనన్న
ఒక్కరి కొరకు అందరరం
అందరం కొరకు ఒక్కరం అను
సృష్టి ధర్మములను మరిచి
అధర్మముగా, అన్యాక్రాంతముగా
సర్వం చేజిక్కించుకోవలెనన్న
మానవుల దురాశ దుఖమునకు చేటు
చివరకు ప్రకృతి మాత ఆగ్రహమునకు
గురి కావడం తధ్యం

Friday, May 22, 2009

కవితా సమాహారం - 15

సమ సమాజ స్థాపన

ద్వేషమును పోగొట్టు గొప్ప ఔషధం ప్రేమ
స్వార్ధ చింతనకు తావివక
సర్వం త్యాగమొనర్చి
తన కొరకు కాక
తన కంటె దురదృష్టవంతులు
ఈ సృష్టి యందు గలరని గ్రహించి
పరుల కొరకు జీవిస్తూ
వారి హితమును కాంక్షిస్తూ
అందుకై చిత్త శుద్ధిగా కృషి సల్పుతూ
సమసమాజ స్థాపన కొరకు
తన వంతు చేయినందించి
ముందుకు సాగు వారు మహాత్ములు

ప్రేమ .. ప్రేమ.. ప్రేమ

ఈ సృష్టికి మూలం ప్రేమ
ప్రేమను మించిన పవిత్ర వస్తువు
ప్రేమకు సరి తూగగల శక్తి లేవు
నిస్వార్ధ ప్రేమ పునాదులపై
నిర్మింపబడ్డ ప్రపంచం శక్తివంతం
కుల,మత, వర్గ బేధములకు
అతీతముగా హృదయములయందు జనించెడి
అపురూప,అసామాన్య భావన ప్రేమ
అలౌకిక ప్రేమకున్న మహత్తు అనిర్వచనీయం
అన్ని రోగముల కంటే ప్రేమ రాహిత్యం ప్రమాదం
ప్రేమించలేని,ప్రేమింపబడని
వారి జీవితం కడు వ్యర్ధం

Thursday, May 21, 2009

కవితా సమాహారం - 14

ఆత్మ సౌందర్యం

బాహ్య చక్షువులతో ,కోరికల నిషాతో
భౌతిక సౌందర్యమును ఆస్వాదించువారు అధములు
మనో నేత్రములతో అంతర్ సౌందర్యమును
వీక్షించువారు దయామయులు,మహాత్ములు
అద్భుత, అపురూపమైన శిల్పి యగు
సర్వేశ్వరుని సృష్టిలో అందవిహీనమైదని ఏది ?
జడత్వం నిండిన వస్తువులయందు సైతం
ఆత్మ సౌందర్యం నిండి వున్నది
వీక్షించు వ్యక్తుల దృష్టి లోనే
సౌందర్యం అంతరం
పరిశుద్ధమైన ప్రేమతో
సౌందర్య భరితమైన
హృదయములే సర్వేశ్వరుని ఆలయములు

పరుల సేవ

పరిశుద్ధమైన , కరుణాపూరితమైన
సేవా తత్పరత భావముతో , దైవ ప్రేమతో
కర్మ యోగ భావన గల
హృదయం భగవంతుని ప్రేమాలయములు
పరుల సేవయే పరమోత్కష్టం గా భావించి
అద్యంతం జీవించిన గాంధీ జీ మనకాదర్శం
వృత్తి ధర్మమును సత్య మార్గములో
తపము వలె ఆచరించు వారందరూ మహాత్ములే
నిష్కామ, నిస్వార్ధ సేవ వలన
దుష్కృతి లేని మహా పాపములన్నీ మటుమాయం

కవితా రచన : సాయి ఋత్విక్

Sunday, April 5, 2009

కవితా సమాహారం - 13

శ్రీ సాయి లీలావైభవం

నిర్గుణులు, నిరాకారులు, పరబ్రహ్మ స్వరూపులు
స్వప్రకాశకులు, భక్తులను సదా బ్రోచెడి
శ్రీ శిరిడీ సాయినాధులకు వందనం
ఆడంబరమైన పూజలు,యజ్ఞాలు
అట్టహాసముగా చేయు జప, వ్రతములు వలదని
హృదయశుద్ధితో ఒనర్చు సాయి సాయి అను
నామజపమే చాలుననియు
తలచిన తక్షణమే బ్రోచెదనని
వాగ్దానమొనర్చిన దయాళువు
జీవిత నౌకకు సరంగుగా చేసుకొనిన
సర్వమూ తానై నడిపే సమర్ధ సద్గురువు
నమ్మిన వారిని నట్టేట ముంచనని వాగ్దానము సల్పి
సర్వస్య శరణాగతి ఒనరించిన
భక్త జనావళికి తోడూ నీడై నిలిచి
చివరి కంటా గమ్యం చేర్చే దీన బంధువు
భక్తుల పాలిటి కల్పవృక్షము
భక్త జన వంద్యుడు శ్రీ సాయినాధుడు


గురుస్తుతి

నామ, రూపములు లేని హృదయజ్యోతి
బ్రహ్మ తేజం, నిరాకార పరబ్రహ్మం
సమిష్టి విరాట్ పురుషుడు
యద్భావం తద్భవతి రీతిన
విభిన్న భక్తులకు విభిన్న రూపములలో
దర్శన మిచ్చి కోరిన వరములనిచ్చిన పరబ్రహ్మం
సకల జీవులయందు సదా కొలువై వుండెడి
నిరాకార జ్యోతి స్వరూపం శ్రీ సాయినాదుడు
శాశ్వత ఆత్మ అమృత స్వరూపం
గోచరించే విశ్వమంతా నిండి వున్న ఆత్మ శక్తి
ప్రకాశైక స్వరూపుడు, అయోనిజ సంభవుడు
పరమ పవిత్రుడు, త్రిగుణాతీతుడు
విశుద్ధ విజ్ఞాన స్వరూపుడు
శాశ్వతమగు పరమానందములో
సదా ప్రకాశించెడి శుద్ధ చైతన్య స్వరూపుడు
భక్తజన వంద్యుడు సమర్ధ సద్గురువు శ్రీ సాయి

Tuesday, February 10, 2009

కవితా సమాహారం - 12


ఆన్న దానం

ఆన్ని దానములలో కెల్లా అన్న దానం శ్రేష్టం
ఆకలి బాధతో తాళలాడేవారికి పిడికెడు
అన్నం ఇచ్చి క్షుద్భాధ ను తగ్గించిన
అన్ని సత్కర్మల కంటే శ్రేష్టమైనది
అన్న దానం వివేకంతో చేయదగిన అద్భుతమైన
అతి పవిత్రమైన సత్కార్యం
తద్వారా అపారమైన పుణ్యం లభ్యం
ఉత్తమ గతులు ప్రాప్తి తధ్యం
పాత్రత నెరిగి అన్న దానం చేయుట తప్పనిసరి
చేసిన వారికి సద్గతి , పాపహరణం,
స్వీకరించిన వారికి తృప్తి
కలుగవలెనన్న వేద ధర్మం విస్మరించరాదు
అన్న దానం పేరిట సోమరులను పోషించుట తగదు
మంచి చెడుల నాలోచించి , వివేకంతో వ్యవహరించి
అన్న దానం చేయుట అన్ని పాపాలకు నిష్కృతి


దేహమే దేవాలయం

హృదయం కు మించిన దేవాలయం లేదు
నిర్మలమైన అంత కరణములతో
పరిశుద్ధమైన మనసుతో
అరి షడ్వర్గములను లోబరుచుకొని
సుఖ దుఖములను సమానంగా
స్వీకరించగల సమ దృష్టిని సాధించి
ఈశ్వరేచ్చ లేనిదే చిగురుటాకైననూ కదలదన్న
వివేకమును సాధించి
లభించునంతయూ భగవంతుని అనుగ్రహమేనన్న
ప్రసాద భావంతో జీవిస్తూ
పరుల హితాన్ని మనస్పూర్తిగా కాంక్షిస్తూ
సర్వ మానవ సౌభ్రాతృత్వం, సర్వ జీవ సమానత్వం
నిత్య జీవితం లో అభ్యాసమొనరిస్తూ
శాంతియుత జీవనం సాగించువారి హృదయములలో
భగవంతుడు సదా కొలువై వుండును
అట్టి వారికి ఆలయ దర్శనం ఆవశ్యకత లేదు

Monday, February 9, 2009

కవితా సమాహారం - 11

అంత శుద్ధి

ఛిత్త శుద్ధ్జి లేని శివ పూజ లేలరా ?
కోపం, ద్వేషం నశించనిదే
ఎన్ని శాస్త్రములను అధ్యయనం చేసిననూ ప్రయోజనం శూన్యం
అసూయ తొలగనిదే, హృదయం పరిశుద్ధం కానిదే
ఎన్ని జప తపస్సులను ఒనరించిననూ ఫలితం శూన్యం
ఆడంబరమూ కోసం బాహ్యోపాటంగా
చేసెడు యజ్ఞములు సైతం ఫలించవు
కామ క్రోధాధి దుర్గుణములకు దూరం గా జీవిస్తూ
నితం సత్యం తో సహజీవనం చేస్తూ
పుష్పం, నీరు సమర్పించిననూ
భగవంతుడు ప్రీతికరం చెందుట తధ్యం
అంత శుద్ధిని సాధించి
సత్యమైన సర్వోత్తమునిగా
జీవించుటయే మన లక్ష్యం కావాలి !


శ్రీ కట్న లీలలు

లక్షలకు లక్షలు మార్కెట్లో రేటు పలికినప్పుడు
మగమహారాజునని గర్వ పడ్డాను
ఎక్కువ రేటు ఇచ్చిన వారికి తల వంచి
ఆమె మెడలో తాళి కట్టాను
అప్పట్నుంచి ఓడలు బళ్ళయినట్లు
నా జీవితం తలకిందులై పోయింది
డబ్బిచ్చి కొనుక్కునందుకు
పెత్తనం చెలాయించింది
ఆఫీసులో పులిలా బాసునైన నేను
ఇంట్లో పిల్లినై పోయి ఆమె పాదాలకు
దాసోహం అనవల్సి వచ్చింది
ఆడ బాసు ఎదురుగా నోరు మెదపని స్థితి
అన్నింటికీ తందాన తానాయే నా పాట
గాడిద చాకిరీ చేస్తూ కట్నం గా తీసుకున్న
ప్రతీ పైసాకు చెమట నోడ్చే బ్రతుకు
కను చూపు మేరలోనికి రాలేని నా తల్లిదండ్రులు
తిరగబడదామంటే గృహ హింస చట్టం క్రింద
నేరం మోపించి కటకటాల వెనక్కి
నెట్టిస్తానని బెదిరింపులు
కట్న మాశించి నన్ను అమ్ముడుపోయినందుకు
తగిన శాస్తే జరిగిందని మురిసిపోతున్న అత్తవారు
ఏం చెయ్యనురోయ్ దేవుడా ?
నా జీవితం అందరికీ గుణపాఠం

Sunday, February 8, 2009

కవితా సమాహారం - 10

దురాశ

దురాశ దు:ఖానికి హేతువు
కష్టానికి తగు ఫలిత మాశించక
అధికమైన కోరికలతో పరుగులు
తీయువారి జీవితం నిత్యం అశాంతిమయం
చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా !
ప్రయత్న సిద్ధి పైనే ఫలితం ఆధారం
అందనిది, అలవి కాని ఫలాన్ని అందుకోవాలని
యత్నించిన తప్పదు భంగపాటు
దురాశా రాహిత్యాన్ని అలవర్చుకొని
స్పష్టమైన లక్ష్య సాధనతో
చిత్త శుద్ధితో ప్రయత్నం గావించి
తుది ఫలితాన్ని భగవదార్పణ గావించి
ముందడుగు వేసిన వారే విజయ శిఖరాలను
అతి సులభం గా అధిరోహించగలరు

తృష్ణా రాహిత్యం

తృష్ణా రాహిత్య మనే సద్భుద్ధిని అలవరచుకొని
దురాశ, అత్యాశలను త్యజించి
అమూల్యమైన జీవితాన్ని శాంతిమయం
చేసుకోమన్న శంకర భగత్పాదుల
దివ్యోపదేశం మనకు సదా అనుసరణీయం
పేరాశకు పోయిన జీవితం దుఖ భాజనమగును
ఏది లభించినూ భగవంతుని అనుగ్రహమన్న
దివ్య భావనతో, సంతృప్తితో జీవించువారి
హృదయం సదా శాంతిమయం
కష్టాళ్ళు, కన్నీళ్ళు, అశాంతి కడు దూరం
నిరంతరం అతి వేగంతో పరుగులు తీసే
కోరికల గుర్రానికి కళ్ళెం వేసి
మనస్సును తపస్సుతో నిగ్రహించి
సంతృప్తితో దురాశకు లోను కాక
నిరంతర కృషితో జీవితమును
గడపడమే వివేకవంతుల లక్షణం