Sunday, February 24, 2008

నేను చదివిన ఒక మంచి కధ - నాన్నా ! క్షమించండి

27-02-08 తేదీ గల నవ్య వార పత్రిక (కాజల్ ముఖ చిత్రం) లో నాన్నా ! క్షమించండి అన్న పేరుతో వచ్చిన ఒక కధను చదివాను. ఈ కధకు రచయిత ఎం, వెంకటేశ్వర రావు. మానవతా విలువలు, అభ్యుదయ భావాలు అంతరించిపోతున్న ప్రస్తుత తరుణం లో ఈ విలువలను కాపాడెందుకు ఒక యువకుడు చేసిన ప్రయత్నాన్ని ఈ కధలో అత్యద్భుతం గా ఆవిష్కరించారు. నాన్నా క్షమించండి అంటూ ఒక కొడుకు తన కన్న తండ్రికి రాసే ఉత్తరం తో ఈ కధ ప్రారంభమౌతుంది.అన్నయ్య, అక్కయ్య లు మంచి చదువులు చదివి జీవితం లో సెటిలై పోయారు. తమ్ముడి కి మాత్రం చదువు చక్క గా అబ్బలేదు.అత్తెసర మార్కులతో డిగ్రీ పాసవుతాడు. సహజం గానే పెద్ద వాళ్ళు చక్కని విద్యావంతులు అవడం వలన చిన్న వాడం టే చులకన భావం తమ్ముళ్లకు ఏర్పడుతుంది.

చిన్నవాడు బ్యాంకు పరీక్షలకు ప్రిపేరవుతుందగా తండి కొలీగ్ వచ్చి బ్యాంకు పేపరు ను అందించి ఈ మోడల్ పేపరు ప్రకారం ప్రిపేరవమని చెబుతాడు. ఆశ్చర్యం గా అదే పేపరు పరీక్షలో వస్తుంది. సరిగ్గా అక్కడే మన కధా నాయకుడిలో అంతర్మధనం ప్రారంభమౌతుంది. లీకయిన పేపరును చూడగానే అతనికి అసంతృప్తి, ఆత్మవంచనగా అనిపిస్తుంది.కష్టపడి చదివి అక్కడికి వచ్చిన తన తోటి వారిని మోసం చేయకూదదని నిర్ణయించుకుంటాడు. అప్పుదే విద్యార్ధి సంఘాల వారు వచ్చి పరీక్షను రద్దు చేయిస్తారు.జరిగిన విషయాన్ని చెబుదామని తనకు సహాయం చెసిన అంకుల్ ఇంటికి వెళ్లగా అక్కడ తన తండ్రే ఎంతో డబ్బు వెచ్చించి పరీక్షా పేపరును తన కోసం కొన్నాడని తెలుస్తుంది. జీవిత మంతా అంకిత భావం తో, క్రమ శిక్షణతో పని చెసిన తన తండి తన కోసం మొదటిసారిగా తప్పుడు పని చేసాడని తెలుసుకున్న మన కధా నాయకుడు తన తండి నుండి నేర్చుకున్న క్రమ శిక్షణ , నిజాయతీలను పెట్టుబడిగా ఒక చిన్న పరిశ్రమను స్థాపించాలన్న నిర్ణయం తీసుకొని, అదే విషయాన్ని తన తండ్రికి తెలియజెస్తాడు. ఈ ప్రయత్నం తప్పనిపిస్తే క్షమించమంటు తన ఉత్తరాన్ని ముగిస్తాడు.

రచయిత ఒక విభ్భిన్నమైన కధ వస్తువును ఎన్నుకొని, దానికి ఒక చక్కని రూపం ఇవ్వడం లో 100 శాతం మర్కులు కొట్టేసారు. స్వార్ధమే ఊపిరిగా బ్రతికే మన నవతరం యువకులకు ఈ కధ ఒక కనువిప్పు కాగలదు.రచయిత యొక్క శైలి, భావ ప్రకటన చలా బావున్నాయి. సాహిత్య అభిమానులందరూ తప్పక చదవవలసిన కధ ఇది.

No comments: